ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం విడుదల చేసిన జిఓ ఒకటిపై విపక్షం ఎందుకు కోర్టుకు వెళ్లడం లేదు? ఇది కొంత ఆశ్చర్యం కలిగించే అంశమే. మామూలుగా అయితే ప్రభుత్వం ఏ జిఓ విడుదల చేసినా, మరుసటి రోజుకల్లా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం పడడం రివాజుగా మారింది. ఎక్కువ సందర్భాలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకురావడంలో తెలుగుదేశం సఫలం అవుతూ వస్తోందన్న భావన ఉంది. ఈ విషయంలో టీడీపీకి ఉన్న శక్తి సామర్ధ్యాలను చూసి అంతా నివ్వెరపోయే పరిస్థితే.
కాని అదే సమయంలో టీడీపీ లేదా ఆ పార్టీ మద్దతుదారులు, వేసిన వ్యాజ్యాల వల్ల తమ ప్రయోజనాలకు విఘాతం కలుగుతోందని ప్రజలు అభిప్రాయపడుతుండడంతో టీడీపీ ఆశించిన విధంగా ఆ పార్టీకి అంత రాజకీయ లబ్ది చేకూరలేదనే చెప్పాలి. ఉదాహరణకు వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆంగ్ల మీడియంపై వ్యాజ్యం పడడంపై పేద వర్గాలలో తీవ్ర విమర్శలు వచ్చాయి. రాజధాని అంశంలో అయితే బహుశా దేశంలోనే ఎక్కడా వేయనన్ని పిటిషన్లు పడ్డాయి. వీటిలో అత్యధికం టీడీపీ మద్దతుతో పడినవే అన్న సంగతి బహిరంగ రహస్యమే.
అమరావతి రైతుల పేరుతో తలపెట్టిన పాదయాత్ర వల్ల ఉద్రిక్తతలు వస్తాయని పోలీస్ శాఖ అభిప్రాయపడినా, హైకోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకోగలిగారు. పోలీసులు అంచనా వేసినట్లే ఆ పాదయాత్రలో పాల్గొన్నవారు ఎన్నిసార్లు ఉద్రిక్తత సృష్టించింది అంతా గమనించారు. ఆ పాదయాత్రలో రైతుల కన్నా, వారి ముసుగులో టీడీపీ వారే పాల్గొన్నట్లు వెల్లడైంది. హైకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాలను వీరు పట్టించుకోవడం లేదని రుజువు అయింది. చివరికి పాదయాత్రను విరమించుకోవడమే ఇందుకు నిదర్శనం.
ఇలా పలు సందర్భాలలో న్యాయవ్యవస్థను అడ్డుపెట్టుకుని ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతూ వచ్చారు. తాజాగా ప్రభుత్వం రోడ్లపై బహిరంగ సభలు నిర్వహించరాదని, పర్మిషన్ తీసుకునే రోడ్డు షో వంటివి జరపాలని ఆదేశాలు ఇవ్వగా, దానిపై టీడీపీ, జనసేన, వామపక్షాలు నానా రాద్దాంతం చేస్తున్నాయి. వాటిని ధిక్కరిస్తూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కుప్పంలో హై డ్రామా చేశారు. అయినా హైకోర్టుకు వెళ్లలేదు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఈ జిఓ పై హైకోర్టుకు వెళితే కొట్టివేస్తారని అన్నారు. మరి ఆయనకూడా ఇప్పటికే పలు అంశాలపై కోర్టుకు వెళ్లారు కదా!. కాని దీనిపై ఇంతవరకు ఎందుకు వెళ్లలేదన్నది చర్చనీయాంశం అవుతుంది.
ఇందుకు కొన్ని కారణాలు ఉండవచ్చు. బహుశా న్యాయ స్థానం వారు జిఓని సమర్దిస్తూ ఆదేశాలు ఇస్తే తమ ప్రచారం అంతా వృథా అవుతుందని అనుకోవచ్చు. రోడ్లపై సభల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరితే దానిని వాదించుకోవడం కష్టం కావచ్చు. గతంలో అమరావతి రైతుల పాదయాత్రకు అనుకూలంగా నిర్ణయం వచ్చినా, ఆ తర్వాత కాలంలో జరిగిన పరిణామాలలో హైకోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. వాటిని పాటించడం సాధ్యం కాదని యాత్రనే విరమించుకోవలసి వచ్చింది. అలాగే ఇప్పుడు కూడా గైడ్ లైన్స్ ఇస్తే విపక్షాలకు అది మరింత ఇబ్బంది కావచ్చు.
కోర్టుకు వెళ్లే బదులు ప్రభుత్వం ఏదో అణచివేస్తోందని ప్రచారం చేస్తే దానివల్ల ఏమైనా రాజకీయ లబ్ధి వస్తుందేమోనన్న ఆశ వారికి ఉండవచ్చు. ఇలా రకరకాల కారణాలతో టీడీపీ, జనసేన లేదా ఇతర విపక్ష పార్టీలు ఈ అంశంపై కోర్టుకు వెళ్లి ఉండకపోవచ్చన్నది నిపుణుల అంచనాగా ఉంది. కందుకూరు, గుంటూరు తొక్కిసలాటలలో పదకుండు మంది మరణించిన నేపథ్యంలో ప్రభుత్వం రోడ్లపై సభల నిర్వహణకు ఆంక్షలు పెట్టింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన సభలలోనే ఈ తొక్కిసలాటలు జరిగాయి.
కందుకూరులో డ్రోన్ షూటింగ్ కోసం ఇరుకు సందులోసభ నడిపే యత్నం చేయడం, గుంటూరులో సభకు వచ్చేవారికి చంద్రన్న కానుకలు ఇస్తామని ప్రచారం చేయడంతో పెద్ద ఎత్తున పేదలు తరలి వచ్చి తొక్కిసలాటకు గురయ్యారు. ఇవన్ని టీడీపీకి తీవ్ర నష్టం చేశాయి. దీంతో టీడీపీ, జనసేనలు కొత్త డ్రామాలకు తెరదీశాయి. జిఓ వన్ ఆధారంగా తమ గొంతు నొక్కుతున్నారన్న ప్రచారానికి దిగాయి.
చదవండి: చంద్రబాబు-పవన్ భేటీలో ఏం జరిగింది? అసలు సమస్య అదేనా?
చంద్రబాబు, పవన్‌లు ఒకరికొకరు సంఘీభావం ప్రకటించుకునే సన్నివేశాన్ని ప్రజల ముందుంచారు. దీనిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ అక్రమ సంబంధాన్ని పవిత్రం చేయడానికి చేసిన ప్రయత్నంగా ఆయన అభివర్ణించారు. దీనిపై ఇంతవరకు పవన్ కళ్యాణ్ స్పందించలేకపోయారు. ఈ తొక్కిసలాటకు గురైనవారిని పరామర్శించకుండా, ఆ ఘటనకు కారణమైన చంద్రబాబు నాయుడును పరామర్శించడం విడ్డూరంగానే ఉంటుంది. అయినా దీనిని ఒక వ్యూహంగా వారు భావిస్తున్నారు.కందుకూరు, గుంటూరు విషాదాలను పక్కదారి మళ్లించడానికి ఈ డ్రామాలు నడుపుతున్నారు. వీటిని ప్రజలు నమ్ముతారా? అసహ్యించుకుంటారా?
-హితైషి
Comments
Please login to add a commentAdd a comment