మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే
ముంబై: ‘‘ఈరోజు మనం పది తలల రావణుడికి ప్రతిరూపంగా కొన్ని ముఖాలను కాల్చివేస్తున్నాం. అందులో ముంబై పీఓకే అన్న ముఖం కూడా ఒకటి’’అంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ను ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. అదే విధంగా నటుడు సుశాంత్ రాజ్‌పుత్ సింగ్ ఆత్మహత్య చేసుకుంటే, ఆ విషయంలో తన కుమారుడిని లాగే ప్రయత్నం చేశారంటూ విరుచుకుపడ్డారు. ఎవరు ఎన్నివిధాలుగా తమపై నిందలు వేయాలని చూసినా, తాము భయపడమని, న్యాయం తమవైపే ఉందని వ్యాఖ్యానించారు.(చదవండి: కంగనాపై మరో కేసు నమోదు..)
ఇక కొంతమంది తనకు హిందుత్వ గురించి పాఠాలు బోధించాలని చూస్తున్నారని, అలాంటి వారు ముందుగా, తమ గురించి తాము తెలుసుకోవాలంటూ గవర్నర్, బీజేపీ నేతలను ఉద్దేశించి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. దసరా పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి హోదాలో ఉద్ధవ్ ఠాక్రే తొలిసారి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. స్వతంత్ర వీరసావర్కర్ ఆడిటోరియంలో ఆదివారం జరిగిన విజయదశమి మేళా కార్యక్రమంలో మాట్లాడుతూ, గవర్నర్ వ్యవహార శైలి, బీజేపీ తీరు, సుశాంత్ రాజ్‌పుత్ మృతి, కంగన పీఓకే వ్యాఖ్యలు, బిహార్ అసెంబ్లీ ఎన్నికలు తదితర అంశాలను ప్రస్తావించారు.(చదవండి: వ్యాక్సిన్: దేశం మొత్తానికి సమాన హక్కులు!)
ఉద్ధవ్ ఠాక్రే ప్రసంగంలోని కీలక అంశాలు
1. మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కొశ్యారీ ఇటీవల తన గురించి చేస్తున్న వ్యాఖ్యలను ఉద్దేశించి.. ‘‘నల్ల టోపీ పెట్టుకున్న ఆ వ్యక్తి, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ దసరా ప్రసంగాన్ని ఒకసారి వినండి. హిందుత్వ అంటే కేవలం ఆలయాల్లో పూజలు చేయడం మాత్రమే కాదు అని తెలుసుకోండి’’అని ఉద్ధవ్ ఠాక్రే విమర్శించారు.
2. ‘‘ప్రభుత్వాన్ని కూలదోస్తామని కొంతమంది పదే పదే చెబుతున్నారు. నిజంగా మీకు దమ్ముంటే ఆ ప్రయత్నం చేయండి. మీరు కచ్చితంగా విఫలం అవుతారు. శివసేన సైలెంట్‌గా ఉంది కదా అని.. ఇష్టారీతిన రెచ్చిపోతే కఠిన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. అప్పుడు శివ సైనికుల ఆగ్రహానికి మీరు తట్టుకోలేరు.
3. గోవాలో బీఫ్‌పై నిషేధం లేదు. కానీ మహారాష్ట్రలో పరిస్థితి ఏంటో తెలుసు కదా! ఇలాంటి వాళ్లు నాకు హిందుత్వ గురించి బోధిస్తున్నారు.
4. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌జీకి ఆల్ ద బెస్ట్ చెబుతున్నాను. హర్యానా ఎన్నికల సమయంలో, కుల్దీప్ సింగ్ బిష్ణోయిని ముఖ్యమంత్రిని చేస్తామని వాళ్లు(బీజేపీ) చెప్పారు. మహారాష్ట్ర ఎన్నికల సమయంలోనూ ఇలాంటి వాగ్దానాలే చేశారు. కానీ ఏం జరిగింది? ఇప్పుడు.. నితీశ్ కుమార్ కాబోయే సీఎం అని చెబుతున్నారు. సంఘ్ విముక్త భారత్‌ను కోరుకున్న ఆయనకు గుడ్‌లక్.
5. బిహార్ ఎన్నికల్లో గెలిస్తే కోవిడ్-19 వ్యాక్సిన్‌ను ఉచితంగా ఇస్తామని చెబుతున్నారు. మరి మహారాష్ట్ర ప్రజలు ఎక్కడ జీవిస్తున్నారు? బంగ్లాదేశ్‌లోనా? పాకిస్తాన్‌లోనా?
6. సుశాంత్ రాజ్‌పుత్ సింగ్ ఆత్మమత్య చేసుకుంటే, బిహార్ పుత్రుడు బలవన్మరణం చెందాడని ప్రచారం చేశారు. ఆయన బిహార్‌కు చెందినవాడైనంత మాత్రాన, మా మహారాష్ట్రను అప్రదిష్టపాలు చేసేవిధంగా మాట్లాడతారా? ఈ విషయంలో, నా కుమారుడు ఆదిత్య పేరును మీరు ప్రస్తావించారు. మా పరువుకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారు. మీరెంతగా ప్రయత్నించినా మమ్మల్ని ఏం చేయలేరు.
7. శివసేన అధినేతనైన నేను కూడా ముంబై పోలీసునే. మీకు రక్షణ కల్పించేందుకు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడే పోలీసుల గురించి అలా ఎలా మాట్లాడతారు? ముంబైని పీఓకేతో పోల్చి ప్రధాని నరేంద్ర మోదీని అవమానపరిచారు. భారత్‌లో పీఓకే ఉందంటే, అది ప్రధాని వైఫల్యం కాదా?
8. వాళ్లుదేశాన్ని విభజిస్తున్నారు. కానీ మహారాష్ట్రలో వాళ్ల ఆటలు సాగవు. మేం సాగనివ్వం. ప్రతి విషయానికి ఓ హద్దు ఉంటుంది. సహనం నశిస్తే మేమే మిమ్మల్ని బ్రేక్ చేస్తాం. మా ప్రభుత్వాన్ని కూలదోసే ముందు మీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. బిహార్ ప్రజలు అన్ని ఆలోచించిన తర్వాతే ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నా.
9. మహమ్మారి కోవిడ్-19 వ్యాప్తి గురించి పట్టించుకోని బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టే పనిలో ఉంది. త్వరలోనే ఇక్కడ ఆలయాలను తెరుస్తాం. లాక్‌డౌన్ పొడిగించాలని లేదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో జాగ్రత్తగా మసలుకోవడమే మంచిది
10. మరాఠా, ధంగర్, ఓబీసీలంతా ఒక్కటిగా ఉండాలి. మహారాష్ట్ర ఒక్కటిగా ఉండటం కోసం అంతా ఐక్యంగా ఉండాలని అభ్యర్థిస్తున్నా.
दसरा मेळावा - २०२० https://t.co/98TroPYYw8
— Office of Uddhav Thackeray (@OfficeofUT) October 25, 2020
Comments
Please login to add a commentAdd a comment