నెల్లూరులో చంద్రబాబు సభకు డుమ్మాకొట్టిన బొల్లినేని వర్గీయులు
అధినేత ఆగ్రహంతో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం
కాకర్లతో రాజీకి ససేమిరా అంటున్నబొల్లినేని వర్గీయులు
ఉదయగిరి: టీడీపీ ఉదయగిరి నియోజకవర్గ టికెట్ ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బొల్లినేని వెంకటరామారావును కాదని చంద్రబాబు ఎన్‌ఆర్‌ఐ కాకర్ల సురేష్‌కు ఇవ్వడంతో బొల్లినేని, అతని వర్గీయులు గత పది రోజులుగా తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అధిష్టానం తన ప్రకటనను వెనక్కి తీసుకుని టికెట్ మార్చకపోతే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామని, కాకర్లకు సహకరించేది లేదని బొల్లినేని బహిరంగంగా ప్రకటించారు. దీంతో పార్టీలో రాజుకున్న వివాదం, క్యాడర్‌లో తీవ్ర ఆందోళన ఇంకా కొనసాగుతున్నాయి. బొల్లినేని పంచాయితీ తేలకపోవడం, నెల్లూరులో చంద్రబాబు సభకు బొల్లినేని వర్గీయులు డుమ్మా కొట్టడంతో ఆయన తీరుపై అధిష్టానం కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
బొల్లినేనికి దొరకని అపాయింట్‌మెంట్
గత వారం రోజులుగా చంద్రబాబును కలిసేందుకు బొల్లినేని చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావడం లేదు. ఉదయగిరిలో అనుచరుల సమావేశం తర్వాత చంద్రబాబును కలిసి టికెట్ ఓకే చేసుకుని వస్తానని చెప్పిన 12 గంటల లోపే కాకర్ల పేరు ప్రకటించడంతో బొల్లినేని షాక్‌కు గురయ్యారు. అనంతరం చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నం చేసినా వీలు కాలేదు. చంద్రబాబే బొల్లినేనికి ఫోన్ చేసి పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని చెప్పినా ఫోన్ కట్ చేసినట్లు తెలుస్తోంది. అనంతరం బొల్లినేని కలిగిరిలో గత నెల 28వ తేదీన ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి తనకు జరిగిన అన్యాయాన్ని కార్యకర్తలకు వివరించి చంద్రబాబును కలిసి తాడోపేడో తెల్చుకుని వస్తానని ప్రకటించారు. తర్వాత తమ అధినేతను కలిసే ప్రయత్నం చేస్తున్నా అవకాశం రావడం లేదు.
ఉద్దేశపూర్వకంగా అపాయింట్‌మెంట్ లేట్ చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. క్యాడర్‌లో ఉన్న ఆగ్రహావేశాలను తగ్గించి బొల్లినేనిని తన దారిలోకి తెచ్చుకోవాలని చంద్రబాబు వ్యూహంగా ఉన్నట్లు కొంతమంది ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. సోమ, మంగళ వారాల్లో బాబు అపాయింట్‌మెంట్ ఇచ్చే అవకాశం ఉందని బొల్లినేని వర్గీయులు చెబుతున్నారు. నెల్లూరులో జరిగిన చంద్రబాబు సభకు బొల్లినేని తన అనుచరులు రాకుండా అడ్డువేయడంపై కూడా అధినేత ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. మొత్తమ్మీద ఉదయగిరి టీడీపీ టికెట్ వివాదం ఇప్పట్లో పరిష్కారమయ్యే సూచనలు కనిపించడం లేదు. ఈ వివాదం ఏ పరిణామాలకు దారితీస్తోందోననే భయం కూడా టీడీపీ క్యాడర్‌లో నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment