బాబుకు మైండే కాదు.. చెవులూ పోయాయి | YSRCP Leader Vijaya Sai Reddy Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

బాబుకు మైండే కాదు.. చెవులూ పోయాయి

Published Wed, Jul 13 2022 4:52 AM | Last Updated on Wed, Jul 13 2022 4:52 AM

YSRCP Leader Vijaya Sai Reddy Fires On Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: చంద్రబాబుకి మైండే కాదు.. వినికిడి శక్తి కూడా పోయిందని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. లక్షలాది మంది వైఎస్సార్‌సీపీ అభిమానుల సాక్షిగా ప్లీనరీలో వైఎస్‌ విజయమ్మ చెప్పింది బాబుకి వినిపించలేదా అని మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ప్రశ్నించారు. రింగు నాయుడు ఈసారి వినికిడి యంత్రం పెట్టుకొని వింటే బాగుంటుందని హితవు పలికారు. అధికారంపై వ్యామోహంతో సొంత మామ ఎన్టీఆర్‌నే చంద్రబాబు చంపాడని తెలిపారు.

కుటుంబ బంధాలు, ప్రేమానుబంధాలు బాబుకు ఏమి తెలుస్తాయని అన్నారు. సీఎం జగన్‌ తల్లినే గెంటేశారనటం విడ్డూరంగా ఉందన్నారు. వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ తాను ఏ పరిస్థితుల్లో రాజీనామా చేస్తున్నదీ స్పష్టంగా తెలియజేశారని, దాన్ని కూడా రాజకీయం చేయడం చంద్రబాబు సైకో పార్టీకే చెల్లిందని అన్నారు. ఎవరిది విషపునీయతో ప్రజలు 2019లోనే తేల్చి చెప్పారని, సైకిల్‌ను తుక్కుతుక్కు చేశారని తెలిపారు. అయినా చంద్రబాబు సిగ్గు, ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.

సీఎం జగన్‌ వేసే ప్రతి అడుగులో సామాజిక న్యాయం పాటిస్తున్నారని చెప్పారు. ప్రజా నాడి తెలియకుండా ఇన్నాళ్లూ పాపి నాయుడి కళ్లకు గంతలు కట్టిన పచ్చ కుల మీడియాకు ప్లీనరీలో జనాన్ని చూసి కళ్లు బైర్లు కమ్మాయన్నారు. డెకాయిట్‌ బాబుకి మైండ్‌ బ్లాంక్‌ అయిందన్నారు.  చంద్రబాబు నార్సిసిస్టిక్‌ పర్సనాల్టీ అనే వ్యాధితో బాధపడుతున్నారని, నెగెటివ్‌ భావాలతో తీవ్ర మానసిక అలజడికి లోనవుతున్నారని చెప్పారు.

ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండటానికి అర్హుడు కాదని, రిటైర్‌ అయిపోతే ఆంధ్ర రాష్ట్రానికి, ప్రజలకు మంచిదని తెలిపారు. చేతకాని వాళ్లు, యుద్ధం చేయలేని వాళ్లు గోబెల్స్‌ ప్రచారాన్ని ఎన్నుకుంటారని, బాబు కూడా ఇదే కోవకు చెందిన వారని ఎద్దేవా చేశారు. పరాక్రమవంతులు, రణక్షేత్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడగలిగే వాళ్లు మాత్రమే పోరాడి విజయం సాధిస్తారని తెలిపారు. కానీ చంద్రబాబులాంటి వాళ్లు ఎప్పటికీ విజయం సాధించలేరని చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement