కేసీఆర్‌కు ఏఐసీసీ, కేటీఆర్‌కు పీసీసీ చీఫ్, కవితకు రాజ్యసభ సీటు ఖాయం
కవిత బెయిల్‌కు, బీజేపీకి ఏం సంబంధం?
కాళేశ్వరం, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో కేసీఆర్, కేటీఆర్‌లను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు?
సీఎం రేవంత్ వ్యాఖ్యలను ఖండించిన కేంద్రమంత్రి బండి సంజయ్
సాక్షి, న్యూఢిల్లీ: అతి త్వరలో కాంగ్రెస్ పార్టీలో బీఆర్‌ఎస్ విలీనం కావడం తథ్యమని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ తెలిపారు. బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనమవు తుందని, అందులో భాగంగానే కవితకు బెయిల్ రాబోతుందంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని బండి సంజయ్ పేర్కొన్నారు. కవితకు బెయిల్ ఇవ్వాలా? వద్దా? అనేది న్యాయస్థానం పరిధిలోని అంశమని, కవిత బెయిల్‌కు, బీజేపీకి ఏం సంబంధం? అని ప్రశ్నించారు. ఆమ్‌ఆద్మీ పార్టీని విలీనం చేసుకుంటేనే ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు బెయిల్ వచ్చిందా అని నిలదీశారు.
సీఎం పదవిలో కొనసా గుతూ రాజకీయలబ్ధి కోసం రేవంత్‌రెడ్డి న్యాయస్థానంపై బురదచల్లి కోర్టుల ప్రతిష్టను తగ్గించడం దుర్మార్గమన్నారు. బీజేపీని బదనాం చేసేందుకు కాంగ్రెస్ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం కేంద్రమంత్రి బండి సంజయ్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ది ముగిసిన అధ్యాయమని, ప్రజలు ఛీత్కరించిన ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన ఖర్మ బీజేపీకి లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. పథకం ప్రకారమే ఆ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారని, అతి త్వరలోనే కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్ విలీనమవడం తథ్యమన్నారు.
కేసీఆర్‌ను ఏఐసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, కేటీఆర్‌ను పీసీసీ చీఫ్‌గా, హరీశ్‌రావుకు మంత్రిపదవి ఇవ్వడంతోపాటు, కవితకు రాజ్యసభ పదవి ఇవ్వడం ఖాయమన్నారు. కాంగ్రెస్ నాయకులకు అంత ఉబలాటముంటే రాజ్యసభ ఎన్నికలొస్తున్నందున కవితను కాంగ్రెస్ పక్షాన రాజ్యసభకు పంపినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఎద్దేవా చేశారు. గతంలోనూ బీఆర్‌ఎస్‌తో మంత్రి పదవులు పంచుకున్న చరిత్ర కాంగ్రెస్‌కు ఉందన్నారు. అందుకే కాళేశ్వరం, డ్రగ్స్, ఫోన్‌ట్యాపింగ్ సహా అనేక అవినీతి, అక్రమాలు, అరాచకాలకు పాల్పడ్డ కేసీఆర్, కేటీఆర్ సహా బీఆర్‌ఎస్ నేతలు జైలుకు వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీనే కాపాడుతోందని సంజయ్ ఆరోపించారు. బీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ దాగుడు మూతల వ్యవహారం జగమెరిగిన సత్యమని ‘నువ్వు కొట్టినట్లు చెయ్... నేను ఏడ్చినట్లు చేస్తానన్నట్లుంది’ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల తీరు అని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment