2024 లోక్‌సభ ఎన్నికల ప్రకియ ఊపందుకుంది. అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. తాజాగా బీజేపీ తన ఎనిమిదవ జాబితాలో మొత్తం 11 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితాలో పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ లోక్‌సభ స్థానానికి సన్నీ డియోల్ స్థానంలో దినేష్ సింగ్ బబ్బుకు టిక్కెట్ ఇచ్చింది. అప్పటి నుంచి దినేష్ సింగ్ బబ్బు పేరు వార్తల్లో నిలుస్తోంది.
బీజేపీ నేత దినేష్ సింగ్ బబ్బు(62) పంజాబ్‌లోని సుజన్‌పూర్ స్థానం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2012లో పంజాబ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కూడా పనిచేశారు. 2007, 2012, 2017లో వరుసగా మూడుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. అయితే 2022లో సుజన్‌పూర్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నరేష్ పూరి చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు బీజేపీ ఆయనకు గురుదాస్‌పూర్ లోక్‌సభ స్థానాన్ని అప్పగించింది.
దినేష్ సింగ్ బబ్బు అండర్ గ్రాడ్యుయేట్. పఠాన్‌కోట్‌లోని భంగోల్ గ్రామానికి చెందిన వ్యక్తి. ఆయన తన రాజకీయ జీవితాన్ని భారతీయ జనతా పార్టీలో కార్యకర్తగా ప్రారంభించారు. కాగా గురుదాస్‌పూర్ చాలా కాలంగా బీజేపీకి కంచుకోటగా ఉంది. గత ఎన్నికల్లో ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ జాకర్‌పై బీజేపీ అభ్యర్థి సన్నీడియోల్ 82,459 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే సన్నీ డియోల్ రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్‌గా లేరనే ఆరోపణలు వినిపించాయి. ఈసారి కూడా విజయాన్ని నిలబెట్టుకోవాలని భావించిన బీజేపీ దినేష్ సింగ్ బబ్బుకు టిక్కెట్ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment