మాట్లాడుతున్న రేవంత్, చిత్రంలో భట్టి
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ సైగలతో శాసనసభను నడపడం దుర్మార్గమని, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తన వ్యవహారశైలి మార్చుకోవాలని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. సోమవారం గాంధీభవన్‌లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, సీతక్క, నేతలు కోదండరెడ్డి, అనిల్ యాదవ్‌లతో కలిసి రేవంత్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్ విద్యార్థులను, అమరులను అవమానించిందని.. అమరుల కుటుంబాలకు అణా పైసా కేటాయించలేదని విమర్శించారు. నిరుద్యోగులకు రూ.3,016 భృతి ఇస్తామని గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని.. అది ఏమైందని రేవంత్ నిలదీశారు. సొంత స్థలాల్లో ఇల్లు కట్టుకుంటే రూ.5 లక్షలు ఇస్తామన్న టీఆర్‌ఎస్ సర్కారు.. దాన్ని రూ.3 లక్షలకు కుదించిందని మండిపడ్డారు.
శాసనమండలి రెండు, మూడు రోజులే నడపడం అన్యాయమని పేర్కొన్నారు. గతంలో ఎప్పుడూ బడ్జెట్ ప్రసంగం సమయంలో నిరసనలు తెలిపిన సభ్యుల మీద చర్యలు తీసుకున్న సందర్భాలు లేవని.. కానీ ఇప్పుడు స్పీకర్ తీరు దారుణమని వ్యాఖ్యానించారు. ఒక పార్టీ సభ్యులందరినీ సెషన్ మొత్తం సస్పెండ్ చేయడం సిగ్గుచేటని, దాన్ని కాంగ్రెస్ ఖండిస్తోందని స్పష్టం చేశారు. నిరసన తెలపడం ప్రజాస్వామిక హక్కు అని, నిరసనలతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్న విషయం గుర్తులేదా అన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ సభ్యుల పట్ల కూడా స్పీకర్ తీరు సరిగా లేదని.. దీనిపై మంగళవారం గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని రేవంత్ తెలిపారు. స్పీకర్ వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో అంబేద్కర్ విగ్రహాల దగ్గర నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని ఆందోళన వ్యక్తం చేస్తామని ప్రకటించారు.
కాగా అసెంబ్లీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని.. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పక్షనేత పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తితే స్పీకర్ కన్నెత్తి చూడకపోవడం అవమానకరమని, దళితుడిని సీఎల్పీ లీడర్‌గా సహించలేకపోతున్నారని విమర్శించారు. అలాగే రాష్ట్రం రాజుల చెరలో ఉన్నట్టుగా.. సభాపతి బంట్రోతుగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే సీతక్క వ్యాఖ్యానించారు. గవర్నర్ ప్రసంగం ఉంటే సభ్యులు ప్రజాసమస్యలను ప్రస్తావించే అవకాశం ఉండేదని స్పష్టం చేశారు.
చట్టసభా.. టీఆర్‌ఎస్ పార్టీ ఆఫీసా?: భట్టి విక్రమార్క
అప్రజాస్వామికంగా, నిబంధనలకు విరుద్ధంగా అసెంబ్లీ నడుస్తోందని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్‌గా పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తితే స్పీకర్ కనీసం పట్టించుకోలేదని.. ఇలా ఏకపక్షంగా వ్యవహరించడం దారుణమని వ్యాఖ్యానించారు. ‘‘ఇది చట్టసభనా? లేక టీఆర్‌ఎస్ పార్టీ ఆఫీసా? ప్రతిపక్ష సభ్యులను తీవ్రంగా అవమానిస్తున్నారు. సభా సంప్రదాయం ఉండదా..? మేం కూడా సభ నడిపించామంటూ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తితే స్పీకర్ పట్టించుకోలేదు. ప్రజా సమస్యలను లేవనెత్తకుండా గొంతు నొక్కుతున్నారు. కనీస విధానాలు తెలియని సభాపతిని చూసి సిగ్గుపడాల్సి వస్తోంది. ఇది మీ ఇల్లు కాదు. మేం కూడా ప్రజల నుంచి గెలిచి వచ్చాం. ప్రజా సమస్యలను ప్రస్తావించి తీరుతాం. స్పీకర్ తీరుపై రాష్ట్రపతికి లేఖ రాస్తాం’’అని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment