సాక్షి, హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కుట్ర వెనుక తనపాత్ర ఉందంటూ ఆరోపణలు చేస్తున్న మంత్రి కేటీఆర్‌కు.. ఆ ఆధారాలు సమర్పించాలని నోటీసులిచ్చే దమ్ము సిట్‌కు ఉందా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ ప్రశ్నించారు. తనపై చేస్తున్న ఆరోపణలకు సంబంధించి కేటీఆర్‌ను పిలిచి విచారించే ధైర్యముందా అని నిలదీశారు. ఈ లీకేజీ కేసులో సిట్ నోటీసుల పేరుతో ప్రతిపక్ష పార్టీల నేతల నోరు నొక్కేసే కుట్రకు సీఎం కేసీఆర్ తెరదీశారని సోమవారం ఆయన ఒక ప్రకటనలో మండిపడ్డారు.
ఈ కుట్ర కు కారకులైన వారిని వదిలేసి విపక్షాలకు నోటీసులు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. సిట్ నోటీసులకు, విచారణకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. తన కొడుకు, బిడ్డ తప్పుచేసినా ఉపేక్షించబోనని అసెంబ్లీలో ప్రకటించిన కేసీఆర్‌కు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, విపక్షాలకు నోటీసులు ఇవ్వడం కంటే ముందే కేటీఆర్‌కు నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తన కొడుకు తప్పు చేయలేదని కేసీఆర్ భావిస్తే తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, అప్పుడే తమవద్ద ఉన్న సమాచారాన్ని అందిస్తామని పేర్కొన్నారు. కేసీఆర్ జేబు సంస్థగా సిట్ మారిందని, గతంలో డ్రగ్స్, నయీం డైరీ, మియాపూర్ భూములపై సిట్‌లు జరిపిన విచారణలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఆ కేసులను నీరుగార్చడంతోపాటు కేసీఆర్‌కు ప్రయోజనం చేకూర్చేలా సిట్‌లు పనిచేశాయని ఆరోపించారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు.
చదవండి: పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ కీలక నిర్ణయం.. ఇక అనుబంధ సంఘాలపై ‘దృష్టి’
Comments
Please login to add a commentAdd a comment