ముంబై: బీజేపీకి వెన్నుపోటు పొడిచి ఎన్‌సీపీతో చేతులు కలిపినప్పుడే ఉద్ధవ్ థాక్రే తలరాత ఖరారైందని వ్యాఖ్యానించారు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. 2019 ఎన్నికల్లో కలిసి పోటీ చేసిప్పుడు ఆయనకు తాము ఎలాంటి హామీ ఇవ్వలేదని పేర్కొన్నారు. ఎన్సీపీతో జతకట్టాలని ఉద్ధవ్ ముందుగానే నిర్ణయించుకున్నారని చెప్పారు. అది అసహజ కూటమి అన్నారు. ఆ రోజు తాను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఉద్ధవ్ నుంచి స్పందన రాలేదని వెల్లడించారు. బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఏక్‌నాథ్ షిండేకు సీఎం పదవి ఇవ్వడం ఎవరికీ ఇష్టం లేదని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఫడ్నవీస్ పేర్కొన్నారు. బీజేపీ కార్యకర్తలంతా తననే ముఖ్యమంత్రి కావాలనుకున్నారని, కానీ అలా జరగకపోయేసరికి బాధపడ్డారని తెలిపారు. తాము అధికారం కోసం కాదు, సిద్ధాంతాల కోసమే పనిచేస్తున్నామని నిరూపించేందుకే షిండేకు సీఎం బాధ్యతలు అప్పగించామని ఫడ్నవీస్ వివరించారు.
బాలాసాహెబ్ థాక్రే సిద్ధాంతాలను పాటిస్తున్న అసలైన శివసేన తమతోనే ఉందని ఫడ్నవీస్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో షిండే శివసేనతోనే కలిసి పోటీ చేసి ఇప్పుడున్న స్థానాల కంటే ఎక్కువ సీట్లు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
చదవండి: కూతురిపై ఆరోపణలు.. కాంగ్రెస్ నేతలకు స్మృతి ఇరానీ లీగల్ నోటీసులు
Comments
Please login to add a commentAdd a comment