
సాక్షి, కాకినాడ: కాకినాడ సెజ్ భూములపై యనమల రామకృష్ణుడికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే భూ దోపిడీపై చంద్రబాబుతో విచారణ జరిపించాలని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా డిమాండ్ చేశారు. అలాగే, 2014లో మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సెజ్ భూములపై తీర్మానం జరిగిందని చెప్పుకొచ్చారు. నాడు మంత్రిగా ఉన్న యనమల.. రైతుల పక్షాన ఎందుకు నిలబడలేదని ప్రశ్నించారు.
మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు దాడిశెట్టి రాజా కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ..‘తన రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబుకు యనమల లేఖ రాశారు. 2002-03లో కాకినాడ సెజ్ కోసం భూసేకరణ ప్రారంభమైంది. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబే. 2014లో మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సెజ్ భూములపై తీర్మానం జరిగింది. అప్పుడు ఆర్ధిక మంత్రిగా ఉన్న యనమల ఎందుకు సెజ్ రైతుల పక్షాన నిలవలేదు.
సెజ్‌కు ముందుగానే తన భూములను ఇచ్చి.. రైతులంతా భూములు ఇచ్చేలా మోటివేట్ చేసిన వ్యక్తి యనమల రామకృష్ణుడు. సెజ్ రైతులపై యనమలకు చిత్తశుద్ది ఉంటే భూ దోపిడిపై చంద్రబాబుతో విచారణ జరిపించాలి. వేల కోట్లు దోచుకున్న కేవీరావు చౌదరి నుండి సొమ్ములు వెనక్కి తీసుకుని.. సెజ్ రైతులకు ఎకరాకు రూ.40 లక్షలు తిరిగి చెల్లించాలి. సెజ్ రైతులకు వైఎస్ జగన్ భూములు తిరిగి ఇచ్చేశారు. అలాగే, చంద్రబాబుకు కూడా రైతులకు తిరిగి భూములు ఇచ్చే విధంగా భగవంతుడు ఆయనకు మంచి మనసు ప్రసాదించాలి.

సెజ్‌లో నేను ఆరు ఎకరాల భూమి కొన్నది వాస్తవమే. రైతులకు మార్కెట్ ధర కంటే ఎక్కువ ధర చెల్లించి ఆ భూములు కొనుగోలు చేశాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతిలో చంద్రబాబు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కూడా రైతుల నుండి భూములు కొనుగోలు చేశారు. సరైన పద్దతిలో భూముల కొనుగోలు చేయడంలో తప్పు లేదు కదా? అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment