సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధాని మోదీని కలవడం రాజకీయ పరిపక్వత లేని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి అర్థం కావడం లేదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఎ.జీవన్‌రెడ్డి విమర్శించారు. ఫెడరల్ స్ఫూర్తి గురించి రేవంత్‌కు అవగాహన లేదని, రాష్ట్రానికి సంబంధించిన పన్నెండు అంశాలపై ప్రధానికి, సీఎం వినతిపత్రాలు ఇచ్చిన విషయాన్ని మరచిపోతున్నారని ఎద్దేవా చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉత్తరప్రదేశ్‌లో ఎంఐఎం సీట్ల సర్దుబాటు గురించి మోదీ, కేసీఆర్ మాట్లాడుకున్నారని రేవంత్ చేసిన వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘చంద్రబాబు పెంచిన లిల్లీపుట్ రేవంత్‌రెడ్డి.. ఆయనకు రేబిస్ వ్యాధి సోకింది’అని జీవన్‌రెడ్డి తీవ్ర పదజాలంతో విమర్శించారు. ప్రధాని మోదీని కలసిన పంజాబ్ సీఎం అమరీందర్ కూడా కాంగ్రెస్ టికెట్ల గురించి చర్చించారా? చైనా రాయబారిని కలసిన రాహుల్ గాంధీ దేశ ద్రోహానికి పాల్పడ్డారా? కాంగ్రెస్ టికెట్లు నిర్ణయించేందుకే ఎమ్మెల్యే సీతక్కను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వద్దకు పంపించారా? అని ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు.
రేవంత్‌రెడ్డి గోబెల్స్‌ను మించిపోయి గాంధీభవన్‌ను గాసిప్స్ అడ్డాగా మార్చారని, సోషల్ మీడి యాలో అబద్ధాలు ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. కేరళలో ముస్లింలీగ్‌తో, మహా రాష్ట్రలో శివసేనతో కాంగ్రెస్ ఎందుకు స్నేహం ఏర్పరచుకుందో చెప్పాలన్నారు. ప్రధాన మంత్రిని ముఖ్యమంత్రులు కలవడం సాధారణ విషయమని, రేవంత్ రాజకీయ పరిణతి పెంచుకోవాలని జీవన్‌రెడ్డి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment