రైతు కొండయ్యతో మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి
పాలకుర్తి/పాలకుర్తిటౌన్/ దేవరుప్పుల/జనగామ: పాలకుర్తి చౌరస్తాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఓనమాలు, ఏబీసీడీలు రాస్తే తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. పౌరుషం గల ఈ గడ్డ మీద పలక బలపం ఇస్తే ఓనమాలు రాయనోడు ఎమ్మెల్యే అయ్యిండంటే విచారకరమని వ్యాఖ్యానించారు. బుధవారం ఉదయం నుంచి రేవంత్‌రెడ్డి జనగామ జిల్లా దేవరుప్పుల నుంచి పాలకుర్తి వరకు హాథ్ సే హాథ్ జోడో యాత్ర సాగించారు.
యాత్రలో మిర్చి, పత్తి రైతులను పలకరించారు. రాత్రి పాలకుర్తి చౌరస్తాలో జిల్లా పార్టీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు. డాక్టర్ సుధాకర్‌రావు ఉన్నప్పుడే బావ.. బావ అని తిరుగుతుంటే వెన్నుపోటు పొడుస్తడని చెప్పినా నమ్మలేదని, దీంతో డాక్టర్ సాబ్ కనుమరుగయ్యాడని విచారం వ్యక్తం చేశారు. ఎర్రబెల్లికి చదువురాకున్నా చంద్రబాబు విప్‌గా ఇస్తే విస్మరించి కేసీఆర్ రాచరికపు పాలన కోసం పావుగా పనిచేసి ఈ రోజు మంత్రి అయ్యాడని, తెలుగుదేశాన్ని నట్టేట ముంచిన దుర్మార్గుడని దుయ్యబట్టారు.
మేడారం అడవుల్లో కేసీఆర్, ఎర్రబెల్లిలకు పులి ఎదురైతే ఎర్రబెల్లి బూట్లు చదురుకుంటున్నట్లు నమ్మబలికి కేసీఆర్‌ను ఆ పులికి ఎరగా వేస్తాడని చమత్కరించారు. నాడు టీడీపీ తరహాలో నేడు బీఆర్‌ఎస్‌ను దయాకర్‌రావు బొందపెడతాడని, జాగ్రత్తగా ఉండాలని కేసీఆర్‌కు హితవు పలికారు. చెన్నూరు రిజర్వాయర్ టెండర్ డబుల్ చేసి కమీషన్‌లు నొక్కాడని, ధరణితో బీఆర్‌ఎస్ నాయకులు భూ దందా చేసి మంత్రికి బినామీ ఆస్తులను కూడబెట్టుతున్నారని ఆరోపించారు.
కేసీఆర్ దుష్టపాలనకు చరమగీతం పాడండి
సబ్బండ వర్గాలు సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రాన్ని రాచరిపుక విధానాలతో ఏలుతున్న కేసీఆర్ దుష్టపాలనకు చైతన్యవంతులైన తెలంగాణ సమాజం చరమగీతం పాడాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ధరణి ద్వారా దోపిడీ చేసిన భూదందాదారులను జైలుపాలు చేస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు మల్లు రవి, పొన్నం ప్రభాకర్, దొమ్మాటి సాంబయ్య, సిరిసిల్ల రాజయ్య, బల్మూరి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడితే సహించబోం
హంగ్ పాలనపై ఎంపీ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై రేవంత్ స్పందించారు. ఈ విషయమై అధిష్టానం అంతర్గతంగా చర్చించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. ధర్మాపురం శివారులో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్‌కు పొత్తు ఉంటుందని పార్టీలోని సీనియర్ నాయకులు మాట్లాడినా చర్యలు తప్పవని, ఈ విషయాన్ని రాహుల్‌గాంధీ స్వయంగా చెప్పినట్లు తెలిపారు. రాష్ట్రంలో అధికార ప్రభుత్వంపై విసుగు చెందిన ప్రజలు.. కాంగ్రెస్ పాలన వైపు ఎదురు చూస్తున్న సమయంలో పార్టీకి నష్టం కలిగించే విధంగా మాట్లాడితే ఎంతటి వారైనా సంహించేది లేదని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment