సాక్షి, విశాఖ దక్షిణ : చంద్రబాబుకు విశాఖ ప్రజలు తమ పౌరుషాన్ని రుచి చూపించారు. సిగ్గులేదా.. పౌరుషం లేదా.. అని నోరుపారేసుకున్న బాబుకు చుక్కలు చూపించారు. పంచాయతీ ఎన్నికల ఓటమి రుచించక నగర ప్రజలపై ఆక్రోశాన్ని వెళ్లగక్కిన తండ్రీ కొడుకులకు బుద్ధి చెప్పారు. కార్యనిర్వాహక రాజధాని విశాఖపై విషం కక్కుతున్న తెలుగుదేశానికి జీవీఎంసీ ఎన్నికల్లో కోలుకోలేని షాకిచ్చారు. మొత్తం 98 వార్డులకు గాను 30 వార్డులకే టీడీపీని పరిమితం చేశారు.
58 స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు పట్టం కట్టారు. సంక్షేమం, అభివృద్ధికే మేయర్ పీఠాన్ని కట్టబెట్టారు. పరిపాలన రాజధానిగా విశాఖకు మద్దతు తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతినడంతో జీవీఎంసీ ఎన్నికల్లో అయినా సత్తా చాటాలని తెలుగుదేశం పార్టీ అధినాయకులు విశ్వ ప్రయత్నాలు చేశారు. అందుకోసం టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ విశాఖలో రెండు రోజుల పాటు మకాం వేశారు. అటు పెందుర్తి నుంచి మధురవాడ వరకు కాళ్లకు బలపం కట్టుకొని ఎన్నికల ప్రచారం చేశారు.
వారు అడుగుపెట్టిన ప్రతి చోటా పరాభవమే!
చంద్రబాబు, లోకేష్‌బాబు ప్రచారం చేసిన అన్ని వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు ఓటమిపాలుకావడం విశేషం. చంద్రబాబు పర్యటించిన 6, 9, 24, 25, 29, 43, 44, 45, 46, 47, 58, 59, 60, 61, 81, 91,92, 95 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, 48వ వార్డులో బీజేపీ అభ్యర్థి విజయం సాధించగా.. లోకేష్ పర్యటించిన 1, 4, 65, 66, 68, 71, 72, 73, 74 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ జయకేతనం ఎగరేసింది. 66, 68 వార్డుల్లో చంద్రబాబు,లోకేష్ ఇద్దరూ ప్రచారం నిర్వహించినా.. ప్రజలు మాత్రం వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకే ఓటేయడం విశేషం. అధినాయకులు ప్రచారానికి వచ్చినప్పటికీ ఓటమి తప్పకపోవడంతో తెలుగు తముళ్లలో కలవరం మొదలైంది. తమ భవితవ్యం ఏమిటన్న ప్రశ్నలు శ్రేణులను వెంటాడుతున్నాయి.
ప్రచారానికి వచ్చి ప్రజలను తిడతారా..
ఎన్నికల ప్రచారానికి వచ్చి విశాఖ ప్రజలపై నోరుపారేసుకున్న అధినేతపై ఆ పార్టీ శ్రేణుల్లోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఒకవైపు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటే.. చంద్రబాబు ప్రజలపై ఆక్రోశం వెల్లగక్కడం ఏమిటని పార్టీ కార్యకర్తల్లో అసంతృప్తి రగులుతోంది. ప్రజలను మచ్చిక చేసుకోవాల్సిన సమయంలో వారిని నిందించిన కారణంగా పార్టీకి మరింత నష్టం కలిగించిందని ఆ పార్టీ వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment