Year End 2022: BJP Continued Its Domination PM Modi Amit Shah - Sakshi
Sakshi News home page

మోదీ ప్రజాదరణ, అమిత్ షా వ్యూహాలు.. 2022లోనూ తిరుగులేని బీజేపీ!

Published Mon, Dec 26 2022 8:25 AM | Last Updated on Mon, Dec 26 2022 2:09 PM

Year End 2022 BJP Continued Its Domination PM Modi Amit Shah - Sakshi

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ 2022 లో భారత రాజకీయాల్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూనే ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం, హోం మంత్రి అమిత్ షా చాణక్యంతో బిజెపి అప్రతిహత విజయాలను నమోదు చేస్తోంది. బిజెపి బండిని జోడెద్దుల లాగా ఈ ఇద్దరు నేతలే తమ భుజస్కందాలపై పెట్టుకుని లాగుతున్నారు. దేశంలోని అన్ని పార్టీలకు కంటే అందనంత పై స్థాయిలో బిజెపిని నిలబెట్టగలిగారు. ఏడాది ఏడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. తొలుత ప్రధమార్ధంలో మార్చి నెలలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగగా నాలుగు రాష్ట్రాలలో బిజెపి జెండా ఎగరేసింది. ఉత్తరప్రదేశ్ ,ఉత్తరాఖండ్, మణిపూర్ , గోవాలలో వరుసగా రెండోసారి బిజెపి తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంది. పంజాబ్లో కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించి ఆమ్ ఆద్మీ పార్టీ తొలిసారిగా ఢిల్లీ అవతల తన సత్తా చాటింది.

ఇక ఇటీవల జరిగిన రెండు రాష్ట్రాల ఎన్నికల్లో ఒక రాష్ట్రాన్ని బిజెపి తిరిగి నిలబెట్టుకుంది. గుజరాత్ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 151 సీట్లు గెలిచి నరేంద్ర మోదీ ప్రభంజనాన్ని సృష్టించారు. వరుసగా ఏడోసారి బిజెపి ప్రభుత్వాన్ని నిలబెట్టారు. దేశ చరిత్రలో ఇప్పటివరకు కమ్యూనిస్టుల పేరుతో ఉన్న చరిత్రను సమం చేశారు. అయితే హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తన జెండా ఎగరేసి పరువు కాపాడుకుంది. అయితే కేవలం 0.9% తేడాతోనే అది బిజెపిపై విజయం సాధించగలిగింది. బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ లో ఓటమి చవి చూడడం ఆ పార్టీకి షాక్ కలిగించింది. అయితే దీనికి జేపీ నడ్డా గ్రూపు రాజకీయాలే కారణమని పార్టీ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏదో ఒక రోజున జేపీ నడ్డాను ఇంటికి సాగనంపడం ఖాయమని వార్తలు గుప్పుమంటున్నాయి.

సునాయసంగా..
ఇక ఈ ఏడాదిలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోను బిజెపి సజావుగా సునాయాసంగా తన అభ్యర్థులను గెలిపించుకోగలిగింది. రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన వర్గానికి చెందిన ద్రౌపది ముర్ము ను నరేంద్ర మోదీ ఎంపిక చేసి ప్రతిపక్షాలను చల్లా చెదురు చేయడంలో విజయం సాధించగలిగారు. తొలుత ప్రతిపక్ష క్యాంపులో చేరిన జెడిఎస్, జార్ఖండ్ ముక్తి మోర్చా లాంటి పార్టీలు సైతం తిరిగి బిజెపి అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి మోదీ కల్పించారు. విపక్షాల మధ్య ఐక్యతను దెబ్బతీయడంలో మోడీ సఫలీకృతులయ్యారు. 60 శాతానికి పైగా ఓటింగ్ సాధించి ద్రౌపది ముర్ము విజయం సాధించారు.

ఇటు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సైతం బిజెపి అభ్యర్థి జగదీప్ దంకర్ సునాయాసంగా గెలుపొందారు. జాట్ సామాజిక వర్గానికి చెందిన జగదీప్ దంకర్ ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసి నరేంద్ర మోడీ అందర్నీ ఆశ్చర్యపరిచారు. అయితే దాని వెనుక నరేంద్ర మోడీ రాజకీయ ఎత్తుగడ కనిపించింది. ఏడాదిన్నర పాటు రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీని ముట్టడించిన రైతుల అత్యధికమంది జాట్ వర్గానికి చెందిన వారే. ఈ నేపథ్యంలో రైతులను సంతృప్తి పరచేందుకు ఆ వర్గానికి చెందిన జగదీప్ దంకర్ ను నరేంద్ర మోదీ ఎంపిక చేసి వారిని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. అంతకుముందే పశ్చిమబెంగాల్లో జగదీప్ దంకర్ తనదైన స్టైల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఇబ్బంది పెడుతూ నరేంద్ర మోడీ దృష్టిలో పడేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నాలన్నీ జగదీష్ ధన్కర్కు కలిసి వచ్చాయి.

16 రాష్ట్రాల్లో అధికారం..
2022 సంవత్సరం ప్రారంభంలో బిజెపి చేతిలో 17 రాష్ట్రాలు ఉన్నాయి. ఏడాది ముగిసే సరికి బిజెపి 16 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. బీహార్ లో బిజెపికి నితీష్ కుమార్ రామ్ రామ్ చెప్పడంతో రాష్ట్రం బిజెపి చేయి జారింది. అయితే మహారాష్ట్రలో ఏకనాథ్ షిండే సహకారంతో ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని కూలగొట్టి , బిజెపి తిరిగి ఆ రాష్ట్రాన్ని తన చేతిలోకి తీసుకోగలిగింది. ఒక రాష్ట్రం చేజారినా మరో రాష్ట్రాన్ని దక్కించుకొని తన 17వ రాష్ట్రాన్ని బిజెపి కాపాడుకోగలిగింది. అయితే ఈ ఏడాది చివర్లో హిమాచల్ ప్రదేశ్ చేజారడంతో ప్రస్తుతం బిజెపి ఈ ఏడాది ఒక రాష్ట్రాన్ని కోల్పోయి 16 రాష్ట్రాలలో అధికారంలో కొనసాగుతోంది.

ఏడాది ప్రారంభంలో రాజ్యసభలో బిజెపికి 96 సీట్లు ఉండగా మే నెలలో అది 100 సీట్ల మార్కు దాటింది. కానీ ఆ తర్వాత జూన్లో జరిగిన రాజ్యసభ ద్వై వార్షిక ఎన్నికల్లో అపార్టీ సంఖ్య 92 కు పడిపోయింది. లోక్‌సభలో బిజెపికి ఉప ఎన్నికల్లో ఒక సీట్ పెరిగింది.

మోదీ మాటే వేదం..
బిజెపిలో నరేంద్ర మోదీ మాటే వేదవాక్కుగా కొనసాగుతోంది. దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా మోడీ అవతరించడంతో మిగిలిన నాయకులందరూ ఆయన మాట శిరోధార్యంగా భావించి ముందుకు నడుస్తున్నారు. మోడీ కున్న ప్రజాదరణను ఎన్నికల్లో ఓట్లుగా మలుచుకునేందుకు అమిత్ షా అత్యంత పదునైన వ్యూహాలు రూపొందిస్తున్నారు. సుశిక్షితులైన బిజెపి కార్యకర్తల యంత్రాంగం , ఆర్ఎస్ఎస్ అండతో ఆ పార్టీ పక్కడ్బందీగా ప్రజల్లోకి చొచ్చుకుపోతోంది .

వరుసగా 8 ఏళ్ల నుంచి అధికారంలో బిజెపి కొనసాగుతున్న నేపథ్యంలో పార్టీకి అపారమైన వనరులు అందుబాటులోకి వచ్చాయి. ఖర్చుకు వెనకాడకుండా పార్టీ ప్రచారాన్ని దూకుడుగా కొనసాగిస్తుంది. దీనికి తోడు కార్పొరేట్ వ్యూహకర్తలు రంగంలోకి దిగి, క్షేత్రస్థాయిలో ఓటర్ల నాడిని ఎప్పటికప్పుడు పసిగట్టి పార్టీకి చేరవేస్తున్నారు. అందుకు అనుగుణంగా వ్యూహాలను రచిస్తూ మిగిలిన పార్టీలకంటే ఒక అడుగు ముందంజలో ఉంటున్నారు. తన పార్టీని బలోపేతం చేసుకోవడంతోపాటు ప్రతిపక్ష పార్టీలను బలహీనపరచడంలోనూ బిజెపి అదే దూకుడును ప్రదర్శిస్తుంది. రకరకాల ఎత్తుగడలతో విపక్షాలను చెల్లాచెదురుచేసి తన ఆధిపత్యాన్ని సృష్టినం చేసుకుంటుంది.

కాంగ్రెసే ప్రత్యామ్నాయం..
మొత్తానికి ఏడాది బిజెపి తన ఆధిపత్యాన్ని నిర్విఘ్నంగా కొనసాగించింది. మిగిలిన పార్టీలతో పోలిస్తే నరేంద్ర మోదీ నేతృత్వంలోని బిజెపి 90% సక్సెస్ రేట్ తో ముందుకు దూసుకుపోతోంది. ఏడాది మొత్తం ఏడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగా ఐదు రాష్ట్రాలను బిజెపి తన ఖాతాలో వేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ను, కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్ను గెలుచుకుంది. బిజెపికి జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం కోసం కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తీవ్రమైన పోరాటం ప్రస్తుతం కొనసాగుతోంది. అయితే ఇప్పటికీ బిజెపిని ఎదుర్కోగలిగిన ప్రత్యామ్నాయ పార్టీగా కాంగ్రెస్ కొనసాగుతోంది. ఇక వచ్చే ఏడాది లోక్ సభకు ఎన్నికల సన్నాహక సంవత్సరం. కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్ , రాజస్థాన్ , చత్తీస్గడ్ లాంటి ఐదు కీలక రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఐదు రాష్ట్రాలలోనూ బిజెపి కాంగ్రెస్ ముఖాముఖిగా తలపడుతున్నాయి.

అయితే అసెంబ్లీకి, లోక్సభకు ఎన్నికలకు మధ్య ఎజెండా వేరువేరుగా ఉన్నప్పటికీ ఈ ఎన్నికల్లో గెలిస్తేనే లోక్సభ ఎన్నికలకు నైతిక బలం, జోష్ ఆయా పార్టీలకు లభిస్తుంది. మరి 2023 ఏ పార్టీ దశను ఎలా తిప్పుతుందనేది ప్రజలే డిసైడ్ చేయాలి.
చదవండి: రాహుల్ గాంధీ ఎప్పటికీ ప్రధాని కాలేరు.. కేంద్రమంత్రి జోస్యం..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement