సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు టీఆర్‌ఎస్ జిల్లా శాఖలకు అధ్యక్షులొచ్చారు. సుదీర్ఘకాలంగా అదిగో.. ఇదిగో అంటూ ఊరిస్తున్న అధ్యక్షుల పేర్లను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. మరో రెండేళ్లలో జరిగే శాసనసభ ఎన్నికలకు అనుగుణంగా గులాబీ బాస్ కొత్త సారథులను ఎంపిక చేసినట్లు కనిపిస్తోంది. పార్టీ సారథ్య బాధ్యతలను నామినేటెడ్ పోస్టుల రేసులో ఉన్నవారికి అప్పగిస్తారని భావించినా.. అంచనాలు తలకిందులు చేస్తూ మూడు జిల్లాలకు ఎమ్మెల్యే/ఎమ్మెల్సీలనే ఖరారు చేయడం ఆశ్చర్యానికి గురి చేసింది.
గ్రేటర్ పరిధిలోని మూడు జిల్లాల్లో రెండు ఎమ్మెల్యేలకు, ఒకటి ఎమ్మెల్సీకి దక్కాయి. హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు నియమితులయ్యారు. ఇక త్వరలోనే జిల్లా, డివిజన్ల పూర్తిస్థాయి కమిటీలు పూర్తి చేయనున్నట్లు భావిస్తున్నారు. (క్లిక్: వీరే గులాబీ రథసారథులు.. 33 జిల్లాల అధ్యక్షుల జాబితా ఇదే)
ముగ్గురూ ముగ్గురే..
► అధ్యక్షులుగా నియమితులైనవారు సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్నవారే. గోపీనాథ్, కిషన్‌రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ హయాం నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. మాగంటి గోపీనాథ్ 1985లో తెలుగుయువత అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1987లో హుడా డైరెక్టర్‌గా, 1988 వినియోగదారుల ఫోరం తొలి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. టీఆర్‌ఎస్‌లోకి రాకముందు టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు.
► మంచిరెడ్డి కిషన్‌రెడ్డి రెండు పర్యాయాలు టీడీపీ నుంచి, 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. సర్పంచ్‌గా రాజకీయ అరంగేట్రం చేసిన మంచిరెడ్డి.. ఉమ్మడి రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా.. నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ తదితర హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్‌గా ఉన్నారు.
► కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన శంభీపూర్ రాజు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా ఉన్న ఆయనకు గులాబీ దళపతికి సన్నిహితుడిగా పేరుంది. వరుసగా రెండోసారి ఎమ్మెల్సీ పదవి లభించింది.
అదృష్టంగా భావిస్తున్నా
పార్టీ సభ్యత్వ నమోదు నుంచి అధిష్టానం అప్పగించిన ఏపనైనా నిబద్ధతతో, సిస్టమేటిక్‌గా చేస్తున్నా. ఎంతో కీలకమైన, రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్ జిల్లాకు పార్టీ అధ్యక్షుడిగా నియమించడాన్ని అదృష్టంగా భావిస్తున్నా. హైకమాండ్ ఆదేశాలకనుగుణంగా.. అందరినీ కలుపుకొని నడుచుకుంటాను.
– మాగంటి గోపీనాథ్
సమన్వయంతో పనిచేస్తా
పార్టీ పటిష్టత కోసం ఎమ్మెల్యేలు, క్యాడర్‌తో సమన్వయంతో పనిచేస్తా. గతంలోనూ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవముంది. నాపై నమ్మకముంచి బాధ్యతలప్పగించిన అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా. మరింత కష్టపడి పనిచేస్తా. పార్టీ బలోపేతానికి
పాటు పడతా.
– మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
తిరుగులేని మెజార్టీకి కృషి
కేసీఆర్, కేటీఆర్‌ల ఆశయాలకనుగుణంగా పని చేస్తా. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరినీ కలుపుకొని ముందుకు సాగుతా. వార్డు, డివిజన్, పట్టణ, మండల, జిల్లాస్థాయిలో పార్టీకోసం పనిచేసే వారికి తగిన పదవులు లభించేలా చూస్తా. అందరి సహకారంతో వచ్చే ఎన్నికల్లో జిల్లాలో పార్టీ అభ్యర్థులు తిరుగులేని మెజార్జీతో గెలిచేలా కృషి చేస్తా.
– శంభీపూర్ రాజు
Comments
Please login to add a commentAdd a comment