మోసాలు, నేరాలే వారి చరిత్ర: సీఎం వైఎస్‌ జగన్‌ | CM Jagan Fires On Chandrababu Naidu Yellow Gang At Proddatur Public Meeting, Details Inside - Sakshi
Sakshi News home page

AP CM YS Jagan: మోసాలు, నేరాలే వారి చరిత్ర

Published Thu, Mar 28 2024 5:04 AM | Last Updated on Thu, Mar 28 2024 11:57 AM

CM Jagan Fires On Chandrababu Yellow Gang At Proddatur public meeting - Sakshi

వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరులో జరిగిన మేమంతా సిద్ధం సభకు హాజరైన అశేష జనసందోహంలో ఓ భాగం , వైఎస్సార్‌సీపీ ఎన్నికల గుర్తు ‘ఫ్యాన్‌’ను ప్రజలకు చూపిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌

ప్రొద్దుటూరు బహిరంగ సభలో నిప్పులు చెరిగిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

చిన్నాన్న వివేకాను ఎవరు చంపారు.. ఎందుకు చంపించారో అందరికీ తెలుసు 

చంపినోణ్ణి చంద్రబాబు, ఎల్లో మీడియా నెత్తిన పెట్టుకుంది 

విశాఖ డ్రగ్స్‌ కేసులో ఉన్నది చంద్రబాబు, పురందేశ్వరి బంధువులే 

నేరం వాళ్లు చేసి.. నెపం వైఎస్సార్‌సీపీపైకి తోస్తున్నారు 

బతికున్నప్పుడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు.. చనిపోయాక వీళ్లే విగ్రహాలు పెట్టిస్తారు 

అబద్ధాలు చెప్పేవాళ్లు, మోసాలు చేసే వాళ్లే మనకు ప్రత్యర్థులు 

వీరంతా కలిసి నన్ను దెబ్బతీసేందుకు కుట్రలు, కుతంత్రాలు  

ఈసారి నా ఇద్దరు చెల్లెళ్లు కూడా కుట్రలో భాగస్వాములయ్యారు 

ప్రజల అజెండానే వైఎస్సార్‌సీపీ జెండా 

మీ కోసం 130 సార్లు బటన్‌ నొక్కి రూ.2.70 లక్షల కోట్లు జమ చేశాను 

మీరు నా కోసం మే 13న ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికకు 2 సార్లు బటన్‌ నొక్కండి 

చంద్రబాబుకు ఓటేస్తే మోసకారికి వేసినట్టే.. పేదల సంక్షేమానికి వ్యతిరేకంగా ఓటేసినట్టే ఇప్పుడున్న సంక్షేమ పథకాల రద్దుకు అంగీకరించినట్లేనని ప్రతి ఇంటా చెప్పండి  

విప్లవాత్మక మార్పులకు మారుపేరుగా ఎక్కడా లంచాలు, వివక్షకు తావు లేకుండా ప్రజల అజెండానే జెండాగా వైఎస్సార్‌సీపీ ముందుకెళుతోంది. ఈ జెండా మరో జెండాతో జత కట్టలేదు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మాకు మద్దతుగా సిద్ధం అని ఈ జెండా తలెత్తుకుంది. ప్రజల అజెండాగా రెపరెపలాడుతోంది.  

పేద ప్రజల అభివృద్ధి కోసం 130 సార్లు బటన్‌ నొక్కాను. మీరు మే 13వ తేదిన ఫ్యాన్‌ గుర్తుపై రెండు మార్లు బటన్‌ నొక్కడంతోపాటు మరో వంద మందికి మన ప్రభుత్వం చేసిన మంచిని వివరించి ఓటు వేసేలా చైతన్యం తీసుకురావాలి. 48 రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో అబద్ధాలు చెప్పేవాళ్లు, మోసం చేసేవాళ్లు మనకు ప్రత్యర్థులు. పేదల వ్యతిరేకులని ఓడించేందుకు మీరంతా సిద్ధమా.. (సిద్ధం అని జనం నినాదాలు) అబద్దాలు, మోసాలు, కుట్రల కూటమిపై గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం. ప్రజలకు మంచి చేయని చంద్రబాబు బృందాన్ని నమ్మితే నట్టేట ముంచడం ఖాయం. 

ప్రభుత్వ ప్రయోజనాలు అందుకున్న ప్రతి కుటుంబం స్టార్‌ క్యాంపెయినర్‌గా బయటికి రావాలి. వారంతా మరో వంద మందికి చెప్పి మీ బిడ్డకు తోడుగా నిలవాలి. 2024 ఎన్నికల్లో ‘మన కోసం మనం’ ప్రతి ఒక్కరూ రెండుసార్లు ఫ్యాన్‌ గుర్తుపై నొక్కాలి. అలా నొక్కితేనే చంద్రముఖి బెడద ఉండదు. పొరపాటు జరిగితే చంద్రముఖి లక లక లక అంటూ సైకిల్‌పై వచ్చి టీ గ్లాస్‌ పట్టుకుని మీ ఇంటిలో రక్తం తాగుతుంది. చంద్రబాబుకు ఓటు వేయడమంటే మన పథకాలు మనమే రద్దు చేసుకోవడం. ఆయన్ను నమ్మడం అంటే మోసం, అబద్ధం, వెన్నుపోటును నమ్మడమే.  
– సీఎం వైఎస్‌ జగన్‌ 

సాక్షి ప్రతినిధి, కడప: మోసాలు చేయడం, అబద్ధాలు చెప్పడం, వెన్నుపోటు పొడవడం, కుట్రలు చేయడంలో చంద్రబాబుకు 45 సంవత్సరాల అనుభవం ఉందని.. చేయాల్సిన నేరాలన్నీ చేసేసి నెపం వైఎస్సార్‌సీపీపైకి తోయడంలో ఆయనకు ఎవరూ సాటిలేరని ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. తన చిన్నాన్న వివేకానందరెడ్డిని ఎవరు చంపారో, ఎందుకు చంపించారో.. వారితో ఇప్పుడెవరు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారో అందరికీ తెలుసని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విశాఖలో పట్టుబడిన డ్రగ్స్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరీ, చంద్రబాబు బంధువులవని తేలినా, ఎల్లో మీడియా సహకారంతో ఆ నెపాన్ని మనపై నెట్టేందుకు క్షణాల్లో రెడీ అయ్యారని మండిపడ్డారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయడంలో, గోబెల్స్‌ ప్రచారంలో, కుటుంబాలను చీల్చడంలోనూ చంద్రబాబు అనుభవాన్ని చూస్తున్నామని ధ్వజమెత్తారు. బుధవారం ఇడుపులపాయలో ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టిన సీఎం వైఎస్‌ జగన్‌.. ప్రొద్దుటూరులో నిర్వహించిన బహిరంగ సభలో అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

‘వివేకానందరెడ్డిని అత్యంత దారుణంగా చంపానని హేయంగా చెప్పుకుని తిరుగుతున్నా ఆ హంతకుడికి మద్దతు ఇస్తూ నేరుగా నెత్తిన పెట్టుకుంటున్నారు చంద్రబాబు, ఎల్లో మీడియా. ఈ హంతకుడికి రాజకీయ కాంక్షతో ఒకరిద్దరు నా వాళ్లు కూడా మద్దతిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిన్నాన్నను ఓడించిన వారితో చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నారు. వివేకం చిన్నాన్న బతికున్నంత వరకు చంద్రబాబును శత్రువుగా భావించారు. చనిపోయిన తర్వాత శవ రాజకీయాలతో కుట్రలు చేస్తున్నారు. ఎన్టీఆర్‌ బతికున్నప్పుడు వెన్నుపోటు పొడిచి, చనిపోయిన తర్వాత శవాన్ని లాక్కొని ఊరూరా విగ్రహాలు పెడుతూ దండలు వేస్తున్నారు.

నైతిక విలువలు ఎంత దయనీయంగా ఉన్నాయో ప్రజలు ఆలోచించాలి. నన్ను దెబ్బ తీసేందుకే కుట్రలు చేస్తున్నారు. ఇది కలియుగం కాక మరేమిటి? ఎవరెన్ని కుట్రలు పన్నినా నేను మాత్రం ప్రజల పక్షమే. ఆ దేవుడు, ప్రజల్నే నమ్ముకున్నా. ధర్మం, న్యాయాన్ని నమ్ముకున్నా. ప్రజలకు మంచి చేసిన చరిత్ర మనది. వారిలా వంచించిన చరిత్ర మనకు లేదు. మేనిఫెస్టోలో పది శాతం వాగ్దానాలు కూడా చంద్రబాబు నెరవేర్చలేదు. ఎన్నికల మేనిఫెస్టోను బైబిల్, ఖురాన్, భగవద్గీతలుగా భావించి, త్రికరణ శుద్ధిగా 99 శాతం వాగ్దానాలను అమలు చేసి నిలబెట్టుకున్న చరిత్ర మన ప్రభుత్వానిది. ఈ తేడాను ప్రజలందరూ గమనించాలి’ అని చెప్పారు. ఈ సభలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 



వారు చంద్రబాబు వదినమ్మ బంధువులు  
► బ్రెజిల్‌ నుంచి చంద్రబాబు వదిన గారి చుట్టం డ్రై ఈస్ట్‌ పేరుతో డ్రగ్స్‌ను దిగుమతి చేసుకుంటూ విశాఖపట్నంలో సీబీఐ దాడుల్లో అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటనలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, చంద్రబాబు బంధువులు దొరికితే చివరికి ఎల్లో మీడియా సహకారంతో ఆ నెపాన్ని మనపైన నెట్టేందుకు శక్తివంచన లేకుండా కష్టపడుతున్నారు. చంద్రబాబు వదినమ్మ, ఆమె కొడుకు, వియ్యంకుడు తదితరులు డైరెక్టర్లుగా వ్యవహరించిన కంపెనీకి సంబంధించిన ఈ వ్యవహారంలో బుకాయిస్తూ మనపై బురదజల్లుతున్నారు.  

► 45 సంవత్సరాలుగా క్షుద్ర రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు బంధువులు అడ్డంగా దొరికితే.. వైఎస్సార్‌సీపీ వాళ్లని నీచ రాజకీయాలు చేస్తున్న వాళ్లకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 ఎల్లో మీడియా వంత పాడుతోంది. ఈనాడు పత్రికను చదువుతుంటే ఛీ ఇదొక పేపరా అనిపిస్తోంది. కేంద్రం నుంచి ఒక పార్టీని పరోక్షంగా, మరొక పార్టీని ప్రత్యక్షంగా తెచ్చుకుని అందరూ కలిసి ఒక్క జగన్‌తో యుద్ధం చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్, జనసేన, టీడీపీ, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, నా ఇద్దరు చెల్లెళ్లు కలిసి నాపై యుద్ధానికి సిద్దమయ్యారు.  

మంచి చేసి చూపించాడు మీ బిడ్డ 
► రాష్ట్రంలో గతంలో ఎన్నడూ జరగని విధంగా సంక్షేమం, అభివృద్ధిని 58 నెలల కాలంలో మీ బిడ్డ చేసి చూపించాడు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు ఏ గ్రామంలో నాలుగు అడుగులు వేసినా సచివాలయ వ్యవస్థ కనిపిస్తోంది. అందులో మన పిల్లలు పది మంది ఉద్యోగం చేస్తుండడం కనిపిస్తోంది. 1వ తేదీ ఇంటి వద్దకు చిక్కటి చిరునవ్వుతో అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులకు వారి మనవళ్లు విచ్చేసి సెలవు దినమైనప్పటికీ పింఛన్‌ అందజేస్తుండటమూ కనిపిస్తోంది.  

► రూ.3 వేలు పింఛన్‌ ఇస్తున్న రాష్ట్రం దేశంలోనే ఎక్కడా లేదు. సంవత్సరానికి రూ.24 వేల కోట్లు పింఛన్లకు ఖర్చు చేస్తున్నాం. మన తర్వాతి స్థానంలో తెలంగాణ రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. మిగతా రాష్ట్రాలు రూ.8, 6, 4 కోట్లు ఖర్చు చేస్తున్నాయి. లంచాలు, వివక్షకు ప్రతిరూపాలైన జన్మభూమి కమిటీలు లేనటువంటి వలంటీర్‌ వ్యవస్థను ఏర్పాటు చేశాం. ఓటు వేయని వారికి కూడా పథకాలు అందిస్తున్నది మీ బిడ్డ పాలనలోనే సాధ్యమైంది.  

► మీ బిడ్డ డీబీటీ ద్వారా బటన్‌ నొక్కడంతో అక్కాచెల్లెమ్మల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ అవుతోంది. రూ.2.70 లక్షల కోట్లు ఖాతాల్లో నేరుగా జమ అయింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం, సీబీఎస్‌ఈ, ఐబీ వంటి అంతర్జాతీయ స్థాయి బోధన, ట్యాబ్‌లు, ఐఎఫ్‌బీ, డిజిటల్‌ బోధన వంటివి ఒక్కసారి పాఠశాలలో కూర్చొని చూస్తే గుర్తుకు వచ్చేది వైఎస్‌ జగన్, వైఎస్సార్‌పీపీ ప్రభుత్వమే. రైతన్నకు తోడుగా నిలిచింది, రైతన్నకు సాయంగా రైతు భరోసా సొమ్మును అందించడం, రైతన్నకు తోడుగా అసైన్డ్‌ భూములు, 22ఏ భూములపై శాశ్వత భూ హక్కులు అందించడంలో అడుగులు వేగంగా పడ్డాయి.  

► ప్రొద్దుటూరు గడ్డపై లక్షల సంఖ్యలో ఉన్న సింహాల గర్జన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇంతటి గొప్ప సభ గతంలో ఇక్కడ ఎప్పుడూ లేదు. జనసంద్రం కని్పస్తోంది. దుష్ట చతుష్టయాన్ని నిలువరించడమే లక్ష్యంగా ఎన్నికల సమరంలో పోరాడేందుకు గాండీవంతో అర్జునుడిగా నేను సిద్ధం.. శ్రీకృష్ణులుగా మీరు పాంచజన్యం పూరించేందుకు సిద్దమా? (ముక్తకంఠంతో మేమంతా సిద్ధమేనని జనం బదులిచ్చారు).  

సామాజిక న్యాయానికి పెద్దపీట 
► నిరుపేదలకు తోడుగా సామాజిక న్యాయాన్ని చేతల్లో అమలు చేసి చూపిస్తున్న ప్రభుత్వం మనదే. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేదలందరికీ కులం, మతం, రాజకీయం చూడకుండా సామాజిక న్యాయం అమలు చేసి చూపెట్టాం. ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి ఎస్సీలను తూలనాడితే వారు ఎలా బతుకుతారు? మైనార్టీల నాలుగు శాతం రిజర్వేషన్లపై చెలగాటమాడితే వారంతా ఎక్కడికి వెళ్లాలి? 

► స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో నాలుగు లక్షల ఉద్యోగాలు భర్తీ కాగా, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాం. ఈ ఉద్యోగాల్లో 80 శాతం నా.. నా.. నా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలే ఉద్యోగాలు పొందడం సామాజిక న్యాయం కాదా? రాష్ట్రంలో 31 లక్షల ఇళ్లను అక్కాచెల్లెమ్మల పేరుమీద ఇచ్చాం. ఇందులో 22 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. ఒక్క ప్రొద్దుటూరులోనే 24 వేల ఇళ్ల పట్టాలు ఇచ్చింది మీ బిడ్డ వైఎస్‌ జగనే. ప్రతి అక్క, చెల్లెమ్మకు రూ.5–20 లక్షల వరకు ఆస్తిని ఇంటి రూపంలో ఇస్తోంది వైఎస్సార్‌సీసీ ప్రభుత్వమే. 

► అక్కచెల్లెమ్మలకు 50 శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా చట్టం చేసి సామాజిక న్యాయం అమలు చేశాం. అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, ఆసరా, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం తదితర పథకాలన్నీ మహిళా సాధికారతను తీసుకు వచ్చాయి. అక్కాచెల్లెమ్మలు ధైర్యంగా బయటికి వస్తే దిశ యాప్‌ ఉంది. రక్షణ కోసం గ్రామాల్లో మహిళా పోలీసులను ఏర్పాటు చేశాం.  

► గ్రామాల్లో నాలుగు అడుగులు వేయగానే విలేజ్‌ క్లినిక్‌ కనిపిస్తుంది. ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష కార్యక్రమాలతో అందరికీ ఉచితంగా పరీక్షలు, మందుల పంపిణీ సాధ్యమైంది. 104, 108 కొత్త అంబులెన్స్‌లు కుయ్‌... కుయ్‌ మంటూ సేవలు అందిస్తున్నాయి. దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్సార్‌ పేద ప్రజల కోసం ఆరోగ్యశ్రీ, ఉచిత కరెంటు పథకాలు తీసుకు రాగా, ఆయన తనయుడిగా మీ బిడ్డ ఆరోగ్యశ్రీని మరింత ఉన్నతీకరించి రూ. 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందేలా చేశారు.

రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్‌ కళాశాలల ఏర్పాటు, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తున్నాం. 10 షిప్పింగ్‌ హార్బర్లు నిర్మాణంలో ఉన్నాయి. ఎయిర్‌పోర్టుల విస్తరణపై దృష్టి సారించాం. పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా పక్కనే ఉన్న బద్వేలులో సెంచురీ ఫ్లై బోర్డ్‌ పరిశ్రమను ప్రారంభించాం. రాష్ట్రంలో పెద్ద పెద్ద పారిశ్రామిక సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడుతున్నాయి. కోవిడ్‌ ఉన్నా ఎక్కడా తగ్గకుండా, సాకులు చెప్పకుండా మీ అవసరం రాష్ట్ర అవసరంగా భావించి 58 నెలల కాలంలో 130 సార్లు బటన్‌ నొక్కాను.

విలువలకు అండగా నిలవాలి 
► 2014లో మోదీ, దత్తపుత్రుడితో కలిసి చంద్రబాబు ఎన్నికలకు వెళ్లారు. ఎన్నికల సమయంలో వారు రూపొందించిన అబద్ధాల పాంప్లేట్‌ ప్రతి ఇంటికి పంపారు. టీవీలు, పేపర్లలో యాడ్స్‌ వేశారు. రైతులకు రుణమాఫీ, పొదుపు సంఘాలకు రుణమాఫీ, ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు, ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి, రూ.10 వేల కోట్ల బీసీ సబ్‌ ప్లాన్, సింగపూర్‌ను మించిన రాజధాని, ప్రతి జిల్లాకు హైటెక్‌ నగరం, మూడు సెంట్ల భూమి వంటి హామీలు ఇచ్చారు. వీటిలో ఒక్కటైనా అమలయ్యాయా? ప్రత్యేక హోదా ఇచ్చారా? (లేదు.. లేదని ప్రజల నినాదాలు)
 
► మళ్లీ ఇదే బ్యాచ్‌ ఎన్నికల్లో ఇప్పుడు ప్రజల ముందుకు వస్తోంది. వీరు కొత్త మేనిఫెస్టోలో కిలో బంగారం, బెంజ్‌ కారు, సూపర్‌ సిక్స్, సెవెన్‌ అంటూ మరోసారి మోసం చేసేందుకు రెడీ అయ్యారు. దేశ చరిత్రలో ఇలాంటి రాజకీయాలు ఎక్కడా లేవు. విశ్వసనీయత, విలువలకు ప్రతీకగా నిలుస్తున్న మీ బిడ్డ నోటిలో నుంచి ఒక్కమాట వస్తే దానిని అమలు చేసిన తర్వాతే ఓటు అడుగుతున్నాం. విలువల రాజకీయానికి, పొత్తుల రాజకీయానికి మధ్య జరుగుతున్న పోరులో విలువలకు అండగా నిలవాలి. 

► ఫ్యాన్‌ ఇంట్లో ఉండాలి.. సైకిల్‌ ఇంటి బయట ఉండాలి.. తాగిన టీ గ్లాస్‌ సింక్‌లో ఉండాలి. జరుగుతున్న ఎన్నికలు పేదల భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలు. పొరపాటు జరిగితే పేదల బతుకులు అంధకారమవుతాయి. ప్రతి ఇంటికి సంక్షేమం, అభివృద్ధిని కాంక్షిస్తూ పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు మీరు సిద్దమా? (సిద్ధమే అని సెల్‌లో టార్చ్‌ ఆన్‌ చేసి చేతులు పైకెత్తారు.)   

► 175 ఎమ్మెల్యే స్థానాలు, 25 ఎంపీ స్థానాలు సాధించడమే మనందరి లక్ష్యం. పేదవాడికి మంచి చేయడంలో ఎక్కడా తగ్గలేదు. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ స్థానం కూడా తగ్గడానికి వీలు లేదు.

► ఒకే ఒక్కడి మీదకు ఒంటరిగా వచ్చే ధైర్యం ఎవరికీ లేకపోవడానికి కారణం దేవుడి దయ, కోట్లాది మంది ప్రజల గుండెల్లో చోటు ఉండడమే. 75 సంవత్సరాల చంద్రబాబు అధికారం దక్కిన వెంటనే మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేస్తారు. మళ్లీ ఎన్నికల సమయానికి కొత్త మేనిఫెస్టో, కొత్త వాగ్దానాలతో రొటీన్‌గా వంచన చేస్తారు. ఎన్నికల్లో తిట్టిన పార్టీలతోనే ఏమాత్రం సిగ్గు లేకుండా జత కడతారు. ఢిల్లీ దాక వెళ్లి కాళ్లయినా పట్టుకుంటారు. విశ్వసనీయత, విలువలు లేని వీళ్ల రాజకీయాలు ఎవరికి స్ఫూర్తినిస్తాయి? 

మన మంచిని ప్రతి ఇంటా చెప్పాలి 
మన ప్రభుత్వం పరిపాలనలో కొత్త ఒరవడిని తీసుకొచ్చిందని, మనం చేసిన మంచిని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. అమ్మ ఒడి, చేయూత, సున్నా వడ్డీ పథకం, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, రైతు భరోసా, వాహనమిత్ర మొదలు నేతన్న నేస్తం వరకు మనం అందించే పథకాల ద్వారా లబ్ధి పొందిన విషయాలను ఇంటింటికి తీసుకువెళ్లండి.  

ఈ  పథకాలన్నీ అమలు కావాలన్నా, అవ్వాతాతలకు పెన్షన్లు సకాలంలో రావాలన్నా, మెరుగైన రేషన్‌ ఇంటికి రావాలన్నా, నాణ్యమైన విద్య, విదేశీ విద్య, వంద శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్, పేదవాడికి మెరుగైన వైద్యం, ఆర్బీకేలు, రైతు భరోసా, తొమ్మిది గంటల ఉచిత విద్యుత్, ఇన్‌ఫుట్‌ సబ్సిడీ తదితర పథకాలన్నీ కొనసాగాలంటే ‘జగన్‌ రావాలి...వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం రావాలి’ అని తెలియజేయాలి. 

ఆత్మీయంగా అభ్యర్థుల పరిచయం 
‘కడప పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న నా తమ్ముడు వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ప్రొద్దుటూరు నుంచి పోటీ చేస్తున్న సోదరుడు ప్రసాద్‌రెడ్డి, కమలాపురం నుంచి మామ పి.రవీంద్రనాథ్‌రెడ్డి, బద్వేలు నుంచి పోటీ చేస్తున్న సోదరి డాక్టర్‌ సుధమ్మ, జమ్మలమడుగు నుంచి పోటీ చేస్తున్న సోదరుడు సుధీర్‌రెడ్డి, కడప నుంచి పోటీ చేస్తున్న నవాబ్‌ సాబ్‌ అంజద్‌బాష, మైదుకూరు నుంచి పోటీ చేస్తున్న పితృ సమానులైన ఎస్‌.రఘురామిరెడ్డి, పులివెందుల నుంచి పోటీ చేస్తున్న నాపై మీ అందరి చల్లని ఆశీస్సులు ఉంచాలి’ అని సీఎం జగన్‌ కోరారు. అనంతరం వేదికపై ఉన్న నాయకులను పేరుపేరునా పలకరిస్తూ యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

అందరి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా పాలన
ప్రజల ఆత్మగౌరవాన్ని నిలిపేలా జగనన్న పరిపాలన కొనసాగుతోంది. ఈ ఐదేళ్లలో ఆయన ఆలోచ­న­లతో విప్లవాత్మక మార్పులు సాకారమయ్యాయి. సచివాల­యాలు, ఆర్బీకేలు, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌ మన కళ్లెదుటే కనిపిస్తున్నాయి. పరిపాలనను గ్రామ స్థాయికి, ప్రభుత్వ సేవలను ఇంటివద్దకే చేర్చారు. ఇవాళ ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో జీవిస్తున్నారు. పెన్షన్లు, ఇళ్ల కోసం ఏ ఒక్కరి దగ్గరికీ వెళ్లి చేయి చాచాల్సిన పనిలేదు.

రెండేళ్లు కోవిడ్‌తో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ప్రతి వాగ్దానాన్ని జగనన్న నిలబెట్టుకు­న్నారు. ప్రొద్దుటూరులో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వ స్థలం అందుబాటులో లేకపోవడంతో జగనన్న ప్రభుత్వం రూ.200 కోట్లను వెచ్చించి స్థలం కొనుగోలు చేసి 25 వేల మందికి ఇళ్ల పట్టాలిచ్చింది. ఇవాళ గండికోటలో 27 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోగలుగు­తున్నాం. జగనన్న ప్రభుత్వం రాకముందు కనీసం ఐదు టీఎంసీలు కూడా అక్కడ నిల్వ చేయలేని దుస్థితి. దాదాపు రూ.900 కోట్లు ఖర్చు చేసి ఇవాళ అక్కడ 27 టీఎంసీల నీటిని స్టోరేజీ చేసుకుంటున్నాం.

సీబీఆర్‌లో 10 టీఎంసీల నీటిని నిల్వ చేశాం. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో నింపుతు­న్నాం. ప్రభుత్వాన్ని వేలెత్తి చూపే పరిస్థితి లేకపోవడంతో విపక్షాలు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాయి. చంద్రబాబుకు బలం, ధైర్యం లేవు కాబట్టే జనసేన, బీజేపీని తోడు తెచ్చుకు­న్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా కాంగ్రెస్‌తో కూడా పొత్తు పెట్టుకున్నారు. ఎంతమంది పొత్తులు పెట్టుకున్నా సరే జగనన్నకు తిరుగులేదు.  
– వైఎస్‌ అవినాష్‌రెడ్డి, కడప ఎంపీ 

మళ్లీ మీరే సీఎం..
ప్రొద్దుటూరు నియోజకవర్గంలో సీఎం జగన్‌ తొలి సభను నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నియోజకవర్గంలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా రూ.1,700 కోట్లను అక్కచెల్లెమ్మలకు సీఎం జగన్‌ అంది­ంచారు. దాదాపు రూ.1,300 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టగా, 24 వేల ఇళ్ల పట్టాలు ఇచ్చి పేదల సొంతింటి కలను నెరవేర్చారు. దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతో వైఎస్‌ జగన్‌ మరోమారు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖాయం. ఉమ్మడి కడప జిల్లాలో అన్ని స్థానాలను గెలుచుకుంటాం.
– రాచమల్లు శివప్రసాదరెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement