
సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష ద్రావిడ మున్నేట కజగం(డీఎంకే) తన రేసుగుర్రాలను ప్రకటించింది. ఏప్రిల్ 6న జరగనున్న తమిళనాడు శాసనసభ ఎన్నికలు- 2021 కు మొత్తం 173 మంది అభ్యర్థుల జాబితాను శుక్రవారం విడుదల చేసింది. ఈ జాబితాలోని వివరాల ప్రకారం.. పార్టీ చీఫ్ ఎంకే స్టాలిన్ కోలాథూర్ నియోజకవర్గం నుంచి మళ్లీ బరిలో నిలవనున్నారు. అదే విధంగా స్టాలిన్ తనయుడు, నటుడు, నిర్మాత ఉదయనిధి స్టాలిన్ చెపాక్ స్థానంనుంచి అరంగేట్రం చేయనున్నారు. అంతేకాదు మాజీ మంత్రులు, సీనియర్లు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లను కేటాయించడం విశేషం.
డిప్యూటీ సీఎం ఓ పన్నీర్‌సెల్వంపై తంగ తమిళసెల్వన్ పోటీ చేస్తారని, సీఎం ఇ పళనిస్వామితో టీ సంపత్‌కుమార్ తలపడ నున్నారని డీఏంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో విలేకరుల సమావేశంలో ప్రకటించారు. దురై మురుగన్, కె ఎన్ నెహ్రూ, కె పొన్ముడి, ఎంఆర్కె పన్నీర్ సెల్వం లాంటి సీనియర్లతోపాటు మాజీ మంత్రులు అలాడి అరుణ, సురేష్ రాజన్, కన్నప్పన్, మాజీ స్పీకర్ అవుడియ్యప్పన్ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
అలాగే డీఎంకే ఐటీ వింగ్ చీఫ్ పీటీఆర్ తియాగరాజన్, టీఆర్ బాలు కుమార్ టీఆర్‌బీ రాజా పేర్లు సైతం జాబితాలో ఉన్నాయి. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని స్టాలిన్ ఈ సందర్భంగా కార్యకర్తలను కోరారు. కాగా 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో 61 సీట్లను ఇప్పటికే కూటమి కేటాయించగా, మిగిలిన 173 స్థానాల్లో డీఎంకే అభ్యర్థులను ప్రకటించింది. హీరోగా, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్‌తో చిత్ర నిర్మాతగా ఉదయనిధి స్టాలిన్ కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రముఖంగా ఉన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment