సాక్షి, తిరుపతి: తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలను దృష్టిలో ఉంచుకుని టీడీపీ అసంతృప్తి నేతలకు గాలం వేయడానికి బీజేపీ పావులు కదుపుతోంది. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అత్యంత సన్నిహితుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణుకుమార్ రెడ్డి ద్వారా బేరసారాలు మొదలుపెట్టారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకోసమే విష్ణు తిరుపతిలో మకాం వేసినట్లు విశ్వసనీయ సమాచారం. తిరుపతి ఎంపీ బల్లిదుర్గాప్రసాద్ అకస్మిక మరణంతో పార్లమెంట్ ఉప ఎన్నిక అనివార్యం కానుంది. బీజేపీ, టీడీపీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఏకగ్రీవం కావాల్సిన లోక్‌సభ సీ టును ఉపఎన్నికల వరకు తీసుకువెళ్లడానికే సిద్ధమయ్యారు. దుబ్బాక వాపును చూసి, బలుపనుకుని రకరకాల ఎత్తులు వేస్తున్నారు. (శ్రీకాళహస్తిలో నాటకాన్ని రక్తికట్టిస్తున్న బీజేపీ, జనసేన)
గత ఏడాదిన్న కాలంగా సీనియర్ టీడీపీ నేతలు పలువురు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వైఖరి నచ్చక కొందరు పార్టీ మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో మరికొందరు టీడీపీకి రాజీనామా చేసినా తర్వాత చంద్రబాబు బుజ్జగింపులతో మెత్తబడ్డారు. అయితే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటువంటి వారి జాబితా దగ్గర పెట్టుకుని బీజేపీ నేతలు సదరు అసమ్మతి నేతలతో మంతనాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. స్ధానికంగా కమలం పార్టీలోని నేతలతో టీడీపీ అసమ్మతి నేతలతో ముందుగా మాట్లాడించి, తర్వాత విష్ణు రంగంలోకి దిగుతున్నారని తెలిసింది. అందులో భాగంగా సోమవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుని తిరుపతికి పిలిపించుకుని మంతనాలు మొదలుపెట్టినట్లు విశ్వసనీయ సమాచారం.
దుబ్బాక గెలుపుతో ఏపీ నాయకత్వంపై ఒత్తిడి
తెలంగాణాలోని దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ అనూహ్యంగా గెలవడంతో తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల విషయమై రాష్ట్ర నాయకత్వంపై ఒత్తిడి పెరిగినట్లు తెలిసింది. నిజానికి దుబ్బాకలో గెలిచేంత సీన్ కమలానికి లేదు. అయితే టీఆర్‌ఎస్‌ను వ్యతిరేకించే అనేక అంశాలు కలసి రావడంతో బీజేపీ నేతలంతా దుబ్బాకలో తిష్ట వేసి, గెలుపు కోసం రేయింబవళ్లు కష్టపడడంతో విజయం సాధ్యమైందనేది వాస్తవం. కాగా దుబ్బాకకు తిరుపతికి మధ్య ఎంత దూరం ఉందో తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో గెలుపునకు బీజేపీ అంతే దూరంలో ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే కమలనాథులు మాత్రం విజయం తమదే అంటూ రెచ్చిపోతున్నారు. (రూ.7,200 కోట్లు తీసుకొని భ్రమరావతిగా మార్చిన చంద్రబాబు)
డిపాజిట్ కోల్పోయిన కమలం
గత ఎన్నికల్లో విజయం సాధించిన బల్లికి 2.28 లక్షల ఓట్ల మెజారిటీ వస్తే బీజేపీకి డిపాజిట్ కూడా రాలేదు. కమలం అభ్యర్థికి కేవలం 16 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. అలాంటిది జరగబోయే ఉపఎన్నికలో తమ గెలుపు ఖాయమని వీర్రాజు లాంటి వారు చెబుతుంటే... జనం నవ్వుకుంటున్నారు. అయితే కమలదళం హడావుడి మాత్రం అంతా ఇంతా కాదు. గెలుస్తారో లేదో తెలియదు కానీ టీడీపీ అసమ్మతి నేతలతో పాటు రాజకీయాలకు సంబంధం లేని ప్రముఖులను కూడా తమ వైపునకు మొగ్గేలా బీజేపీ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. పనిలో పనిగా జనసేన కార్యకర్తలను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment