సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో భారీ అవినీతి జరుగుతోందని, ఉన్నట్టుండి ఓ ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని ఒక్కసారిగా రూ.40 వేల కోట్ల నుంచి రూ.లక్షా 30 వేల కోట్లకు పెంచేశారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించారు. ఈ డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్లిందో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌తో పాటు రాష్ట్రంలోని ప్రతి మంత్రి, ఎమ్మెల్యే సమాధానమివ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు సందర్భంగా ఆదివారం పరేడ్ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
ఫార్మ్‌హౌస్ పాలన ఇంకెంత కాలం?
‘రాష్ట్రంలో ఇంకా ఎంత కాలం ఫార్మ్‌హౌస్ నుంచి ప్రభుత్వం నడుస్తుంది? ఇంకెంత కాలం రైతులు పరేషాన్‌తో ఉంటారు? ఎంత కాలం మహిళలకు, పిల్లలకు భద్రత ఉండదు?’అని గోయల్‌ప్రశ్నించారు. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం తెలంగాణలో మహిళలు, పిల్లలపై అత్యాచారాలు అధికంగా జరిగాయని చెప్పారు. వీటిని నియంత్రించాల్సిన అవసరముందని, యూపీ, ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల తరహాలో ఇక్కడ సైతం శాంతిభద్రతలు ఉండాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నట్టు తెలిపారు.
బీజేపీ సర్కారే ఏకైక ప్రత్యామ్నాయం
ఇక్కడి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, మార్పు కోసం ప్రజల్లో ఉన్న కాంక్ష పల్లెపల్లెనా కనిపిస్తోందని గోయల్ పేర్కొన్నారు. అవినీతి, కుటుంబ పాలనను సహించడానికి ప్రజలు ఏ మాత్రం సిద్ధంగా లేరన్నారు. తెలంగాణలో గత 8 ఏళ్లలో జరిగిన అవినీతి, రైతులకు అవమానాలు, ఉద్యోగాల కల్పన లేక ఏర్పడిన పరిస్థితులకు ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీ సర్కారు మాత్రమేనని చెప్పారు.
తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఇక్కడ సైతం ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో అధికారం చేజారిపోతోందని కేసీఆర్, కేటీఆర్ దుఖంతో, భయంతో ఉన్నారని ఎద్దేవా చేశారు.
ఇది ట్రైలర్ మాత్రమే..
ఈటల రాజేందర్‌ను ఓడించడానికి రాష్ట్ర ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డినా ప్రజలు గెలిపించారని, ఇది ట్రైలర్ మాత్రమేనని పీయూష్ వ్యాఖ్యానించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీని 50 వరకు సీట్లలో ప్రజలు గెలిపించారని, 4 సీట్లు ఒక్కసారిగా 50కి పెరిగాయని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో వస్తే యువతకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తామని కేసీఆర్, కేటీఆర్ పెద్ద, పెద్ద మాటలు అంటున్నారని, కానీ ద్రౌపది ముర్ము భారీ విజయం సాధిస్తారని గోయల్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment