సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం ప్రభుత్వం, మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. కొన్ని ట్విటర్ ఖాతాలను తొలగించాలన్న ప్రభుత్వ ఆదేశాలపై ట్విటర్ వివరణపై ఐటీ శాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఖలిస్తాన్, పాకిస్తాన్ లింకులున్న మొత్తం 1,178 ఖాతాలను బ్యాన్ చేయాలన్న హెచ్చరికల నేపథ్యంలో పలు ఖాతాలను ఇప్పటికే తొలగించిన ట్విట్టర్, తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. భారత ప్రభుత్వ ఆదేశాలు చట్ట విరుద్ధమని, భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతమంటూ ఒక బ్లాగ్ పోస్ట్ లో వివరణ ఇచ్చింది. అయితే దీనిపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆ గ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వంతో చర్చలకు ముందే ఈ విధంగా వ్యవహరించడం సరికాదని, ఇది చాలా వింతగానూ అసాధారణంగానూ ఉందని తెలిపింది. దీనిపై మరింత వివరంగా త్వరలోనే స్పందించనున్నట్లు పేర్కొంది. అలాగే దేశీయ యాప్ 'కూ' వేదికపై మంత్రిత్వ శాఖ తనకమెంట్‌ను పోస్ట్ చేయడం విశేషం. (ట్విటర్‌కు షాక్: దేశీ ట్విటర్ ‘కూ’ జోరు)
'కూ' వేదిక కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఇచ్చిన సందేశంలో, ప్రభుత్వంతో సమావేశమయ్యేందుకు అవకాశం ఇవ్వాలని ట్విటర్ కోరిందని, ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ట్విటర్ సీనియర్ మేనేజ్‌మెంట్‌తో మాట్లాడవలసి ఉందని తెలిపింది. ఈ సమావేశం ముందే బ్లాగ్ పోస్ట్‌ను పోస్ట్ చేయడం అసాధారణ విషయమని, ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించింది. (రైతు ఉద్యమం : ఆ ఖాతాలకు షాక్)
కాగా కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతు ఆందోళనలో భాగంగా గణతంత్ర దినోత్సవంరోజు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ హింసకు దారి తీసింది. ఈ నేపథ్యంలోనే ట్విటర్, కేంద్ర ప్రభుత్వం మధ్య వివాదం మొదలైంది. 250 ట్విటర్ ఖాతాలపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ట్విటర్‌ను కోరింది. దీనిపై స్పందించిన ట్విటర్ తమ సిబ్బంది భద్రత పట్ల ఆందోళన వ్యక్తం చేసింది.ప్రభుత్వ ఆదేశాల మేరకు తీసుకున్న చర్యలను, తీసుకోలేకపోయిన చర్యలను ఈ పోస్ట్‌లో వివరించింది. మీడియా సంస్థలు, పాత్రికేయులు, ఉద్యమకారులు, రాజకీయ నాయకుల ఖాతాలపై చర్యలు తీసుకోలేదని తెలిపింది. వీటిపై చర్యలు తీసుకుంటే, భారతీయ చట్టాల ప్రకారం వారి ప్రాథమిక హక్కును ఉల్లంఘించినట్లవుతుందని పేర్కొంది. ప్రభుత్వంతో సమావేశమయ్యేందుకు అవకాశం కల్పించాలని కోరింది. కేంద్ర ఎలక్ట్రానిక్, ఐటీ మంత్రిత్వ శాఖకు బుధవారం ఈ సమాచారాన్ని తెలియజేశామని, చర్చలను కొనసాగిస్తామని ట్విటర్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment