మీడియాతో మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: పార్టీ నిబంధనలు బేఖాతరు చేసినవారు, పార్టీ విధానాలను పాటించనివారు ఎంతటివారైనా గోడకేసి కొడతామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను సీనియర్ నేత వి.హన్మంతరావు బేగంపేట విమానాశ్రయంలో కలిసిన విషయాన్ని మీడియా ప్రతినిధులు రేవంత్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెళ్లిన విషయం తనకు తెలియదని, అది ఆయన వ్యక్తిగతం కావచ్చని అన్నారు.
అయితే, సిన్హాను కలవకూడదని పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు సమాచారం ఇచ్చినట్లు ఆయన చెప్పారు. హైదరాబాద్ ఐమాక్స్ చౌరస్తాలో ఉన్న ఇందిరాగాంధీ విగ్రహానికి కట్టిన టీఆర్‌ఎస్ జెండాలను తొలగించేందుకు వెళ్లిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి ఠాణాకు తరలించారు. ఆయనను పరామర్శించేందుకు పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన రేవంత్ మీడియాతో మాట్లాడారు. కార్పొరేట్ కంపెనీల నుంచి వచ్చిన కమీషన్ల సొమ్ముతో బీజేపీ రాష్ట్రంలో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తోందని ఆరోపించారు.
పునర్విభజన చట్టంలోని హామీలు నెరవేర్చకపోవడంపై మోదీని కేసీఆర్ ఏ రోజుకూడా ప్రశ్నించలేదని, దీనిపై ఆయన ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విభజన హామీలపై నిలదీయకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీల చిల్లర పంచాయితీతో దృష్టి మరలుస్తున్నారని ఆరోపించారు. కేంద్రం గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచితే కనీసం స్పందించడంలేదని, రాష్ట్రంలో తగ్గించే అవకాశం ఉన్నా పట్టించుకున్న పాపానపోలేదని ఘాటుగా విమర్శించారు.
ఇందిరాగాంధీ విగ్రహం వద్ద కట్టిన టీఆర్‌ఎస్ జెండాలను తొలగిస్తే మళ్లీ కట్టారని, ఇది చిల్లర రాజకీయం కాదా, సంస్కారం ఉందా అని ప్రశ్నించారు. వంటలు చేసే యాదమ్మ తెలంగాణను మోసం చేసిన మోదీతోపాటు బీజేపీ నేతలకు సలాక ఎర్రగా కాల్చివాతలు పెట్టాలని రేవంత్ కోరారు.
కలవబోమని ముందే చెప్పాం
రాష్ట్రపతి అభ్యర్థిగా ఉన్న యశ్వంత్ సిన్హా టీఆర్‌ఎస్‌ను ముందుగా కలిస్తే, తాము కలిసేది లేదని ముందే చెప్పామని రేవంత్ స్పష్టం చేశారు. యశ్వంత్ సిన్హాకు పార్టీ ఆదేశాల ప్రకారం ఓటు వేస్తామని, కానీ కేసీఆర్‌ను కలిసిన ఎవరితోనూ తాము ఎట్టి పరిస్థితుల్లో కలిసే ప్రసక్తే లేదని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment