సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి ఉప్పుడు బియ్యం ఇవ్వబోమని కేంద్రానికి లేఖ ఇచ్చిన టీఆర్‌ఎస్ నేతలే మళ్లీ ధర్నాలు చేస్తారా? అని టీపీసీసీ అధ్యక్షుడు ఎ. రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో సీఎం కేసీఆర్ స్వయంగా తెలంగాణ రైతాంగానికి ఉరితాడు బిగించి ఇప్పుడు ధర్నాల పేరుతో రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్‌కు సోమవారం రాసిన బహిరంగ లేఖలో ఆయన 10 ప్రశ్నలు సంధించారు.
ప్రశ్నల్లో కొన్ని..
►తెలంగాణ నుంచి ఉప్పుడు బియ్యం ఇవ్వబోమని 2021 అక్టోబర్ 4న మీరు కేంద్రానికి లేఖ రాసింది వాస్తవం కాదా? తెలంగాణ రైతాంగ ప్రయోజనాలకు ఉరితాడు బిగిస్తూ ఆ లేఖ ఇచ్చే అధికారం మీకు ఎవరిచ్చారు?
►ధాన్యం కొనుగోళ్ల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 7,500 కోట్ల నష్టం వచ్చిందని, క్రయవిక్రయాలు రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత ఎంత మాత్రం కాదని, ఇకపై కొనుగోలు కేంద్రాలు ఉండబోవని 2021 ఫిబ్రవరిలో మీరు ప్రకటన చేసింది వాస్తవం కాదా?
►కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నాటకాలతో రైతులు దళారుల చేతుల్లో నష్టపోవడం లేదా? రూ. 1,960 మద్దతు ధర ఉంటే రూ. 1,200–1,400కే రైతులు ధాన్యం తెగనమ్ముకుంటూ సుమారు రూ. 3 వేల కోట్లను తెలంగాణ రైతులు నష్టపోతున్న మాట విషయం మీకు తెలియదా?
►మిల్లర్ల మాఫియాతో మీ కుటుంబ సభ్యులే ఒప్పందాలు కుదుర్చుకొని రైతులను నిండా ముంచుతున్నారన్న ఆరోపణలకు మీ సమాధానం ఏమిటి?
∙పార్లమెంటు సమావేశాలు ముగిశాక ధర్నాల పేరుతో డ్రామాలు చేయడం మీ రాజకీయ లబ్ధి కోసమే తప్ప రైతుల సమస్యకు పరిష్కారం దొరుకుతుందా?
Comments
Please login to add a commentAdd a comment