
సాక్షి, న్యూఢిల్లీ: అధికారం కోసం కుటుంబ సభ్యులు పోరాడడం సహజం. అయితే, యూపీ ఎన్నికల్లో ఒకే నియోజకవర్గంలో ఒకే పార్టీ నుంచి పోటీ చేయడానికి ఆలుమగలు పోటీపడడం ఆసక్తికరంగా మారింది. సరోజనీనగర్ సీటు కోసం సీఎం యోగి ఆదిత్యనాద్ మంత్రివర్గంలోని స్వాతి సింగ్, ఆమె భర్త పార్టీ ప్రదేశ్ ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్ ఇద్దరూ పోటీ పడుతున్నారు. ఫిబ్రవరి 23న నాలుగో దశలో ఈ నియోజకవర్గం ఎన్నిక జరగనుంది.
దయాశంకర్ పార్టీ ఎన్నికల కమిటీలో సభ్యుడు కావడంతోపాటు ఇటీవల ములాయంసింగ్ యాదవ్ కోడలు అపర్ణ యాదవ్‌ను పార్టీలో చేర్చడంలో కీలకపాత్ర పోషించారు. స్వాతి సింగ్ ప్రస్తుతం పలు శాఖల సహాయ మంత్రిగా, స్వతంత్రహోదా మంత్రిగా ఉన్నారు. 2016లో పార్టీలో చేరిన స్వాతి సింగ్ 2017లో సరోజనీ నగర్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2016లో బీఎస్పీ అధినేత్రి మాయావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఏడాదిపాటు దయాశంకర్‌ను పార్టీ సస్పెండ్ చేసింది.
అన్సల్ బిల్డర్స్‌పై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసిన పోలీసు అధికారిని బెదిరించారంటూ స్వాతి సింగ్‌పైనా ఇటీవల ఆరోపణలు వచ్చాయి. ఓ పక్క భార్యాభర్తలు ఇద్దరూ సరోజనీనగర్‌లో హోర్డింగ్‌లతో హోరెత్తిస్తుంటే పార్టీ అధిష్ఠానం మూడో వ్యక్తిని పరిశీలించే అవకాశం లేకపోలేదని సీనియర్ నేతలు చెబుతున్నారు. మంత్రి మహేంద్ర సింగ్, మాజీ సీఎం కల్యాణ్ సింగ్ సన్నిహితుడు రాజేష్‌సింగ్ చౌహాన్, మాజీ కౌన్సిలర్లు గోవింద్‌పాండే, రామశంకర్‌త్రిపాఠిలతోపాటు సౌరభ్‌సింగ్, జిల్లా పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న రామ్‌కుమార్ సింగ్ చౌహాన్ కూడా ఈ సీటును ఆశిస్తుండంతో అధిష్ఠానం వీరి పేర్లూ పరిశీలిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment