ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఆ నియోజకవర్గంలో సైకిల్ పార్టీకి తుప్పు పట్టిపోయింది. ఎక్కడి నుంచో తెచ్చి తమ నెత్తిన రుద్దిన ఇంచార్జ్ మీద చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఇదేం ఖర్మ కార్యక్రమానికి వెళుతున్న పార్టీ అధినేతను దారి మధ్యలో కలిసి తమ గోడు వెళ్ళబోసుకున్నారట. తనకు, తన పార్టీకి పట్టిన ఖర్మ గురించి చింతిస్తూ సైకిల్ పార్టీ బాస్ అలా ముందుకు సాగిపోయారట.
అర్జునుడా ఇదేం అన్యాయం.?
కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటలాంటి నియోజకవర్గం గన్నవరం. ఇక్కడ బలమైన కమ్మ సామాజికవర్గమే గెలుపును నిర్ణయిస్తుంది. ఈ క్రమంలోనే రెండు సార్లు టీడీపీ తరపున గన్నవరం నుంచి వల్లభనేని వంశీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం జగన్ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితుడైన వంశీ వైసీపీ ప్రభుత్వానికి తన మద్దతు పలికారు.
ఫలితంగా గన్నవరంలో టీడీపీకి నాయకుడు లేకుండా పోయాడు. ఈ సమస్యను పరిష్కరించేందుకు మచిలీపట్నానికి చెందిన ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడిని తీసుకొచ్చి గన్నవరం నియోజకవర్గం ఇంఛార్జి బాధ్యతలను అప్పగించారు చంద్రబాబు. ఎవరో ఒకరులే.. ఇంఛార్జి రూపంలో తమకొక నాయకుడు దొరకాడని గన్నవరం తమ్ముళ్లు సరిపెట్టుకున్నారు. కాని టీడీపీ క్యాడర్ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు.
ఇంఛార్జిగా వచ్చాడే కానీ బచ్చుల క్యాడర్‌ను పట్టించుకోవడం మానేశాడట. ఓ వర్గాన్ని మాత్రమే తనతో తిప్పుకుంటూ తొలినుంచీ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలను గాలికి వదిలేశాడట. కనీసం పార్టీ కార్యక్రమాల సమాచారం కూడా గన్నవరం కేడర్‌కు ఇవ్వడం లేదట. బచ్చుల వైఖరితో విసిగిపోయిన అక్కడి నాయకులు, కార్యకర్తలు గన్నవరం టీడీపీ పార్టీ ఆఫీస్ మొహం చూడటం మానేశారట.
సైకిల్‌కు స్టాండ్ లేదా?
గన్నవరం ఇంచార్జ్ బచ్చుల అర్జునుడి వైఖరి నచ్చక ఎవరైనా ప్రశ్నిస్తే వారి పైనే ఫైరవుతున్నాడట. సమస్యలను బచ్చుల దృష్టికి తీసుకెళితే మీరేంటి నాకు చెప్పేది అంతా నాకు తెలుసు అంటూ దబాయిస్తున్నాడట. మీరంతా పార్టీ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు.. ఎమ్మెల్యే వంశీ వర్గీయులు అని ముద్రవేస్తున్నాడట. ఎవరైనా గట్టిగా మాట్లాడారో పార్టీ నుంచి సస్పెండ్ చేసి పడేస్తానని బెదిరిస్తున్నారట. వార్నింగ్ ఇవ్వడమే కాదు.. బచ్చుల అర్జునుడు ఇంఛార్జి అయిన తర్వాత ఇప్పటి వరకూ పదిమందిని పార్టీ నుంచి సస్పెండ్ చేసేశాడట. ఐతే ఈ పరిణామాలతో నైరాశ్యంలో పడ్డ క్యాడర్ పార్టీ ఆఫీస్‌కు, కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారట. పార్టీ అధినేతతో పాటు ఎవరైనా ముఖ్య నేతలు వచ్చినపుడు.. ఎయిర్ పోర్టులో కలిసి వచ్చేస్తున్నారని సమాచారం.
చదవండి: మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
లీడర్ కాదు, లీడర్ షిప్ కావాలి
ఇంఛార్జిగా కొనసాగుతున్న బచ్చులలో కనీసం నాయకుడి లక్షణాలు లేకపోయినా.. రెండేళ్లుగా సరిపెట్టుకుంటున్న క్యాడర్‌కు ఇక ఓపిక నశించిపోయింది. అందుకే తమ పంచాయతీని అధినేత ఎదుటే తేల్చుకోవాలని భావించారట. ఇదేం ఖర్మ కార్యక్రమానికి వెళుతున్న చంద్రబాబుకు బచ్చుల అర్జునుడి వ్యతిరేక వర్గం అంతా కట్టకట్టుకుని వెళ్లి మరీ స్వాగతం పలికారట.
అధినేతకు స్వాగతం పలకడంతో సరిపెట్టకుండా బచ్చుల అర్జునుడి వైఖరి పట్ల తమలో ఉన్న ఆవేదనంతా ఓ లేఖలో వెళ్ళగక్కారట. మరోవైపు బచ్చుల, అతని అనుకూల వర్గం మరోచోట చంద్రబాబుకు స్వాగత ఏర్పాట్లు చేశారట. రెండు వర్గాలు రెండు ప్రదేశాల్లో స్వాగత ఏర్పాట్లను ఊహించని చంద్రబాబు.. ఈ పరిణామాలతో షాకయ్యారట. ఓ వైపు ఇదేం ఖర్మరా కార్యక్రమానికి వెళ్తుంటే పార్టీలో గొడవలు.. పంచాయతీలు స్వాగతం పలుకుతుండటంతో.. నాకిదేం ఖర్మరా బాబు అనుకుంటూ తలబాదుకుంటున్నారట పచ్చ పార్టీ బాస్ చంద్రబాబునాయుడు.
-పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment