శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో జరిగిన సభకు హాజరైన అశేష జనసందోహంలో ఓ భాగం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సాధికార నినాదంతో మహేంద్ర తనయ నది మురిసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల విజయ సంకేతాలతో మెరిసింది. మహేంద్ర తనయ తీరంలోని శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర బుధవారం ఘనంగా జరిగింది. నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన బడుగు, బలహీనవర్గాలతో పాతపట్నం కిటకిటలాడింది. యాత్రకు దారి పొడవునా జనం బ్రహ్మరథం పట్టారు. బూరగాం నుంచి పాతపట్నంలో ఏర్పాటు చేసిన సభా వేదిక వద్దకు వచ్చే సరికి జనాలతో ఆ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నాలుగున్నరేళ్లలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన ప్రసంగాలకు జనం జేజేలు పలికారు.
పేదల సంక్షేమంలో సీఎం జగన్ నంబర్ వన్ : మంత్రి ధర్మాన ప్రసాదరావు
మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. పేదలకు సంక్షేమాన్ని అందించడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని మించిన వారు లేరని చెప్పారు. సంక్షేమ పథకాల ద్వారా రూ. 2.40 లక్షల కోట్లు రాష్ట్ర ప్రజలకు అందజేశారని తెలిపారు. ఆకలి చూసి, కన్నీరు తుడవడమే సీఎం జగన్‌కు తెలుసునని అన్నారు. పేదలకు గూడు, నీడ కల్పించాలన్న లక్ష్యంతో రూ. 12,800 కోట్లతో భూమి కొని మరీ 32 లక్షల ఇళ్లు నిర్మాణం చేస్తున్నారని వివరించారు.
నాడు–నేడు, జగనన్న ఆరోగ్య సురక్ష, ఆరోగ్య శ్రీ వంటి పథకాలతో ప్రజల జీవన స్థితిగతుల్లో పెద్ద ఎత్తున మార్పు వస్తుందని చెప్పారు. ఒకప్పుడు విత్తనాలు, ఎరువుల కోసం క్యూలో కొట్లాటలు జరిగేవని, జగన్ పాలనలో రైతులకు అలాంటి ఇబ్బందులు లేవన్నారు. చంద్రబాబులా రాజకీయాలు చేసి లబ్ధిదారుల ఎంపిక ఏనాడూ చేయలేదని చెప్పారు. చంద్రబాబు పధ్నాలుగేళ్ల పాలనలో శ్రీకాకుళం జిల్లాకు ఒక్క మంచి పని చేయలేదన్నారు. బాబు అధికారంలో జన్మభూమి కమిటీలతో ప్రజలను వేధించారని తెలిపారు.
పైసా అవినీతి జరగలేదు: స్పీకర్ తమ్మినేని సీతారాం
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సీఎం వైఎస్ జగన్ పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అందిస్తున్నారని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. ఒక్క పైసా అవినీతి లేకుండా లక్షల కోట్లు ప్రజలకు అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో పైసా అవినీతి లేకుండా పాలన జరుగుతోందని, అవినీతి జరిగినట్లు రుజువు చేస్తే స్పీకర్ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. బాబా సాహెబ్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకుని సీఎం జగన్ బడుగుల అభివృద్ధికి పాటు పడుతున్నారని అన్నారు.
రాజ్యాంగ ఆశయాల సాధన: ఎమ్మెల్యే కళావతి
పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి మాట్లాడుతూ ఉత్తరాంధ్రలోని అత్యంత వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం సీఎం వైఎస్ జగన్ పెద్ద ఎత్తున నిధులు కేటాయించి పలు కీలక ప్రాజెక్టులు చేపడుతున్నారని వివరించారు. గిరిజనులకు పోడు భూముల హక్కులిచ్చారని తెలిపారు.
దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం: ఎమ్మెల్యే రెడ్డి శాంతి
పాలకొండ నియోజకవర్గంలో దీర్ఘకాలంగా ఉన్న సమస్యలకు వైఎస్ జగన్ పరిష్కారం చూపించారని ఎమ్మెల్యే రెడ్డి శాంతి తెలిపారు. వంశధార నిర్వాసితుల నోటి ముందున్న కూడును కూడా టీడీపీ నేతలు లాక్కున్నారని చెప్పారు. ప్రతిపక్ష హోదాలో ఇచ్చిన హామీ మేరకు వైఎస్ జగన్ సీఎం కాగానే వంశధార నిర్వాసితులకు రూ. 216 కోట్లు అదనపు పరిహారం అందించారని తెలిపారు.
రూ.750 కోట్లతో వైఎస్సార్ శుద్ధ జలం ప్రాజెక్టును చేపట్టి ఉద్దానం ప్రజల కష్టాలను తీరుస్తున్నారన్నారు. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, జెడ్పీ చైర్‌పర్సన్ పిరియా విజయ, ఎమ్మెల్సీలు పాలవలస విక్రాంత్, వరుదు కల్యాణి, నర్తు రామారావు, ఎమ్మెల్యేలు గొర్లె కిరణ్‌కుమార్, కంబాల జోగులు, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment