![chandrababu no priority purandeswari tdp janasena bjp alliance talks vijayawada - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/03/11/cbn-1.jpg.webp?itok=3Nyomemz)
కాపురం చేసే కళ.. కాలు తొక్కిన నాడే తెలుస్తుందని సామెత! చంద్రబాబునాయుడుతో వ్యవహారం ఎలా ఉంటుందో పొత్తు కుదిరిన తర్వాత చర్చలకు కూర్చున్న తొలిరోజునే బయటపడిపోయింది. బతిమాలి బామాలి బిజెపి పెద్దల కాళ్లు పట్టుకున్నంత పనిచేసి మొత్తానికి వారితో పొత్తు కుదుకున్న నారా చంద్రబాబునాయుడు.. పొత్తు ప్రకటన వచ్చిన తర్వాత.. సీట్ల సర్దుబాటు చర్చల కోసం కూర్చున్న తొలిరోజునే తన విశ్వరూపం, అసలు రూపం చూపించేశారు. బిజెపిలో అంతర్గతంగా పొత్తులకు అనుకూలతను రాబట్టిన వదినమ్మ పురందేశ్వరికి అప్పుడే వెన్నుపోటు పొడిచేశారు. చర్చల రోజు నాటికే ఆమెను లూప్ లైన్లోకి నెట్టేశారు. రాష్ట్ర బిజెపి సారధి అయినప్పటికీ.. ఆమె చర్చల్లో లేకపోవడం ఇవాళ్టి రాజకీయ పరిణామాల్లో హైలైట్.
రెండు రోజుల కిందట చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ లు ఢిల్లీలో రెండు రోజుల పాటు మకాం వేసి భాజపాతో పొత్తులు కుదర్చుకున్నారు. అయితే ఏ సీట్లలో ఎవరు పోటీచేయాలి అనేది తేలలేదు. ఆ విషయాలు చర్చించడానికి ఢిల్లీ నుంచి కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్, బిజెపి నేత బైజయంత్ పండా వచ్చారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ యథావిధిగా తన వెన్నంటి నాదెండ్ల మనోహర్ ను తీసుకువెళ్లారు. తెలుగుదేశం తరఫున కూడా అచ్చెన్నాయుడు తదితరులు ఉన్నారు.
అయితే ట్విస్టు ఏంటంటే.. ఈ భేటీలో పురందేశ్వరి లేరు. ఏపీ భారతీయ జనతా పార్టీకి ఆమె సారథి! అయినా సరే.. ఆమె లేకుండానే.. ఈ మూడు పార్టీల భేటీ జరగడం.. సీట్ల పంపకాల గురించి కీలక నిర్ణయాలు తీసుకోవడం అనేది ఆమె పట్ల అవమానకరమైన నిర్ణయం అనే అభిప్రాయం విశ్లేషకుల్లో వ్యక్తమౌతోంది. ఒకవైపు పురందేశ్వరి బిజెపి పగ్గాలు చేపట్టిన నాటినుంచి.. ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డిని అదేపనిగా తిడుతూ చంద్రబాబునాయుడు బలం పెరగడానికి తన వంతు కృషి చేస్తూ వచ్చారు. చంద్రబాబు తరపున బిజెపిలో పనిచేస్తున్న సరికొత్త కోవర్టుగా కూడా ముద్ర వేయించుకున్నారు. అయితే చంద్రబాబు నాయుడు వెన్నుపోటు అలవాటు గురించి.. ఆమె మరచిపోయినట్టున్నారు.
నిజానికి పురందేశ్వరి చంద్రబాబు వెన్నుపోటు ధోరణిని మర్చిపోకూడదు. ఎందుకంటే.. స్వయంగా ఆమె తండ్రి ఎన్ టి రామారావును వెన్నుపోటు పొడిచి.. అధికారం దక్కించుకున్న వ్యక్తి ఆయన! కాకపోతే ఆ వెన్నుపోటు పర్వంలో ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా పాత్రధారి కావడం వలన ఆమె దానిని ప్రస్తావించకపోవచ్చు. కానీ.. కొంతకాలం గడవగానే.. ఆమె భర్తను కూడా లూప్ లైన్లోకి నెట్టేసి పార్టీని మొత్తంగా హస్తగతం చేసుకున్న కుయుక్తుల మేధావి చంద్రబాబు. అలాంటి మరిది కుట్రబుద్ధుల గురించి ఆమెకు తెలియదని అనుకోలేం.
అయినా సరే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమె బిజెపి సారథిగా వచ్చిననాటినుంచి చంద్రబాబుకు అనుకూలంగా ఆ పార్టీని నడుపుతూ వచ్చారు. పొత్తులకు అనుకూల నివేదికలను తయారుచేసి ఢిల్లీ పంపారు. మరిది కోసం ఇన్ని చేసినప్పటికీ.. ఆయన మాత్రం.. తన వెన్నుపోటు బుద్ధి పోనిచ్చుకోకుండా.. ఆమెను పొత్తుకుదిరిన వెంటనే లూప్ లైన్లోకి నెట్టేశారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. చంద్రబాబు వెన్నుపోటు టేలెంట్ ను ముందుముందు ఆమె మరింతగా చూడాల్సి వస్తుందని కూడా పార్టీలో అనుకుంటున్నారు.
:::వంశీకృష్ణ
Comments
Please login to add a commentAdd a comment