ఉత్కంఠ రేపుతోన్న మహారాష్ట్ర రాజకీయాలు.. ఏం జరగవచ్చు? | What Will Happen In Maharashtra Political Crisis | Sakshi
Sakshi News home page

Maharashtra Political Crisis: ఉత్కంఠ రేపుతోన్న మహారాష్ట్ర రాజకీయాలు.. ఏం జరగవచ్చు?

Published Wed, Jun 29 2022 4:36 PM | Last Updated on Wed, Jun 29 2022 8:02 PM

What Will Happen In Maharashtra Political Crisis - Sakshi

సాక్షి, ముంబై: వేగంగా మారుతోన్న మహారాష్ట్ర రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠ రేపుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్ధానాలు 288 ఉండగా అందులో శివసేనకు 55 ఉన్నాయి. అందులో ఉద్దవ్‌ ఠాక్రే వర్గానికి 16, ఏక్‌నాథ్‌ షిందే వర్గానికి 39 మంది ఎమ్మెల్యేలున్నారు. కాగా మొత్తం 36 జిల్లాల్లో ఏక్‌నాథ్‌ షిందేకు 18 జిల్లాల్లో 39 మంది ఎమ్మెల్యేలున్నారు. అదేవిధంగా ఉద్ధవ్‌ ఠాక్రే వర్గానికి తొమ్మిది జిల్లాలో 16 మంది ఎమ్మెల్యేలున్నారు. అంటే ఉద్ధవ్‌కు 25 శాతం జిల్లాల్లో, షిందే వర్గానికి 50 శాతం జిల్లాల్లో ఎమ్మెల్యేలున్నారని దీన్ని బట్టి స్పష్టమవుతోంది.

ఏం జరగవచ్చు? 
►288 మంది ఎమ్మెల్యేలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తుత మెజారిటీ మార్కు 143. శివసేన–ఎన్సీపీ–కాంగ్రెస్‌లతో కూడిన మహా వికాస్‌ అఘాడీ (ఎంవీఏ) సంకీర్ణం వాస్తవ బలం 168. కానీ 55 మంది శివసేన ఎమ్మెల్యేల్లో కనీసం 39 మంది తిరుగుబాట పట్టడం, 10 మందికి పైగా స్వతంత్రులు వారితో చేతులు కలపడంతో కూటమి మైనారిటీలో పడ్డట్టు ఇప్పటికే స్పష్టమైంది. 

►బీజేపీకి 106 మంది ఎమ్మెల్యేలున్నారు. షిండే వర్గం మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటు దానికి నల్లేరుపై నడకే. అయితే 2019లో ఎన్నికల తర్వాత ఎన్సీపీ చీలిక వర్గంతో హడావుడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తలకు బొప్పి కట్టించుకుని మూడు రోజుల్లోనే తప్పుకున్న నేపథ్యంలో ఈసారి బీజేపీ జాగ్రత్త పడుతోంది. తనకు చెడ్డ పేరు రాకుండా సంకీర్ణాన్ని గద్దె దించడంపైనే దృష్టి పెట్టినట్టు చెబుతున్నారు. 
చదవండి: మహారాష‍్ట్ర సంక్షోభం.. ఇంతకు ఎవరి శిబిరంలో ఎంతమంది ఎమ్మెల్యేలు? 

►షిండే వర్గం గురువారం ముంబై తిరిగొస్తే నేరుగా గవర్నర్‌ను కలిసి సంకీర్ణానికి మద్దతు ఉపసంహరిస్తున్నట్టు చెప్పడంతో పాటు బలపరీక్షకు ఆదేశించాల్సిందిగా కోరవచ్చు. అదే జరిగితే సంకీర్ణం కుప్పకూలినట్టే. 

►అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీతో షిండే వర్గం చేతులు కలుపుతుందన్నది ఒక వాదన. ఇప్పటికే మంత్రివర్గ కూర్పుపై వారి మధ్య చర్చలు జరుగుతున్నాయంటున్నారు. 9 దాకా మంత్రి పదవులిస్తామని బీజేపీ చెబుతోందని, షిండే ఉప ముఖ్యమంత్రి పదవి పట్టుబడుతున్నారని సమాచారం. 

►ప్రతిష్టంభన ఇలాగే కొనసాగితే రెబల్‌ ఎమ్మెల్యేల కార్యాలయాలపై శివసేన దాడుల నేపథ్యంలో శాంతిభద్రతలను కారణంగా చూపి రాష్ట్రపతి పాలనకు గవర్నర్‌ సిఫార్సు చేసే ఆస్కారం లేకపోలేదనీ అంటున్నారు. అదే జరిగితే అంతిమంగా అసెంబ్లీ ఎన్నికలకు దారి తీయవచ్చు.
చదవండి: మహారాష్ట్ర గవర్నర్‌ రఫెల్‌ కంటే వేగంగా వ్యవహరించారు: సంజయ్‌ రౌత్‌ సెటైర్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement