మాచర్ల అల్లర్లకు చంద్రబాబే కారణం | YSRCP Leader Pinnelli Ramakrishna Reddy On Chandrababu | Sakshi
Sakshi News home page

మాచర్ల అల్లర్లకు చంద్రబాబే కారణం

Published Mon, Dec 19 2022 5:54 AM | Last Updated on Mon, Dec 19 2022 5:54 AM

YSRCP Leader Pinnelli Ramakrishna Reddy On Chandrababu - Sakshi

టీడీపీ నేతల దాడిలో గాయపడి, చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తున్న విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

నరసరావుపేట: మాచర్ల అల్లర్లకు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడే కారణమని ప్రభుత్వ విప్, వైఎస్సార్‌సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.నరసరావుపేటలోని జీబీఆర్‌ ప్రైవేట్‌ వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితులను పిన్నెల్లి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆదివారం వేర్వేరుగా పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఎమ్మెల్యే పిన్నెల్లి మీడియాతో మాట్లాడుతూ.. బీసీలంటే టీడీపీకి అక్కసు ఎందుకని ప్రశ్నించారు. చంద్రబాబు కొంత కాలంగా వ్యక్తిగత విమర్శలు చేస్తూ కార్యకర్తలను రెచ్చగొడుతుండటం దారుణం అన్నారు. ఇందులో భాగంగా నెలవారి మామూళ్లతో బ్రహ్మారెడ్డి అనే వ్యక్తిని నియమించారన్నారు.

ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదని నిలదీసిన స్థానికులను కర్రలు, రాడ్లు, రాళ్లతో దాడి చేయడమేమిటని వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రశ్నించారన్నారు. ఇందుకు బదులుగా వారు కర్రలు, బండరాళ్లతో దాడి చేసి, ముగ్గురు బీసీలను చంపే ప్రయత్నం చేశారన్నారు. ఈ విషయంలో పచ్చ మీడియా దుష్ప్రచారం దారుణం అని మండిపడ్డారు.

వారు తప్పు చేయకపోతే గొడవ జరిగిన గంటలోనే మాచర్ల వదిలి ఎందుకు పరారయ్యారని ప్రశ్నించారు. యరపతినేని శ్రీనివాసరావు బండారం మొత్తం అందరికీ తెలుసని, అందుకే ప్రజలు మూడుసార్లు ఓడించారని.. ప్రజాభిమానంతో తాను ఐదుసార్లు గెలిచానన్నారు. యరపతినేని ఉడుత ఊపులకు ఇక్కడ భయపడేవారెవరూ లేరని స్పష్టం చేశారు. బాబు పంపించిన పేటీఎం (జూలకంటి బ్రహ్మారెడ్డి) వ్యక్తిని చూసి తాము భయపడే ప్రసక్తే లేదని, ఆయన 2009లోనే తమపై ఓడిపోయాడనే విషయం గుర్తుంచుకోవాలన్నారు.

ఓర్వలేకే గొడవల సృష్టి : ఎంపీ లావు
రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో పరిపాలన సాగుతుంటే, ఓర్వలేకే ప్రతిపక్షం గొడవలు సృష్టిస్తోందని ఎంపీ లావు కృష్ణదేవరాయలు అన్నారు. మాచర్లలో గత 15 ఏళ్లుగా గొడవలు లేవని చెప్పారు. రెచ్చగొట్టే రాజకీయాలు వల్ల కార్యకర్తలు, వారి కుటుంబాలు, సామాన్య ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తోందన్నారు.

వైఎస్సార్‌సీపీ ప్రతిపక్షంలో ఉన్నపుడు ఎక్కడా, ఎప్పుడూ రెచ్చగొట్టే రాజకీయాలు చేయలేదని తెలిపారు. మాచర్లలో ప్రస్తుతం ప్రశాంతత నెలకొందని, ఇకపై ఇలాంటి ఘటనలను ఉపేక్షించవద్దని అధికారులకు సూచించామన్నారు. మీడియా కూడా రెచ్చగొట్టే ప్రచారం చేయకూడదని విజ్ఞప్తి చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement