సుధాకర్‌బాబు, జోగి రమేష్
సాక్షి, అమరావతి: అసెంబ్లీలో టీడీపీ తీరును వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు టీజేఆర్ సుధాకర్‌బాబు, జోగి రమేష్ తీవ్రంగా తప్పుబట్టారు. ఒక అబద్ధాన్ని అదే పనిగా చెబుతూ... దాన్ని నిజం చేయడానికి ఆ పార్టీ ఎంతకైనా దిగజారుతోందని మండిపడ్డారు. గురువారం వారు ‘సాక్షి’తో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడికి సూటిగా కొన్ని ప్రశ్నలు సంధించారు. ఆ ప్రశ్నలిలా ఉన్నాయి.
► జంగారెడ్డి గూడెమేమీ పల్లెటూరు కాదు. 55 వేలకు పైగా జనాభా ఉన్న మున్సిపాలిటీ. డీఎస్పీ స్థాయి అధికారితో పాటు పోలీసులు, సచివాలయం.. అందులో మహిళా పోలీసులు.. ఇలా పెద్ద వ్యవస్థే ఉంది. అలాంటి చోట ఎవరికీ తెలియకుండా సారా కాయటం సాధ్యమా?
► ఈ ప్రభుత్వం వచ్చాక మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయని ఆరోపిస్తున్నది మీరే. సారా పెరిగిపోయిందంటున్నదీ మీరే! మద్యం అమ్మకాలు అంతలా పెరిగినప్పుడు సారా కూడా పెరిగిందని చెప్పటం పరస్పర విరుద్ధం కాదా? ఎందుకీ దివాలాకోరుతనం?
► మద్యం వినియోగం తగ్గించడానికి మేం ఆరంభం నుంచీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నది నిజం కాదా? షాక్ కొట్టేలా రేట్లు పెట్టాం. ప్రైవేటుకిస్తే బెల్టు షాపుల నియంత్రణ కష్టమని భావించి మద్యం దుకాణాలను ప్రభుత్వమే తీసుకుంది. షాపులకు అనుబంధంగా ఉండే పర్మిట్ రూమ్‌లనూ రద్దు చేశాం. మద్యం రేట్లు పెంచారు కనక అక్రమ మద్యం, నాటుసారా పెరుగుతోందని విమర్శలకు దిగిందీ మీరే. ఇçప్పుడు రేట్లు తగ్గించినా కూడా నాటు సారాను ప్రోత్సహిస్తున్నామని ఆరోపిస్తున్నదీ మీరే! బుద్ధుండాలి బాబూ?
► స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోను (ఎస్‌ఈబీ) ఏర్పాటు చేసింది అక్రమ మద్యాన్ని, నాటు సారాను అడ్డుకోవటానికే కదా? ఉక్కుపాదం మోపుతూ ఎస్‌ఈబీ 13 వేలకు పైగా కేసులు పెట్టింది. ఇది మా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం కాదా? ఏం.. సారా గతంలో లేదా? ఎప్పట్నుంచో ఉందన్నది అందరికీ తెలుసు. కట్టడి చేయటానికి మేం చిత్తశుద్ధితో శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో సహజ మరణాలను సారా మరణాలుగా చిత్రీకరించడానికి మీరు ఇంత కుట్రలకు దిగటమే దారుణం.
► ఈ మరణాలేమైనా ఒక్కరోజులో జరిగాయా? 3–4 వారాల వ్యవధిలో జరుగుతూ వస్తున్నాయి. శవాలు ఎప్పుడో పూడ్చేశారు. అయినా కానీ నిజానిజాలు తేల్చాలన్న చిత్తశుద్ధితో ప్రభుత్వం కొన్ని శవాలను వెలికి తీయించి పరీక్షలకు పంపించింది. సంఘటన జరిగిన వెంటనే ఆరోగ్య శాఖ మంత్రి అక్కడకు వెళ్లారు. మీరేమో 26 మంది చనిపోయారంటారు. మీ అచ్చెన్నాయుడేమో 15 మంది అంటూ ఓ జాబితా విడుదల చేశాడు. రేపు మరో నాయకుడొచ్చి మరో సంఖ్య చెబుతాడు. అంటే మీకు నిజాలతో పని లేదన్నట్టేగా? ప్రభుత్వంపై, సీఎంపై నోటికొచ్చిన విమర్శలు చేయటమే మీ ఉద్దేశమని తెలియటం లేదా? ఛీ.. ఇంత దిగజారిపోతారా బాబూ..!!
Comments
Please login to add a commentAdd a comment