సాక్షి ప్రతినిధి, వరంగల్: ప్రధాని మోదీ పర్యటన కోసం కాకతీయల గడ్డ ఓరుగల్లు ముస్తాబైంది. సుమారు 30 ఏళ్ల తర్వాత దేశ ప్రధాని తొలిసారిగా వరంగల్‌కు వస్తుండటం గమనార్హం. ప్రధాని అధికారిక కార్యక్రమాల కోసం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సభా వేదికపైకి ప్రధాని మోదీ సహా ఎనిమిది మందికే అవకాశం ఉంటుందని పీఎంఓ కార్యాలయ డిప్యూటీ సెక్రటరీ బిప్లవ్ కేఆర్ రాయ్ టూర్ షెడ్యూల్‌లో స్పష్టం చేశారు.
ఇందులో మోదీతోపాటు గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీలు బండి సంజయ్, పసునూరి దయాకర్ ఉన్నారు. అయితే ప్రధాని మోదీ పర్యటనను బహిష్కరిస్తున్నామని, తమ ప్రజాప్రతినిధులెవరూ పాల్గొనబోరని బీఆర్‌ఎస్ ప్రకటించిన నేపథ్యంలో.. సీఎం కేసీఆర్, మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ దయాకర్ పాల్గొనే అవకాశం లేదని, ఆ సీట్లు ఖాళీగానే ఉండే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి.
పోలీసు వలయంలో వరంగల్
ప్రధాని పర్యటన సందర్భంగా గ్రేటర్ వరంగల్ పరిధిలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇద్దరు అడిషనల్ డీజీపీల పర్యవేక్షణలో సుమారు పది వేల మందిని మోహరించారు. మోదీ వెళ్లే ప్రాంతాలు, సభా ప్రాంగణాన్ని డాగ్ స్క్వాడ్‌తో తనిఖీ చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కాగా శుక్రవారం రాత్రి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తరుణ్‌ఛుగ్, బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే ఆరుణ, ఏపీ జితేందర్‌రెడ్డి తదితరులు ప్రధాని సభ ఏర్పాట్లను పరిశీలించారు.
ప్రధాని పర్యటన షెడ్యూల్ ఇదీ..
టూర్ షెడ్యూల్ ప్రకారం.. ప్రధాని మోదీ శనివారం ఉదయం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ శివార్లలోని హాకీంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి 10.15 గంటలకు మామునూరు మినీ ఎయిర్‌పోర్టుకు వస్తారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో భద్రకాళి అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తారు.
11 గంటల సమయంలో కాకతీయ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. వివిధ అభివృద్ధి పనులకు వర్చువల్‌గా శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. రైల్వే, నేషనల్ హైవే అధికారుల పవర్ పాయింట్ ప్రజెంటేషన్లను తిలకిస్తారు. 11.45 గంటలకు అక్కడే ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభా వేదిక వద్దకు చేరుకుని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరుతారు.
Comments
Please login to add a commentAdd a comment