సాక్షి ప్రతినిధి, నల్లగొండ : వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు మునుగోడు ఉప ఎన్నికను సెమీఫైనల్‌గా భావిస్తున్న సీఎం కేసీఆర్ ఎలాగైనా గెలిచి తీరాలనే ఆలోచనలో ఉన్నారు. మునుగోడులో 51శాతం ఓట్ల సాధనే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ మేరకు మునుగోడు సెగ్మెంట్‌ను 86 యూనిట్లుగా విభజించారు.
ఒక్కో యూనిట్‌కు ఒక్కో ఇన్‌చార్జ్‌ని నియమించారు. ఇందులో సీఎం కేసీఆర్‌తో సహా 16మంది మంత్రులు, 70మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు ఉన్నారు. వీరిని ఇన్‌చార్జ్‌గా నియమించిన వార్డు లేదా ఎంపీటీసీ పరిధిలోని ఓట్లలో 51శాతం సాధించాలనేది లక్ష్యంగా నిర్దేశించారు. ఓట్ల సాధనే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పనితీరుకు గీటురాయిగా నిర్దేశించారు.
ఓటేయాలంటే అసలు మీకేం కావాలి
కేసీఆర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఇన్‌చార్జ్‌లు తమకు కేటాయించిన స్థానాల్లో గ్రౌండ్ వర్క్‌ను మొదలు పెట్టారు. కేసీఆర్, కేటీఆర్‌లాంటి వ్యక్తులు రానిచోట వారి మనుషులు వారం క్రితమే రంగంలోకి దిగారు. యూనిట్ పరిధిని, పరిధిలోని గ్రామాలను వార్డులుగా విభజించి ఇన్‌చార్జ్‌ల సొంత సైన్యం, స్థానిక టీఆర్‌ఎస్ లీడర్లతో సంయుక్తంగా కమిటీలను ఏర్పాటు చేశారు. ఓటర్ల వివరాలను కులాల వారీగా, పార్టీల వారీగా వేరుచేశారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వానికి సానుకూలంగా, వ్యతిరేకంగా ఉన్న కుటుంబాలను కూడా గుర్తించారు. ఎందుకు సానుకూలంగా ఉన్నారు, ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారన్న దానిపై కూడా ఆరా తీశారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకనా, ఇంకేదైనా కారణమా అన్నదానిపై కూడా లోతుగా వెళ్లారు. చివరకు టీఆర్‌ఎస్ పార్టీకి ఓటేయాలంటే మీకేం కావాలి. ఆసరా పింఛనా, రేషన్ కార్డా, దళిత బంధా, డబుల్ బెడ్రూం ఇల్లా, జాగా ఉంటే ఇల్లు కట్టుకోవడానికి సాయమా, ఏంటి.. వ్యక్తిగత సమస్యలు ఉన్నాయా అని నమోదు చేసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలైతే ఉప ఎన్నికలు ముగిశాక ఇప్పిస్తామని భరోసానిస్తున్నారు. ఇన్‌చార్‌్జలు స్థానిక లీడర్లతో గ్రామ సమస్యలను కూడా గుర్తించి ఏమేం అభివృద్ధి పనులు చేయాలి అనేది కూడా గుర్తించి ఎన్నికలయ్యాక నిధులొస్తాయని చెబుతున్నారు.
సొంతంగా ఖర్చులు
పోలింగ్ దగ్గరికి వచ్చే దాకా ఆయా గ్రామాల్లో ఇన్‌చార్జ్‌లే సొంతంగా ఖర్చులు భరించాలని పార్టీ అధిష్టానం ఆదేశాలు ఉన్నాయి. కేసీఆర్ చెప్పినట్టు ఓట్లను రాబట్టేందుకు అప్పుడే ఖర్చులు మొదలయ్యాయి. ఊరికో ఫంక్షన్ హాల్, అది లేనిచోట ఇల్లు అద్దెకు తీసుకున్నారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి మందు, భోజనం వడ్డిస్తున్నారు. ఒక్కో యూనిట్ పరిధిలో రోజుకు రూ.50 వేల నుంచి రూ.1లక్ష వరకు ఖర్చవుతున్నాయి. మరోవైపు ఇతర పార్టీల్లోని వారిని చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీపై ప్రధానంగా దృష్టి సారించారు.
ఇన్‌చార్జ్‌ల్లో టెన్షన్.. టెన్షన్
కేసీఆర్, కేటీఆర్ మినహా మిగతా ఇన్‌చార్జ్‌లంతా తమకు కేటాయించిన గ్రామాలకు వచ్చిపోతున్నారు. కొన్ని గ్రామాలు ఇంకా గాడిన పడలేదు. స్థానికంగా గ్రామాల్లో టీఆర్‌ఎస్ పార్టీలో ఉన్న గ్రూపులు, వ్యతిరేకతను చూసి మంత్రులే జంకుతున్నారు. కొంత మంది ఇన్‌చార్జ్‌లు పార్టీ గిట్లుంటే 51 శాతం ఎట్ల వస్తాయని మదనపడుతున్నారు. ఒకవేళ కేసీఆర్ చెపిన ఓట్లే రాకపోతే ఎటొచ్చి ఏమైతదో, భవిష్యత్‌లో ఏం ఇబ్బందులు ఎదుర్కోవాలో, అత్యధిక ఓట్లను ఏట్లా సాధించాలోనని ఆందోళన చెందుతున్నారు. గ్రామాల్లో పట్టున్న లీడర్ల వద్ద ‘ఎక్కువ ఓట్లు రాకపోతే మాకు ఎమ్మెల్యే టికెట్లు రావు’ ఏం చేయాలో చెప్పండని వేడుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment