సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 175 నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్‌సీపీ తరపున సామాజిక భేరి మోగించబోతున్నట్లు పార్టీ నేత, రాష్ట్ర మంత్రి ప్రకటించారు. ఈ సామాజిక భేరి ద్వారా పెత్తందార్ల కోటలు బద్ధలు కొట్టబోతున్నామని అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జోగి రమేష్‌తోపాటు వైఎస్సార్‌సీపీ నేతలు పలువురు సామాజిక భేరీ బస్సు యాత్రకు సంబంధించిన పోస్టర్‌ను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా నేతలు మీడియాతో మాట్లాడారు.
‘‘ఇచ్చాపురం, తెనాలి, శింగనమలో రణభేరి మోగించబోతున్నాం. పేదలు పెత్తందారుల మధ్య యుద్ధం జరగబోతోంది’’ అంటూ జోగి రమేష్ వివరించారు. టీడీపీ తరపున నారా భువనేశ్వరి చేపట్ట తలపెట్టిన ‘నిజం గెలవాలి’ యాత్రపై మంత్రి వ్యంగ్యాత్మక విమర్శలు చేశారు. ‘‘నిజం గెలవాలి అని కాకుండా వారు పాప పరిహార యాత్ర చేస్తే బాగుండు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినప్పటి నుంచి చేసిన పాపాలకు పరిహారం చేసేలా యాత్ర చేయాలి. చంద్రబాబు నలభై ఏళ్ల రాజకీయ జీవితం గురించి భువనేశ్వరి ప్రజలకు వివరించాలి. మీ నాన్నకు (దివంగత ఎన్టీఆర్) ఎలా వెన్నుపోటు పొడిచారో మీకే బాగ తెలుసు, కాబట్టి ఆ నిజాలు చెప్పాలి. రెండు ఎకరాల నుంచి రెండు లక్షల కోట్లు ఎలా సంపాదించారో చెప్పాలి. నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నారు. పాపం పండినందున కోర్టులు చంద్రబాబుకు రిమాండ్ విధించాయి’’ అని జోగి రమేష్ ఎద్దేవా చేశారు.
జగన్ పాలన.. జనం మెచ్చిన పాలన అని, సామాజిక ధర్మం పాటించిన నాయకుడు జగన్ అని ఆయన సీఎంపై ప్రశంసల వర్షం కురిపించారు. సీఎం పలు కార్యక్రమాల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను ఏకతాటి మీదకు తెచ్చారని, మొత్తం 175 నియోజకవర్గాలలో ఈ విషయాలను వివరించనున్నామని, తద్వారా సామాజిక భేరి మోగించబోతున్నామని ఆయన వివరించారు. ‘‘గురువారం మొదలయ్యే బస్సు యాత్రతో పెత్తందార్ల కోటలు బద్దలు కొట్టబోతున్నాం. జగన్ జనరల్ కేటగిరి నియోజకవర్గాల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయించారు. నాయకత్వం అంటే అది. జగన్ సామాజిక న్యాయం చేసిన తీరును దేశమంతా చూస్తోంది. మంచి జరిగితేనే మద్దతు ఇవ్వమని కోరుతున్నాం’’ అని జోగి రమేష్ అన్నారు.
► మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ....దళితుల మీద చంద్రబాబు హయాంలో జరిగినన్ని దాడులు మరెప్పుడూ జరగలేదని, వైఎస్సార్‌సీపీ పాలనలో పేదల బతుకులు మారాయని అన్నారు. తాము పేదల కోసం బస్సు యాత్ర చేస్తుంటే.. జైల్లో ఉన్న వ్యక్తి కోసం వారు యాత్ర చేస్తున్నారంటూ భువనేశ్వరిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
‘‘చంద్రబాబు బీసీల తోకలు కత్తిరిస్తానన్నారు. మత్స్యకారులను తోలు తీస్తానన్నారు. కానీ, జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను అక్కున చేర్చుకున్నారు. ఎలాంటి పక్షపాతం లేకుండా పాలన చేస్తున్నారు. మా పాలన నచ్చితేనే మాకు ఓటు వేయమని అడిగే ధైర్యం ఉన్న నాయకుడు జగన్. జగన్ ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం. ఆయన పాలన ఉంటేనే పేదలకు బతుకు’’ అని మేరుగ నాగార్జున అన్నారు.
► రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ... ‘‘చేసిన మేలు చెప్పుకునేందుకే సామాజిక సాధికార యాత్ర చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు జగన్ పాలనలో న్యాయం జరుగుతోంది. బీసీలంటే బాబు క్యాస్ట్ అనే విధంగా చంద్రబాబు ఓటు బ్యాంకుగా వాడుకున్నారు’’ అని మండిపడ్డారు. పేదల పిల్లలకు ఇంగ్లీషు మీడియం వద్దని, ఇళ్ల పట్టాలు వద్దనీ, అమరావతిలో పేదలు ఉండడానికి వీల్లేదని చంద్రబాబు ప్రయత్నించారని, వారిని ఆలయాల్లోకి కూడా రానివ్వలేదని అన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాకే పేదలకు అవే ఆలయ కమిటీలలో పదవులు ఇచ్చారని గుర్తు చేశారు. ‘‘మన చేయి పట్టుకొని నడిపిస్తున్నది జగనే. ఎన్నికల సమయంలో మాయ మాటలు చెప్పి తర్వాత తప్పించుకునే వ్యక్తి చంద్రబాబు. ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసి ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి జగన్’’ అని మంత్రి ఆదిమూలపు అన్నారు.
‘‘నారా భువనేశ్వరి.. చంద్రబాబు ఎన్టీఆర్ ను ఎలాంటి వేధింపులకు గురి చేశారో చెప్పండి .. ఇప్పటికైనా నిజం చెప్పాలి’’ డిమాండ్ చేశారాయన.. ఆంధ్రప్రదేశ్‌లో విద్యా వ్యవస్థపై పవన్ కల్యాణ్ డ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారంటూ విమర్శించిన మంత్రి ఆదిమూలపు ఆయనకో ఛాలెంజ్ విసిరారు. ఏపీ ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న దళిత విద్యార్థులతో పవన్ ఇంగ్లీష్‌లో మాట్లాడగలరా? అని ప్రశ్నించారు.
►మాజీ మంత్రి కొలుసు పార్థసారథి కామెంట్స్
‘‘ముఖ్యమంత్రిగా జగన్‌ఈ రాష్ట్ర వనరులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కూడా అందించాలని చూశారు. పనులు లేని సమయంలో చేయి చాచి అడుక్కునే పరిస్థితి రాకూడదని సీఎం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. కరోనా సమయంలో తిండిలేక అనేక రాష్ట్రాల్లో ప్రజలు చనిపోయారు. కానీ జగన్ పుణ్యమా అని ఆంధ్రప్రదేశ్‌లో అలాంటి పరిస్థితి రాలేదు.’’ అని మాజీ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.
►మాజీ ఎమ్మెల్యే జియావుద్దీన్ పాయింట్స్
ఈ సమావేశంలోనే మాజీ ఎమ్మెల్యే జియావుద్దీన్ మాట్లాడుతూ గురువారం నుంచి జరిగే బస్సు యాత్రను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. జగన్ సీఎం అయ్యాక అనేక సంస్కరణలు తెచ్చారని, సామాజిక సంక్షేమాభివృద్దిని చేసి చూపించారని కొనియాడారు. వచ్చే ఎన్నికలు పేదలు పెత్తందార్ల మధ్య జరిగేవని స్పష్టం చేశారు. ‘‘సామాజిక న్యాయం కేవలం నినాదం కాదు.. అమలు చేయాల్సిన విధానం. జగన్ పేదల వైపు నిలపడితే, చంద్రబాబు పెత్తందార్ల వైపు నిలబడ్డారు. ఈ యుద్దంలో పేదలు బాగుపడాలంటే జగనే మళ్ళీ సీఎం కావాలి’’ అని ఆకాంక్షించారు.
వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం జగన్ సూచించడంతో.. వైఎస్సార్‌సీపీ సామాజిక న్యాయ యాత్రకు సిద్ధమైంది. ఈ నెల 26 నుంచి నవంబర్ 9 వరకు మొదటి విడత బస్సుయాత్ర జరిగేలా ప్రణాళిక రూపొందించింది. ఆదివారాలు మినహా మిగిలిన ఆరు రోజులు యాత్ర కొనసాగనుంది. ఉత్తరాంధ్రలో ఇచ్చాపురం, దక్షిణ కోస్తాలో తెనాలి, రాయలసీమలో శింగనమల నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది.
బస్సు యాత్ర షెడ్యూల్
అక్టోబర్ 26 – ఇచ్చాపురం, తెనాలి, శింగనమల
అక్టోబర్ 27 – గజపతినగరం, నరసాపురం, తిరుపతి
అక్టోబర్ 28 – భీమిలి, చీరాల, పొద్దుటూరు
అక్టోబర్ 30 – పాడేరు, దెందులూరు, ఉదయగిరి
అక్టోబర్ 31 – ఆముదాలవలస, నందిగామ, ఆదోని
నవంబర్ 1 – పార్వతీపురం, కొత్తపేట, కనిగిరి
నవంబర్ 2 – మాడుగుల, అవనిగడ్డ, చిత్తూరు
నవంబర్ 3 – నరసన్నపేట, కాకినాడ రూరల్, శ్రీకాళహస్తి
నవంబర్ 4 – శృంగవరపుకోట, గుంటూరు ఈస్ట్, ధర్మవరం
నవంబర్ 6 – గాజువాక, రాజమండ్రి రూరల్, మార్కాపురం
నవంబర్ 7 – రాజాం, వినుకొండ, ఆళ్లగడ్డ
నవంబర్ 8 – సాలూరు, పాలకొల్లు, నెల్లూరు రూరల్
నవంబర్ 9 – అనకాపల్లి, పామర్రు, తంబళ్లపల్లె
ఇలా రాష్ట్రవ్యాప్తంగా 3 ప్రాంతాల్లో ప్రతిరోజూ యాత్ర ఉంటుంది. మొత్తంగా డిసెంబర్ 31 వరకూ 60 రోజుల పాటు సభలు జరుగుతాయి. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఈ యాత్రను నిర్వహించనున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నాయకులు ఈ యాత్రలో పాల్గొంటారు. జగనన్న పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు వివరించడమే ఈ యాత్ర ఉద్దేశం. ఎమ్మెల్యేలు, స్థానిక సమన్వయకర్తలు ఈ బస్సు యాత్రకు అధ్యక్షత వహిస్తారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, తలశిల రఘురాంలకు సీఎం జగన్ సమన్వయ బాధ్యతలను అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment