కమల దళంలో ఆ సామాజిక వర్గానికే ప్రాధాన్యం
పార్టీలోనూ, సీట్లలోనూ వారికే అగ్రతాంబూలం
సామాజిక లింకుంటే చాలు పెద్దపీటే
పదాధికారుల్లోనూ సగానికి పైగా వారే
ఇతర సామాజికవర్గాలకు మొండిచేయి
రగిలిపోతున్న బీజేపీ సీనియర్లు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ కమల దళంలో కలకలం రేగుతోంది. కమలం పార్టీలో ఒక సామాజికవర్గానికే అధిక ప్రాధాన్యమిస్తున్నారంటూ ఇతర సామాజికవర్గ నేతల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. పార్టీ పదవుల్లోనే కాదు.. ఇటీవల ప్రకటించిన అసెంబ్లీ, లోక్‌సభ సీట్లలోనూ వారిదే పైచేయిగా ఉందన్న అసంతృప్తి శ్రేణుల్లో బలంగా వినిపిస్తోంది. తెలుగుదేశంతో చేతులు కలిపాక ఈ ప్రాధాన్యం మరింత పెరిగిందంటూ నేతలు రగిలిపోతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కాపు సామాజికవర్గానికి చెందిన సోము వీర్రాజును తప్పించి వ్యూహాత్మకంగా దగ్గుబాటి పురందేశ్వరి ఆ పదవి దక్కించుకున్నారు.
అప్పట్నుంచి పార్టీ పటిష్టానికి కాకుండా తమ సామాజికవర్గం బలోపేతం కావడం కోసమే ఆమె ఎక్కువగా పాటుపడుతున్నారని బీజేపీలోని ఒక బలమైన వర్గం భావిస్తోంది. వీరి వాదన ప్రకారం.. ఒకే సామాజికవర్గానికి చెందిన పార్టీ రాష్ట అధ్యక్షురాలు పురందేశ్వరి, ప్రధాన కార్యదర్శి తపన్ చౌదరి, మీడియా ఇన్‌చార్జి పాతూరి నాగభూషణం, సోషల్ మీడియా ఇన్‌చార్జి కేశవ్‌కాంత్, అధికార ప్రతినిధి లంక దినకర్, మీడియా ప్యానలిస్టు వై.రామ్‌కుమార్ తదితరులు పార్టీలో కీలక పదవుల్లో ఉన్నారు.
పార్టీ రాష్ట్ర కోశాధికారి నాగేంద్ర భార్యదీ ఆ సామాజికవర్గమే. రాష్ట్ర పదాధికారుల్లోనూ సగానికిపైగా పురందేశ్వరి సామాజికవర్గం వారే ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇక త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆ సామాజికవర్గానికి చెందిన వారితో పాటు వారితో సంబంధం ఉన్న వారికే సీట్లు కేటాయించడాన్ని బీజేపీ నేతలు ఉదహరిస్తున్నారు.
అసెంబ్లీ నాలుగు.. పార్లమెంటు మూడు
రాష్ట్రంలో పొత్తులోభాగంగా బీజేపీ పది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇందులో మూడు స్థానాలు ఆ సామాజికవర్గానికే కేటాయించారు. రెండు సీట్లు క్షత్రియులకు, రెండు బీసీలకు, రెడ్డి, ఎస్సీ, ఎస్టీలకు ఒక్కొక్కటి చొప్పున కేటాయించారు. వీరిలో సుజనా చౌదరి విజయవాడ వెస్ట్‌లో, కామినేని శ్రీనివాస్ కైకలూరులో, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో ఎన్.ఈశ్వరరావు పోటీ చేస్తున్నారు. ధర్మవరం సీటు దక్కించుకున్న బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ సతీమణి కూడా పురందేశ్వరి సామాజిక వర్గానికి చెందిన వారే.
లోక్‌సభకు పోటీ చేస్తున్న 6స్థానాల్లో ఆ సామాజిక వర్గానికి మూడు, రెడ్డి, ఎస్సీ, ఎస్టీలకు ఒక్కొక్కటి చొప్పున కేటాయించారు. పురందేశ్వరి రాజమండ్రి నుంచి పోటీ చేస్తున్నారు. సీఎం రమేష్ అనకాపల్లి నుంచి, కొత్తపల్లి గీత అరకు నుంచి పోటీలో ఉన్నారు. సీఎం రమేష్ సతీమణి, అరకు అభ్యర్థి కొత్తపల్లి గీత భర్త కూడా పురందేశ్వరి సామాజికవర్గమే కావడం గమనార్హం. ఇలా ఈ ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్‌సభ సీట్లను ఆ కులస్తులకు గానీ, భార్యాభర్తల్లో ఎవరో ఒకరు ఆ వర్గంతో సంబంధం ఉన్న వారికే కేటాయించడం బీజేపీలో పెనుదుమారాన్ని రేపుతోంది.
ఎక్కువ జనాభా కలిగిన కాపులకు, గుర్తింపు సంఖ్యలో ఉన్న బ్రాహ్మణులకు అసెంబ్లీ, లోక్‌సభ సీటు ఒక్కటీ ఇవ్వకపోవడంపై పార్టీలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. బీజేపీలో బ్రాహ్మణ వర్గానికి చెందిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు (విశాఖ లోక్‌సభ), కాపు సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజు (రాజమండ్రి అసెంబ్లీ) సీట్లు ఆశించినా అవి దక్కకుండా తమ వారికే ఎక్కువ సీట్లు ఇచ్చేలా చంద్రబాబుతో కలిసి పురందేశ్వరి చక్రం తిప్పారంటూ బహిరంగంగానే చర్చ జరుగుతోంది.
కాషాయానికి ‘పచ్చ’ షాక్
బిక్కవోలు: టీడీపీ కండువా తీసేసి ప్రచారం చేసుకోవాలంటూ ఆ పార్టీ కార్యకర్తలు కూటమి అభ్యర్థిని నిలువరించిన ఘటన బుధవారం తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలులో జరిగింది. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా అనపర్తి అసెంబ్లీ సీటును బీజేపీకి కేటాయించారు. దీంతో అభ్యర్థిగా ములగపాటి శివరామకృష్ణరాజు ప్రచారం చేసుకుంటున్నారు.
బిక్కవోలు మెయిన్‌రోడ్డులో బుధవారం ప్రచారం నిర్వహిస్తున్న ఆయనను టీడీపీ కార్యకర్తలు నిలువరించి ప్రచారంలో తమ పార్టీ కండువా, జెండాలను వాడవద్దని గొడవ చేశారు. పొత్తు ధర్మంలో భాగంగా తనకు సహకరించాలని కోరినా ససేమిరా అని బలవంతంగా ఆయన మెడలోని కండువాని ఆయన చేతే తీయించారు. నడిరోడ్డుపై కూటమి అభ్యర్థిని టీడీపీ కార్యకర్తలు అవమానించిన తీరుపై స్థానికులు ముక్కున వేలేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment