ఢిల్లీలో అమిత్‌షాతో భేటీ అయిన బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, విజయశాంతి, ఈటల, వివేక్
తెలంగాణలో వెంటనే నా కార్యక్రమాన్ని ఖరారు చేస్తే అందులో పాల్గొంటా. నా పర్యటనను ఎలా అడ్డుకుంటారో చూద్దాం. రెండో విడత ప్రజాసంగ్రామ యాత్ర లేదా మరేదైనా పార్టీ కార్యక్రమం ఏర్పాటు చేస్తే రాష్ట్రంలో రెండురోజుల పాటు పర్యటించేందుకు నేను సిద్ధం. టీఆర్‌ఎస్ నిరసన పద్ధతులను, విధానాలను ఉపేక్షించే పరిస్థితి లేదు. గట్టిగా ఎదుర్కోవాలి.
తెలంగాణ ప్రభుత్వంపై యుద్ధం చేయాలి. జాతీయ పార్టీగా రాష్ట్ర పార్టీకి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. బీజేపీ నాయకులకు సమస్యలపై పోరాటాలు, ఉద్యమాలు చేయడం కొత్తకాదు. దాడులకు భయపడకుండా ముందుకు సాగాలి.
రాష్ట్ర ప్రభుత్వ విధానాలను, టీఆర్‌ఎస్ చేపట్టే నిరసనలను ఎండగట్టండి. టీఆర్‌ఎస్ సర్కార్ వైఫల్యాలు, అవినీతి కార్యకలాపాలను పెద్ద ఎత్తున ప్రజల్లో తీసుకెళ్లండి. రాష్ట్రంలో వివిధ అభివృద్ధి పథకాల్లో జరుగుతున్న అవినీతిపై పోరుబాట పట్టండి. అవినీతి అంశంపై కేంద్ర సంస్థలతో విచారణకు డిమాండ్‌లు చేయండి.
– అమిత్ షా
సాక్షి, హైదరాబాద్/ సాక్షి, న్యూఢిలీ: కేంద్ర ప్రభుత్వంపై, బీజేపీ నాయకులపై రాష్ట్ర ప్రభుత్వ తీరును, అధికార టీఆర్‌ఎస్ చేపడుతున్న నిరసన కార్యక్రమాలను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సీరియస్‌గా తీసుకున్నారు. బీజేపీ నాయకులకు చావుడప్పు కొట్టాలని, వారి పర్యటనలను అడ్డుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునివ్వడంపై, ఉరికిస్తామంటూ వ్యాఖ్యానించడంపై తీవ్రస్థాయి లో మండిపడ్డారు.
రాష్ట్రానికి కేంద్రం చేదోడువాదోడుగా ఉంటూ అన్ని విధాలుగా ఆదుకుంటుంటే, కేసీఆర్ ప్రభుత్వం తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు తమాషాలు చేస్తోందని ధ్వజమెత్తినట్టు సమాచారం. మంగళవారం ఢిల్లీలో రాష్ట్ర బీజేపీ నేతలు పలువురితో అమిత్ షా సమావేశమయ్యారు.
సుమారు 30 నిమిషాలు కొనసాగిన భేటీలో కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, డీకే అరుణ, ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, జితేందర్‌రెడ్డి, విజయశాంతి, వివేక్, గరికపాటి మోహన్‌రావు, బంగారు శృతితో పాటు ఇటీవల బీజేపీలో చేరిన విఠల్, తీన్మార్ మల్లన్నలు పాల్గొన్నారు. సంజయ్, కిషన్‌రెడ్డిలతో అమిత్ షా విడివిడిగా భేటీ అయ్యారు.
రాష్ట్రంలో పర్యటన ఖరారు చేయండి
తెలంగాణలో వెంటనే తన కార్యక్రమాన్ని ఖరారు చేస్తే అందులో తాను పాల్గొంటానని, తన పర్యటనను ఎలా అడ్డుకుంటారో చూద్దామని అమిత్ షా వ్యాఖ్యానించారు. రెండో విడత ప్రజాసంగ్రామ యాత్ర లేదా మరేదైనా పార్టీ కార్యక్రమం ఏర్పాటు చేస్తే రాష్ట్రంలో రెండురోజుల పాటు పర్యటించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలియజేశారు. టీఆర్‌ఎస్ నిరసన పద్ధతులను, విధానాలను ఉపేక్షించే పరి స్థితి లేదని, గట్టిగా ఎదుర్కోవాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
తెలంగాణ ప్రభుత్వంపై యుద్ధం చేయాలని, జాతీయ పార్టీగా రాష్ట్ర పార్టీకి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పార్టీ కార్య క్రమాలు ఉధృతంగా నిర్వహించాలని సూచించారు. పాదయాత్ర, తదితర రూపాల్లో ప్రజల్లోకి మరింత విస్తృతంగా వెళ్లి బీజేపీకి మద్దతును కూడగట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలని, ఈ మేరకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకొని దూసుకెళ్ళాలని సూచించారు.
బీజేపీ నాయకులకు సమస్యలపై పోరాటాలు, ఉద్యమాలు చేయడం కొత్తకాదని, దాడులకు భయపడకుండా ముందుకు సాగా లని సూచించారు. మొదటి విడత ప్రజాసంగ్రామ యాత్ర బాగా నిర్వహించారని, కేసీఆర్ అవినీతి, అక్రమాల గురించి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారంటూ సంజయ్‌ను అభినందించారు. రెండోవిడత పాదయాత్రను త్వరగా చేపట్టి ముందుకు సాగాలని చెప్పారు. ఎమ్మెల్యేగా గెలిచిన ఈటలను అభినందించిన అమిత్‌షా.. టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫ ల్యాలు, విధానాలపై పోరాడాలని సూచించారు.
కేసీఆర్‌పై సొంత పార్టీ నేతల్లోనే అసంతృప్తి
రాష్ట్ర ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని, సొంతపార్టీ నేతలే కేసీఆర్ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారని అమిత్ షాకు రాష్ట్ర బీజేపీ నేతలు వివరించారు. హుజూరాబాద్ ఉపఎన్నిక ఓటమి తర్వాత ప్రజలను, రైతులను మభ్యపెట్టేందుకు కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.
కాగా రెండు, మూడురోజుల్లో రాష్ట్ర బీజేపీ ముఖ్యనేతలు సమావేశమై రెండో విడత పాదయాత్రకు అమిత్‌షాను ఆహ్వానించడం లేదా ఏదైనా నిరసన కార్యక్రమంలో పాల్గొనేలా నిర్ణయం తీసుకోను న్నట్టు తెలిసింది. కాగా రాష్ట్రంలో తమ పోరాటంపై అమిత్ షా సంతృప్తి వ్యక్తం చేసినట్లు బండి సంజయ్ విలేకరులతో చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment