సాక్షి, తూర్పుగోదావరి: ఏపీలో చంద్రబాబు వంద రోజుల పాలనలో ఆస్తుల విధ్వంసమే తప్ప మరొకటి లేదన్నారు మాజీ ఎమ్మెల్యే టీజేఎస్ సుధాకర్ బాబు. కూటమి సర్కార్ పాలనలో పోలవరం పనులు, రాజధాని పనులు ఎంతవరకు వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు.
మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు వంద రోజుల్లో విధ్వంసకర పరిపాలన చేశారు. పవన్ కళ్యాణ్, పురందరేశ్వరి, చంద్రబాబు ప్రజలను మోసం చేశారు. మొదటి వంద రోజుల పాలన ఆస్తుల విధ్వంసం, ప్రతిపక్షాలను టార్గెట్ చేయటం, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై దాడులే లక్ష్యంగా పనిచేశారు. సమర్థవంతమైన ఐపీఎస్ అధికారులపై తప్పుడు కేసులు బనాయించారు. నారా వారి వంద రోజుల పాలన బూటకం.
నాలుగు నెలల కాలంలో చంద్రబాబు తెచ్చిన 45వేల కోట్లు ఏం చేశారో చెప్పాలి. పోలవరం పనులు, రాజధాని పనులు ఎంతవరకు వచ్చాయో చెప్పాలి. ప్రజలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు అదే హామీలను ఎందుకు అమలు చేయలేకపోతున్నారో ప్రజలకు చెప్పాల్సిందే. ఆంధ్రప్రదేశ్ హత్యలకు నిలయంగా మారింది.
వ్యవసాయాన్ని పూర్తిగా గాలికి వదిలేశారు. రైతు భరోసా కేంద్రాలను మూసేశారు. రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు లేవు. రైతులకు అవస్థలు ఎదురవుతున్నాయి. చంద్రబాబు చూపించిన రాజకీయ విధ్వంసకర ప్రక్రియను అందరూ చూస్తున్నారు. మళ్లీ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాగే చేస్తే మీరు తట్టుకోగలరా?. దళిత నేత నందిగం సురేష్‌ను అక్రమంగా అరెస్టు చేశారు. పేదలకు వచ్చే ప్రభుత్వ మెడికల్ కాలేజ్ సీట్లు కూడా ప్రైవేటు పరం చేశారు. అన్ని సామాజిక వర్గాల్లో పేదలకు ఈబీసీ నేస్తం కింద వైఎస్ జగన్ సహాయం అందించారు. ఇప్పుడు నువ్వు ఎవరికి సహాయం అందిస్తున్నావు చంద్రబాబు. అక్రమాలకు కేంద్రాలైన జన్మభూమి కమిటీలు మళ్ళీ ప్రారంభమవుతున్నాయి’ అంటూ కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: సూపర్ సిక్స్-నారావారి వంచన ఫిక్స్.. జనం ఏమంటున్నారంటే..
Comments
Please login to add a commentAdd a comment