శ్రీకాంత్ కుటుంబాన్ని ఓదారుస్తున్న షర్మిల
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రైతులు తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న వరిపం ట వేసుకోవద్దనడానికి సీఎం కేసీఆర్‌కు ఏ హక్కు ఉందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఏం అదికారముందని వరిసాగు చేయబోమంటూ కేంద్రానికి లేఖ రాశారని నిలదీశారు. రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్‌టీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రైతు ఆవేదనయాత్ర ఆదివారం ఇక్కడ ప్రారంభమైంది.
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కంచన్‌పల్లి, లింగంపల్లిల్లో ఆత్మహత్యకు పాల్పడిన గుండ్ల శ్రీకాంత్, శేఖర్, మహేశ్‌ల కుటుంబాలను తొలిరోజు ఆమె పరామర్శించారు. అనంతరం లింగంపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.
యాసంగిలో కూడా వరి కొనుగోలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. కేసీఆర్ అనుచిత నిర్ణయాలు, దిక్కుమాలిన పాలన వల్ల 70 రోజుల్లోనే 200 మందికి పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని అన్నారు. బాధిత రైతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
కాళేశ్వరం ఎందుకు కట్టినట్లు..
వరిసాగు చేయొద్దంటే, మరి కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు కట్టినట్లని షర్మిల ప్రశ్నించారు. రుణమాఫీ ఎవరికైనా జరిగిందా.. అని రైతులను అడగగా.. తమకెవ్వరికీ మాఫీ కాలేదని బదులిచ్చారు. రుణమాఫీ, ఉచితవిద్యుత్, ఇన్‌పుట్ సబ్సిడీ వంటి పథకాలతో రైతుల పక్షాన నిలిచిన వైఎస్సార్ బిడ్డగా తనను ఆశీర్వదించి అధికారం అప్పగిస్తే రైతును రాజును చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ నేతలు ఏపూరి సోమన్న, చంద్రశేఖర్, శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment