చంద్రబాబు అండ్‌ కో పంచభూతాలను దోచుకున్నారు | Visakhapatnam: Gudivada Amarnath Comments On Bauxite Mining | Sakshi
Sakshi News home page

చంద్రబాబు అండ్‌ కో పంచభూతాలను దోచుకున్నారు

Published Fri, Jul 9 2021 8:33 PM | Last Updated on Sat, Jul 10 2021 1:54 AM

Visakhapatnam: Gudivada Amarnath Comments On Bauxite Mining - Sakshi

సాక్షి, దొండపర్తి (విశాఖ దక్షిణ): చంద్రబాబు, ఆయన పార్టీ నేతలు 2014 నుంచి 2019 వరకు పంచభూతాలను దోచుకుతిన్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి ప్రాంతంలో టీడీపీ నిజనిర్ధారణ కమిటీని ప్రభుత్వం అడ్డుకున్నట్లు చంద్రబాబు ట్విట్టర్‌లో శుక్రవారం పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సున్నిత ప్రాంతాలకు వెళ్లేటప్పుడు పోలీసుల నుంచి ముందుగా అనుమతి తీసుకోవాలని తెలియదా? అని ఆయన ప్రశ్నించారు. ఎటువంటి అనుమతులు లేకుండా సమస్యాత్మక ప్రాంతాలకు వెళ్లిన వారిని పోలీసులు అడ్డుకుంటే వారితో గొడవపడడం దుర్మార్గమన్నారు. ఇక్కడి పార్టీ నగర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 

గనులు, ఖనిజాలు దోచుకున్నది టీడీపీ నేతలే
విశాఖ మన్యంలో గంజాయి, లేటరైట్‌ వ్యాపారం చేసింది టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి అనుచరులేనని అమర్నాథ్‌ స్పష్టంచేశారు. మాజీమంత్రి అయ్యన్నపాత్రుడి కుమారుడు, లోకేష్‌లు కలిసి విశాఖలో లేటరైట్‌ను దోచుకున్నారని మండిపడ్డారు. వారి అక్రమ మైనింగ్‌కు మాజీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు బలైపోయారన్నారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచిన కిడారిని మభ్యపెట్టి టీడీపీలోకి లాక్కొని అతని హత్యకు కారణమయ్యారని మండిపడ్డారు. ఆయన హత్యలో ప్రధాన ముద్దాయి చంద్రబాబే అని అన్నారు. మరోవైపు.. టీడీపీ హయాంలో ఇసుకలో రూ.10 వేల కోట్ల దోపిడీ జరిగిందని అందులో చంద్రబాబు వాటా రూ.5 వేల కోట్లని అమర్‌నాథ్‌ ఆరోపించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు శ్రీకాకుళంలో ఇసుకను దోచుకుంటే.. గుంటూరు జిల్లాలో యరపతినేని శ్రీనివాస్‌ అక్రమ క్వారియింగ్‌కు పాల్పడ్డారని, దేవినేని ఉమ, ప్రత్తిపాటి పుల్లారావులు అక్రమ మైనింగ్‌లతో రాష్ట్రాన్ని దోచుకున్నారన్నారు. చంద్రబాబు రాష్ట్ర సంపదను దోచుకుని రూ.2 లక్షల కోట్లు ఆర్జించారని ధ్వజమెత్తారు. వారి అక్రమాలను గుర్తించే రాష్ట్ర ప్రజలు వారిని గత ఎన్నికల్లో 23 సీట్లకు పరిమితం చేశారని అమర్‌నాథ్‌ గుర్తుచేశారు. 

గిరిజనాభివృద్ధే సీఎం లక్ష్యం
ఎన్నికలకు ముందు చింతపల్లి బహిరంగ సభలో అక్రమ మైనింగ్‌పై చర్యలు తీసుకుంటామని గిరిజన ప్రజలకు వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చిన విషయాన్ని అమర్‌నాథ్‌ గుర్తుచేశారు. దాని ప్రకారం అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క మైనింగ్‌కు కూడా లీజు అనుమతి ఇవ్వలేదని స్పష్టంచేశారు. కోర్టు నుంచి ఆర్డర్లు తెచ్చుకుని మైనింగ్‌ చేస్తున్నది టీడీపీ వారేనన్నారు. చీమకుర్తి వంటి ప్రాంతాల్లో ఖనిజాలు దోచుకుతిన్న వారిపై వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.2,500 కోట్ల మేర జరిమానా విధించిందన్నారు. గిరిజన అభివృద్ధే ముఖ్యమంత్రి జగన్‌ లక్ష్యమని స్పష్టంచేశారు. రాష్ట్ర సంపదను కాపాడుతూ అభివృద్ధి పథంలో నడిపిస్తామన్న నమ్మకంతోనే వైఎస్సార్‌సీపీని గెలిపించారని అమర్‌నాథ్‌ వివరించారు.

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకుంటున్నాం
స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని గుడివాడ అమర్‌నాథ్‌ స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రధానమంత్రికి లేఖలు రాయడంతోపాటు అసెంబ్లీలో తీర్మానం కూడా చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు, రాజ్యసభ సభ్యులు పార్లమెంట్‌లో ఈ విషయంపై ఉద్యమిస్తున్నారని తెలిపారు. ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తున్న బీజేపీని కాకుండా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు కార్మికులు, ఉద్యోగులు, ఇతర సంఘాలు చేస్తున్న ఉద్యమానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement