ఎక్కడా రాజీ పడొద్దు.. గట్టిగా గళం వినిపించండి: వైఎస్ జగన్‌ | YSRCP Chief YS Jagan Key Suggestions To Party MPs Ahead Of Parliament Sessions | Sakshi
Sakshi News home page

ఎక్కడా రాజీ పడొద్దు.. గట్టిగా గళం వినిపించండి: వైఎస్ జగన్‌

Published Thu, Mar 6 2025 6:19 PM | Last Updated on Thu, Mar 6 2025 7:13 PM

YSRCP Chief YS Jagan Key Suggestions To Party MPs Ahead Of Parliament Sessions
  • పార్లమెంట్‌ సమావేశాలు ఆరంభం కానున్న తరుణంలో  వైఎస్సార్‌సీపీ ఎంపీలకు వైఎస్ జగన్ దిశా నిర్దేశం
  • పోలవరం ప్రాజెక్టు ఎత్తు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌..మిర్చికి మద్దతు ధర. వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌, రాష్ట్రంలో కొత్త మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ.. ఇంకా పలు అంశాలపై సమావేశంలో చర్చ
  • వీటన్నింటిపైనా ఎక్కడా రాజీ లేకుండా పోరాడాలి
  • డీలిమిటేషన్‌పైనా ఎంపీల సమావేశంలో ప్రస్తావన
  • నియోజకవర్గాల పునర్విభజనపై స్పష్టత రావాలి
  • ఆ మేరకు కేంద్రం స్పందించేలా చొరవ చూపాలి

తాడేపల్లి: ఈనెల 10వ తేదీ నుంచి పార్లమెంటు మలి విడత బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో పార్టీకి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంప్‌ ఆఫీస్‌లో సమావేశమయ్యారు. ఉభయ సభల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రస్తావించాల్సిన అంశాలపై పార్టీ ఎంపీలకు వైఎస్‌ జగన్‌ దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని, రాష్ట్ర సమస్యలపై పార్లమెంటు ఉభయ సభల్లో పార్టీ ఎంపీలు గట్టిగా గళం వినిపించాలని సమావేశంలో వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.

టీడీపీ ఎంపీలు ఉన్నా నిమ్మకు నీరెత్తినట్లు..
రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసం పార్లమెంటు ఉభయ సభల్లో లేవనెత్తాల్సిన అంశాలపై ఈ సందర్భంగా సమావేశంలో చర్చ జరిగింది.   రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్టు కాగా, ఆ ప్రాజెక్టు నిర్మాణంలో ఎత్తు ఎంతో కీలకమని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. అలాంటి ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు అన్నది రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం అని, కేంద్ర క్యాబినెట్‌లో ఇద్దరు టీడీపీ మంత్రులు ఉన్నా, వారు పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపుపై కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకించక పోవడం దారుణమని ఆయన అన్నారు.

కాగా, రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా, రాష్ట్ర ప్రయోజనాల విషయంలోనూ టీడీపీ ఎంపీలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని సమావేశంలో వైయస్సార్సీపీ ఎంపీలు ప్రస్తావించారు. ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా ముందుకు వెళ్లేందుకు తాము వెనకాడ్డం లేదని, టీడీపీ ఎంపీలతో కలిసి ప్రధాని సహా కేంద్రంలో సంబంధిత మంత్రులను కలవాలని కూడా ప్రతిపాదించామని, కానీ టీడీపీ ఎంపీలు ముందుకు రాలేదని వైఎస్సార్‌సీపీ ఎంపీలు వెల్లడించారు. పోలవరం ఎత్తు విషయంలో రాష్ట్రం తరఫున పార్లమెంటులో గట్టి పోరాటం చేయాలని, ఈ విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని పార్టీ ఎంపీలను వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. 

విశాఖ  స్టీల్‌ప్లాంట్‌ను ఎలాగైనా కాపాడుకోవాలి..
అలాగే ఆంధ్రుల హక్కుగా, ఎన్నో త్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ఎలాగైనా కాపాడుకోవాలని, ఆ సంస్థ ప్రైవేటీకరణ జరగకుండా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ చర్యలకు వ్యతిరేకంగా పార్టీ ఎంపీలు పోరాడాలని వైఎస్‌ జగన్‌ నిర్దేశించారు. 

నియోజకవర్గాల పునర్విభజనపై రకరకాలుగా చర్చ జరుగుతోందని, దీని వల్ల ఉత్తరాదిలో పెరిగనట్లుగా దక్షిణాదిన సీట్లు పెరగవన్న ప్రచారం సాగుతోందని సమావేశంలో ఎంపీలు వెల్లడించారు. దీనిపై స్పందించిన వైఎస్‌జగన్, నియోజకవర్గాల పునర్విభజన విషయంలో కేంద్రం నుంచి స్పష్టత వచ్చేలా పార్లమెంటలో ప్రస్తావించాలని సూచించారు

YSRCP ఎంపీలతో వైఎస్ జగన్ సమావేశం

బ్యాలెట్‌ విధానంలో ఎన్నికల కోసం డిమాండ్‌ చేయండి
వన్‌ నేషన్‌. వన్‌ ఎలక్షన్‌’పై ఈ సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉందని గుర్తు చేసిన ఎంపీలు.. ఒకేసారి కేంద్రం, రాష్ట్రంలో జరిగే ఎన్నికలు పెద్దగా ప్రభావం చూపకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన వైఎస్‌ జగన్‌.. కేంద్రం, రాష్ట్రంలో ఒకేసారి ఎన్నికలు జరిగితే, ఈవీఎంలు కాకుండా బ్యాలెట్‌ విధానంలో ఎన్నికల కోసం డిమాండ్‌ చేయాలని నిర్దేశించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పుడు బ్యాలెట్‌ విధానంలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారని, మొదట్లో ఈవీఎంలతో పోలింగ్‌ నిర్వహించిన దేశాలు కూడా, ఆ తర్వాత బ్యాలెట్‌ విధానానికి మళ్లిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

ప్రజారోగ్య రంగంపై పార్లమెంట్‌లో ప్రస్తావించండి
నిరుపేదలకు వైద్య విద్యను మరింత అందుబాటులోకి తెచ్చేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కొత్తగా 17 మెడికల్‌ కాలేజీల నిర్మాణం మొదలు పెట్టగా, వాటిలో పూర్తైన మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ దిశలో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై సమావేశంలో ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజారోగ్య రంగంపై సీఎం చంద్రబాబు కత్తికట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని ఎంపీలు ప్రస్తావించగా, ఈ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావించాలని వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.

పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తున్నారు..
పేద విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తేవడంతో పాటు, ప్రతి జిల్లాలో పేదలకు అత్యాధునిక వైద్యాన్ని ఉచితంగా అందించే ఉద్దేశంతో కొత్త మెడికల్‌ కాలేజీలు తీసుకొచ్చామని వైఎస్‌ జగన్‌ వెల్లడించారు. ఎన్నో వ్యవప్రయాసలకోర్చి, అన్ని రకాలుగా నిధులు, భూములు సేకరించి కాలేజీలను నిర్మించామని, కానీ ఈరోజు వాటిని ప్రైవేటుపరం చేస్తూ మంచి ఉద్దేశాలను నీరు గారుస్తున్నారని, అందుకే ఈ అంశాన్ని పార్లమెంటులో గట్టిగా ప్రస్తావించాలని స్పష్టం చేశారు వైఎస్‌ జగన్‌. 

వైఎస్‌ జగన్‌ భద్రతపై ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టిన ఎంపీలు
వైఎస్‌ జగన్‌ భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిని తీవ్రంగా తప్పు బట్టిన ఎంపీలు.. మాజీ ముఖ్యమంత్రిగా, జడ్‌ ప్లస్‌ కేటగిరీలో ఉన్న నేతకు తగిన భద్రత కల్పించడం లేదని ఆక్షేపించారు. జగన్‌గారి గుంటూరు మిర్చి యార్డు సందర్శన సమయంలో, పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేయకపోవడాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఈ విషయాన్ని అంత తేలిగ్గా విడిచి పెట్టబోమన్న వారు, ప్రజా నాయకుడిగా ఉన్న జగన్‌ ప్రజల్లోకి వెళ్లకుండా నిరోధించడానికి, ఆయనకు భద్రతా సమస్యలు సృష్టించడానికి ఇలాంటి చర్యలకు దిగుతున్నారని దుయ్యబట్టారు. అందుకే ఈ విషయాన్ని కూడా పార్లమెంటులో గట్టిగా లేవనెత్తుతామని వైఎస్సార్‌సీపీ ఎంపీలు వెల్లడించారు.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ (వైఎస్సార్‌సీపీ) నేత వై.వీ.సుబ్బారెడ్డి, వైఎస్సార్‌సీపీ లోక్‌సభ పక్షనేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ నాయకుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌తో పాటు, ఎంపీలు గొల్ల బాబూరావు, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎం.గురుమూర్తి, తనూజారాణి, రఘునాథరెడ్డి ఇంకా పార్టీ స్టేట్‌ కో–ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement