సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పు అవసరం ఉందంటూ ఏఐసీసీ కార్యదర్శి, నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీ చేసిన వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పందించారు. మధుయాష్కి తనతో మాట్లాడారని, పీసీసీ మార్పుపై ఆయన ఎటువంటి స్టేట్‌మెంట్ ఇవ్వలేదని ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌లో 60వేల కోట్లు ఖర్చు చేశామనడంపై ఆయన మాట్లాడుతూ.. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. ఇక్కడే మేము వ్యవసాయం చేశాం. కేసీఆర్ హైదరాబాద్‌లో 60వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. ఎక్కడ చేశారో తెలియదు. వరదలు పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం వల్లే జరిగాయి. వర్షాలకే నగరం సగం మునిగిందంటే ఇది టీఆర్ఎస్ పని తీరుకు నిదర్శనం. వరదల్లో వంద మంది చనిపోతే.. ఒక్కచోట కూడా పరామర్శించలేదు. 550 కోట్లు వరద బాధితులకు ఇస్తామన్నారు. (పీసీసీ మార్పు: మధుయాష్కీ హాట్ కామెంట్స్)
రూ.2 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్‌లో రూ.5 వేల కోట్లు హైదరాబాద్‌కు ఇవ్వలేరా..?. ప్రతీ కుటుంబానికి 50వేల రూపాయల పరిహారం ఇవ్వాలి. ప్రజల ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామంటే ముఖ్యమంత్రి, సీఎస్ అపాయింట్ ఇవ్వడం లేదు. వరద సహాయాన్ని దోచుకుతింటున్నారు. రూ.350కోట్లు నగదు ఎలా డ్రా చేస్తారు. లబ్ధిదారుల జాబితా ఎందుకు ఇవ్వడం లేదు. వరద సహాయం అతిపెద్ద కుంభకోణం. దోపిడీపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. 3లక్షల 87వేల మంది లబ్దిదారుల జాబితా ఎందుకు ఇవ్వరు. సీఎం అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంతో గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం. జరుగుతున్న దోపిడీని గవర్నర్‌కు ఫోన్‌లో వివరించాం. విచారణ జరిపించాలని కోరాం. కరోనా సమయంలో రూ.1,500 బ్యాంకు లో వేసిన ప్రభుత్వం.. ఇప్పుడు రూ.10వేలు క్యాష్ ఎట్లా ఇస్తారు. గ్రేటర్ ఎన్నికల కోసం ఇంతగా దిగజారాలా. పరిహారం దోపిడీపై వదిలేది లేదు. అధికారులను కోర్టుకు ఈడ్చుతాం అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment