
సాక్షి, అమరావతి: ‘సేవ్ ఉత్తరాంధ్ర’ పేరుతో విశాఖ ప్రతిష్టను దెబ్బతీసేందుకు చంద్రబాబు చేస్తున్న కుట్రలు ఫలించవని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ వి.విజయసాయిరెడ్డి తెలిపారు. హేపెనింగ్ సిటీ వైజాగ్‌లో చంద్రబాబు బృందం ఆగడాలు చెల్లవని అన్నారు. రాజధాని అమరావతి నగర నిర్మాణం తేలిక కాదని చంద్రబాబుకు తెలిసి కూడా నాటకాలు ఆడారని శనివారం ఒక ప్రకటనలో దుయ్యబట్టారు.
ఉత్తరాంధ్రలో నిలువ నీడ దక్కదనే భయంతోనే సేవ్ ఉత్తరాంధ్ర అంటూ దుర్మార్గమైన నాటకానికి చంద్రబాబు వర్గీయులు తెరతీశారని చెప్పారు. కడుపుమంట, రాజకీయ అసూయతో టీడీపీ చేపట్టిన అబద్ధాల ప్రచారోద్యమం జనాదరణ లేక నీరుగారిపోతుందన్నారు. హైదరాబాద్ తన పాలనలోనే మహానగరం అయిందనే కల్ల»ొల్లి కబుర్లతో 2014లో విభజిత ఆంధ్రకు చంద్రబాబు సీఎం అయ్యారన్నారు.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ చావు దెబ్బతిన్నాక కూడా అమరావతి కబుర్లతోనే బాబు కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్ నాయకత్వంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టిందన్నారు. ఉత్తరాంధ్రకు గుండెకాయ విశాఖపటా్నన్ని రాష్ట్రానికి పాలన రాజధాని చేయాలని సంకల్పించిందని తెలిపారు. ఆర్థిక పునాదులు పటిష్టంగా ఉన్న వైజాగ్ వైఎస్సార్‌సీపీ పాలనలో శరవేగంతో ప్రగతి పథంలో పరుగులు తీస్తుందని చెప్పారు.
ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యతతో వ్యవహరించాల్సిన టీడీపీ వికృత చేష్టలతో ఉద్యమాల పేరిట విధ్వంసకాండకు తెగబడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అండ్ కంపెనీ అరాచక ఆందోళనలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తోంటే.. విశాఖను పాలన రాజధానిగా చూడడానికి ఇష్టపడని టీడీపీ చావు కేకలు పెడుతోందని అన్నారు. సీఎం జగన్ ప్రభుత్వం చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధ, చొరవతో విశాఖపట్నం బ్రాండ్ వాల్యూ ఊహించని రీతిలో పెరుగుతోందని తెలిపారు.