మహిళలు, విద్యార్థులు, రైతులు ఎదురుచూస్తున్నారు
నిధుల విడుదలతోపాటు నిర్దేశిత తేదీలను ప్రకటించండి
వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి డిమాండ్
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తుందో చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు. 18 నుంచి 60 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1,500, ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి 3 ఉచిత సిలిండర్ల హామీల అమలు కోసం వారంతా ఎదురుచూస్తున్నారన్నారు. విశాఖపట్నంలోని పార్టీ కార్యాలయంలో ఆమె శనివారం మీడియాతో మాట్లాడారు.
హామీల అమలుకు కార్యాచరణ ఏదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై నెలవుతోందని.. పథకాల అమలు ఎప్పుడని నిలదీశారు. ప్రభుత్వ ధోరణి చూస్తుంటే పరిపాలన మీద కంటే కక్ష సాధింపులపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్టు అర్థమవుతోందన్నారు. రెడ్ బుక్ అమలు మీద కంటే హామీల అమలు మీద దృష్టి పెట్టాలని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా కళ్యాణి ఇంకా ఏమన్నారంటే..
2014లోనూ ఇలాగే మాటతప్పారు..
కూటమి ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు కూడా రైతులకు రుణమాఫీ, మహిళలకు డ్వాక్రా రుణమాఫీ చేయలేదు. 2016 నుంచి సున్నా వడ్డీ ఆపేశారు. ఆడబిడ్డ పుడితే రూ.25 వేలు ఇస్తామని ఇవ్వలేదు.
మహిళల సొంతింటి కల నెరవేరుస్తామని ఆ హామీనీ నిలబెట్టుకోలేదు. ఇప్పుడు మహిళలకు నెలకు రూ.1,500 ఇస్తామన్నారు. రాష్ట్రంలో మొత్తం మహిళల్లో పెన్షన్‌దారులను తీసేస్తే ఈ పథకానికి అర్హత ఉన్న మహిళలు 1.72 కోట్ల మంది ఉన్నారు. ప్రభుత్వం నిజంగా ఈ పథకాన్ని అమలు చేస్తుందా, లేదా అని అందరికీ అనుమానం కలుగుతోంది.
ఆయా పథకాల చెల్లింపులేవి?
మా ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్.. అమ్మ ఒడి, చేయూత, ఆసరా, విద్యాదీవెన, వసతి దీవెన, పెన్షన్లు అన్నీ ఠంచనుగా ప్రకటించిన తేదీనే ఇచ్చారు. చివరలో చేయూత కోసం రూ.4 వేల కోట్లు సిద్ధం చేసి ఉంచారు. అయితే ఆ డబ్బులను మహిళల ఖాతాల్లో వేయనీయకుండా టీడీపీ అడ్డుకుంది. జగనన్న ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఈ పాటికే డబ్బులు జమై ఉండేవి. ఆ నగదును వెంటనే ప్రభుత్వం మహిళల ఖాతాల్లో వేయాలి.
మా ప్రభుత్వంలో అమ్మఒడి కింద ఏటా 44.5 లక్షల మంది మహిళలకు ఐదేళ్లలో రూ.25,809 కోట్లు ఇచ్చాం. స్కూలుకు వెళ్లే ప్రతి బిడ్డకూ తల్లికి వందనం పథకం కింద రూ.15 వేలు ఇస్తామని చంద్రబాబు చెప్పారు. దాదాపు రాష్ట్రంలో కోటి మందికి పైగా స్కూలుకు వెళ్తున్న పిల్లలున్నారు. కానీ ఇప్పటివరకు ఇవ్వలేదు. అలాగే విద్యాదీవెన, వసతి దీవెన నిధులను ఇవ్వకపోవడంతో విద్యార్థులు అప్పులు చేసి స్కూళ్లు, కళాశాలల ఫీజులు చెల్లించాల్సి వస్తోంది.
అన్నదాతలు అప్పులపాలు
జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా రూ.13,500 చొప్పున 50 లక్షల మందికి పైచిలుకు రైతుల ఖాతాల్లో జమ చేశారు. చంద్రబాబు ఏటా రూ.20 వేలు రైతులకు ఇస్తామని చెప్పారు. ఖరీఫ్ ప్రారంభమైపోయినా ఇంతవరకు రైతులకు పెట్టుబడి సాయం అందని దుస్థితి. దీంతో నూటికి రూ.10, రూ.20 వడ్డీలకు అప్పులు తెచ్చి రైతులు వ్యవసాయం చేస్తున్నారు.
అలాగే ప్రతి మహిళకు ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని కూటమి నేతలు చెప్పారు. రాష్ట్రంలో 2.5 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం కోసం చూస్తున్నారు. అలాగే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు.. ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తామన్నారు. ఇవన్నీ నెరవేర్చడానికి నిర్దేశిత తేదీలు ప్రకటించి నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment