మర్కర్‌వాడీ అంటే కేవలం 1900 ఓట్లున్న కుగ్రామం. మహారాష్ట్ర సోలాపూర్ జిల్లాలో మల్షిరాస్ తహసీలులో ఉంటుందా పల్లె! ఎంత చిన్న పల్లె అయితేనేం.. ఇవాళ దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పాలకులలో వణుకు పుట్టిస్తోంది. బండారం బయటపడుతుందేమోననే భయాన్ని రేకెత్తిస్తోంది. ఆ చిన్న గ్రామంలోని ప్రజల్లో ఈవీఎంల పట్ల పుట్టిన అనుమానం.. తమ ‘తీర్పు’ను తామే బ్యాలెట్ పేపర్ల ద్వారా మరోసారి క్రాస్ చెక్ చేసుకోవాలని సంకల్పించిన చైతన్యం.. అధికారవర్గాలకు జడుపు తెప్పించింది. ప్రజలు స్వచ్ఛందంగా అలాంటి పోలింగును ప్లాన్ చేసుకోగా.. ఏకంగా మూడు రోజుల పాటూ పోలీసులు పెద్దసంఖ్యలో- ఆ చిన్న పల్లెలో మోహరించి- కర్ఫ్యూ ప్రకటించడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారుతోంది.
వివరాల్లోకి వెళితే..
ఈ మర్కర్‌వాడీ గ్రామం మల్షిరాస్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఇటీవి మహా ఎన్నికల్లో ఆ నియోజకవర్గం నుంచి ఉత్తమ్‌రావ్ జన్ఖడ్ 13,147 ఓట్ల మెజారిటీతో గెలిచారు. నేషలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్) కు చెందిన ఆయన, బిజెపి అభ్యర్థి సిటింగ్ ఎమ్మెల్యే రామ్ సత్పుతే ని ఓడించారు. విజయం దక్కినా సరే ఆయన మర్కర్‌వాడీ గ్రామంలో పోలింగుమీద అనుమానం ఉండిపోయింది. ఆ గ్రామంలో తనకు ప్రజాబలం దండిగా ఉన్నదని, గత ఎన్నికల్లో తనకు ఆ గ్రామంలో చాలా మంచి మెజారిటీ వచ్చిందని ఈ సారి మాత్రం ఓట్లు తగ్గాయని ఆయనకు అనుమానం వచ్చింది. 1900 ఓట్ల ఆ చిన్న గ్రామంలో ఈసారి 1003 ఓట్లు బిజెపికి పడగా, ఎన్సీపీ (ఎస్పీ) జన్ఖడ్ కు కేవలం 843 ఓట్లు దక్కాయి. అందుకే ఆయన అంతా ఆశ్చర్యపోయారు.
.
గెలిచిన అభ్యర్థి మాత్రమే కాదు.. ఆ గ్రామస్తులకు కూడా అదే ఆశ్చర్యం కలిగింది. జన్ఖడ్ కు ఆ పల్లెలో పాపులారిటీ ఎక్కువనేది అక్కడి వారి మాట. కేవలం పాపులారిటీ మాత్రమే కాదు. ఆయనకు అక్కడ కులబలం కూడా మెండు! ఉత్తమ్‌రావ్ జన్ఖ్- ధన్గఢ్ కులానికి చెందిన వారు. ఆ పల్లెలో అధికసంఖ్యాకులు ఆ కులం వారే. వారందరికీ కూడా అనుమానం వచ్చింది. దాంతో అంతా కలిసి తహసీల్దార్ దగ్గరకు వెళ్లి రీఎలక్షన్ పెట్టాలని డిమాండ్ చేశారు. వారి విజ్ఞప్తిని యన తోసిపుచ్చడంతో.. ఈవీఎంలలో ఏదో మతలబు జరిగిఉండొచ్చునని, అందుకే బిజెపికి ఎక్కువ ఓట్లు పడ్డాయని అనుమానించిన గ్రామస్తులు తామే స్వయంగా బ్యాలెట్ పేపర్ తో మాక పోలింగ్ లాగా మంగళవారం నాడు పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. వారు సన్నాహాలు చేసుకునేలోగా ప్రభుత్వ వర్గాలకు వణుకు పుట్టింది.
మోడీ సర్కారు తెచ్చిన కొత్త నేర చట్టాల్లోని భారతీయ నాగరిక్ సురక్ష సంహితలోని 163 సెక్షన్ ప్రకారం ఆ చిన్న గ్రామంలో కర్ఫ్యూ విధించారు. మంగళవారు వాళ్లు పోలింగ్ ప్లాన్ చేసుకోగా గురువారం వరకు కర్ఫ్యూ ఉంటుందని ప్రకటించి.. యాభై మంది సాయుధ పోలీసుల్ని మోహరించారు.
మేం వేసిన ఓట్లు ఎలా మళ్లిపోయాయో చెక్ చేసుకోవడానికే ఈ ప్రయత్నం చేస్తున్నామని.. అధికారులు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా సరే.. పోలింగ్ నిర్వహించి తీరుతామని వారు పట్టుదలగా ఉన్నారు.
ఆలోచన పుట్టిస్తున్న చైతన్యం..
చిన్న పల్లె లోని ప్రజల్లో పుట్టిన చైతన్యం దేశ ప్రజలందరినీ ఇప్పుడు ఆలోచింపజేస్తోంది. వారేీ ప్రభుత్వాన్ని రీపోలింగ్ అడగడం లేదు. మాక పోలిగ్ తరహాలో తమలో తాము నిర్వహించుకోవాలనుకున్నారు. ఈవీఎంలో వచ్చిన ఓట్లకు, తాము బ్యాలెట్ ద్వారా ఓటు చేస్తే రాగల ఓట్లకు తేడాలను గమనించాలనుకున్నారు. ఈవీఎంల సత్యసంధతను పుటం వేయాలనుకున్నారు. అయితే ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం నిరపాయకరమైన వారి ప్రయత్నాన్ని మాత్రం అడ్డుకుంటోంది.
ఒకవేళ ఈ ప్రయత్నాన్ని ఆపుచేయించాలని భావించినా సరే.. నలుగురు వ్యక్తులు ఒకచోట గుమికూడరాదు అని చెప్పే 144 సెక్షన్ విధిస్తే సరిపోయేదానికి ఏకంగా మూడురోజుల పాటు కర్ఫ్యూ పెట్టడం అంటే ఆందరికీ ఆశ్చర్యమే.
చిన్న పల్లె మర్కర్‌వాడీ యంత్రాంగాన్ని అంతగా వణికిస్తూంటే.. ఈవీఎం ల విషయంలో సమ్ థింగ్ ఈజ్ ఫిషీ అని దేశం అనుకోకుండా ఎలా ఉంటుంది?
.. ఎం.రాజేశ్వరి
Comments
Please login to add a commentAdd a comment