బేటీ పడావోను తప్పుగా రాసిన కేంద్రమంత్రి.. కాంగ్రెస్ విమ‌ర్శ‌లు | Union Minister Misspells Beti Padhao Beti Bachao Congress Slams BJP | Sakshi
Sakshi News home page

బేటీ బ‌చావో, బేటీ పడావోను తప్పుగా రాసిన కేంద్రమంత్రి.. కాంగ్రెస్ విమ‌ర్శ‌లు

Published Thu, Jun 20 2024 10:52 AM | Last Updated on Thu, Jun 20 2024 11:01 AM

Union Minister Misspells Beti Padhao Beti Bachao Congress Slams BJP

‘బేటీ బచావో, బేటీ పడావో’.. దేశంలో బాలికల సంక్షేమం కోసం, వారి చదువుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ నినాదాన్ని తీసుకొచ్చిన విష‌యం తెలిసిందే.  ఈ పథకాన్ని 22 జనవరి 2015న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు.  భ్రూణహత్యలను త‌గ్గించి, బాలిక‌ల లింగ నిష్ప‌త్తిని పెంచేందుకు, ముఖ్యంగా చ‌దువుల్లోనూ అమ్మాయిల‌ను ప్రోత్స‌హించేందుకు తీసుకొచ్చారు.

కేంద్రం ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు చేస్తున్న ఈ నినాదాన్ని తాజాగా ఓ మ‌హిళా కేంద్ర‌మంతి స‌రిగా రాయ‌లేక‌పోయారు. కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ స‌హాయ మంత్రి సావిత్రి ఠాకూర్ ఆమె మాతృ భాష ‘బేటీ బచావో, బేటీ పడావో’ నినాదా హిందీలో తప్పుగా రాశారు. మంగళవారం మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో జరిగిన  ‘స్కూల్‌ ఛలో అభియాన్’ కార్యక్రమంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట్లో వైర‌ల్‌గా మారాయి.

అయితే  జాతీయ స్థాయి నేత మాతృభాషలో ఈ పదాన్ని తప్పుగా రాయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చిన్న నినాదాన్ని కూడా మంత్రి సరిగా రాయలేకపోయారంటూ కాంగ్రెస్ మండిప‌డుతోంది.

 

పార్టీ సీనియర్‌ నేత కేకే మిశ్రా స్పందిస్తూ..రాజ్యాంగబ‌ద్ధ పదవుల్లో ఉంటూ పెద్ద శాఖలు చూస్తున్న వ్యక్తులకు తమ మాతృభాషలో సైతం సామర్థ్యం లేకపోవడం దురదృష్టకరం. వాళ్లు తమ శాఖలను సమర్థంగా ఎలా నిర్వహించగలరు?’ అని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కనీస విద్యార్హత నిబంధనను రాజ్యాంగం విధించాలని అభిప్రాయపడ్డారు.

అయితే కాంగ్రెస్ విమర్శలను ధార్‌ జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఖండించారు.. మంత్రి తొందరపాటులో చేసిన తప్పును కాంగ్రెస్‌ పెద్దది చేసి చూపడం ఆ పార్టీ అల్పమైన ఆలోచనలకు, గిరిజన వ్యతిరేకతకు నిదర్శనమని అన్నారు.  ఆదివాసీ మహిళా ప్రతినిధి అని కూడా చూడకుండా కాంగ్రెస్ అనవసరపు రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు.

కాగా సావిత్రి ఠాకుర్‌.. మధ్యప్రదేశ్‌లోని ధార్‌ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇటీవ‌ల మోదీ 3.0 కేబినెట్‌లో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement