
సీతక్కను అరెస్టు చేస్తున్న పోలీసులు
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రంలోని ఏ ఒక్క వర్గమూ సంతృప్తిగా లేదని, ప్రజలు నిరాశా నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నారని ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ప్రజా సమస్యలపై చర్చిద్దామంటే ప్రతిపక్ష పార్టీ అయిన తమకు అసెంబ్లీలో అవకాశం ఇవ్వలేదని, అర్ధంతరంగా అసెంబ్లీ సమావేశాలను ముగించుకుని వెళ్లిపోయారని ఆమె ధ్వజమెత్తారు. శుక్రవారం రైతు సమస్యలపై కాంగ్రెస్ పార్టీ కిసాన్‌సెల్ ఆధ్వర్యంలో చేపట్టిన చలో ప్రగతిభవన్ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే సీతక్క, కిసాన్‌సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి ప్రగతిభవన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు వారి ప్రయత్నాన్ని భగ్నం చేశారు. నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి గోషామహల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా సీతక్క పోలీస్‌స్టేషన్‌వద్ద, అనంతరం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నిరసన వ్యక్తం చేసేందుకు కూడా అవకాశమివ్వక పోవడం దారుణమన్నారు. ప్రభుత్వం అసెంబ్లీలో కూడా రైతుల సమస్యలపై చర్చించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది టీఆర్‌ఎస్ సర్కార్ నిరంకుశవైఖరికి నిదర్శనమని ధ్వజమెత్తారు. భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, పంటల బీమా కింద రైతులకు చెల్లించాల్సిన పరిహారం రూ.500 కోట్లు చెల్లించాలని, ఏకకాలంలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతుల దగ్గర పంటలు కొనుగోలు చేయడంలో అక్రమాలు జరిగాయని, అందరికీ రైతుబంధు ఇవ్వలేదని, రాష్ట్రంలో యూరియా కొరత ఉందని, రైతు రుణమాఫీ చేయలేదని, రుణాలు ఇవ్వలేదని.. ఇవన్నీ చెపుదామంటే ప్రగతిభవన్ వద్దకు వెళ్లగానే పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి సమస్యలు తెలిపేందుకు అవకాశం ఇవ్వకుండా వ్యవహరించడం తగదని మండిపడ్డారు. కిసాన్‌సెల్ అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి మాట్లాడుతూ మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని, భారీ వర్షాల కారణంగా నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలని, రైతు లకు వడ్డీ రాయితీలు ఇవ్వాలని తాము ప్రగతిభవన్‌కు వద్దకు వెళ్తే అక్రమంగా అరెస్టు చేశారని అన్నారు. ప్రభుత్వ దమనకాండను నిరసిస్తూ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ దిష్టిబొమ్మల దగ్ధం కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment