రాజకీయాల్లోకి సినీతారలు ప్రవేశించడం కొత్తవిషయమేమీ కాదు. అయితే వారు రాజకీయాల్లో ఎంతవరకూ రాణిస్తారనేది ఆసక్తికర అంశం. బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ తండ్రి మీర్ తాజ్ మహ్మద్ కూడా రాజకీయాల్లోకి ప్రవేశించారు. అయితే ఆ తరువాత ఏం జరిగింది?
హిందీ నటుడు షారూక్ ఖాన్ తండ్రి మీర్ తాజ్ మహ్మద్ స్వాతంత్ర్య సమరయోధుడు. నాడు ఆయనకు కాంగ్రెస్‌లో పలువురు సన్నిహిత మిత్రులు ఉండేవారు. స్వాతంత్య్రానంతరం జరిగిన ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం మీర్ తాజ్ మహ్మద్‌కు లభించింది. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు.
1957లో దేశంలో జరిగిన రెండవ సాధారణ ఎన్నికల్లో తాజ్ మహ్మద్ గుర్గావ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆయన నాటి కాంగ్రెస్ దిగ్గజ నేత మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు ప్రత్యర్థిగా ఎన్నికల రణరంగంలో నిలిచారు. అయితే ఆ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూశారు. నాటి ఎన్నికల్లో భారత తొలి విద్యా మంత్రి అబుల్ కలాం ఆజాద్ అమోఘ విజయం సాధించారు. జనసంఘ్ అభ్యర్థి మూల్ చంద్ రెండో స్థానంలో నిలిచారు.
తాజ్ మహ్మద్ జాతీయవాద నేత ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అనుచరుడు. మహాత్మా గాంధీ ప్రారంభించిన క్విట్ ఇండియా ఉద్యమంలో తాజ్ మహ్మద్ చురుకుగా పాల్గొన్నారు. ఈ నేపధ్యంలో పలుమార్లు జైలుకు కూడా వెళ్లారు. పెషావర్‌లో పెరిగిన తాజ్ మహ్మద్ న్యాయశాస్త్రం చదివేందుకు ఢిల్లీ యూనివర్సిటీలో చేరారు. 1947లో భారత్-పాక్ విభజన సమయంలో తాజ్ మహ్మద్ ఢిల్లీలోనే ఉన్నారు. కారవాన్‌లో ప్రచురితమైన ఇరామ్ అఘా నివేదిక ప్రకారం విభజన అనంతరం పాక్ ప్రభుత్వం ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, తాజ్ మహ్మద్ అనుచరులను బ్లాక్ లిస్ట్‌లో చేర్చింది. నాటి నుంచి తాజ్ మహ్మద్ ఢిల్లీలోనే ఉండిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment