ఎన్నికల ప్రధాన అధికారి మీనాకు ఫిర్యాదు చేస్తున్న విష్ణు, నారాయణమూర్తి, శ్రీనివాసరెడ్డి
ఐవీఆర్‌ఎస్ కాల్స్‌తో ఓటర్లను తప్పుదారి పట్టిస్తోంది
చంద్రబాబు, పవన్ కోడ్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు
ఏపీ ఎన్నికల ప్రధాన అధికారికి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు
సాక్షి, అమరావతి: ‘అమల్లో లేని ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి తెలుగుదేశం పార్టీ ఐవీఆర్‌ఎస్ కాల్స్ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై దుష్ప్రచారం చేస్తోంది. ఓటర్లను తప్పుదారి పట్టిస్తోంది. ఇది ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌కు విరుద్ధం. టీడీపీపై తగిన చర్యలు తీసుకోండి’ అని ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్ మీనాకు వైఎస్సార్‌సీపీ సోమవారం ఫిర్యాదు చేసింది.
ఈ మేరకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు ఎ.నారాయణమూర్తి, న్యాయవాది కె.శ్రీనివాసరెడ్డిలు ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి ఫిర్యాదుతోపాటు తగిన ఆధారాలను అందజేశారు. అదేవిధంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఈ నెల 28వ తేదీన కోడుమూరు, మంత్రాలయంలలో జరిగిన ప్రచార సభల్లో ప్రసంగిస్తూ సీఎం వైఎస్ జగన్‌పై వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ ఈ నెల 28న ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఎన్నికల నియమావళికి విరుద్ధంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. కర్నూలు టీడీపీ ఎంపీ అభ్యర్థి నాగరాజు ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment