ఒంగోలు/సాక్షి, అమరావతి/గుడివాడ రూరల్: అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేదని సుప్రీంకోర్టు వెలువరించిన చరిత్రాత్మక తీర్పును స్వాగతిస్తున్నామని పలువురు ప్రజాప్రతినిధులు అన్నారు. అక్కడ పేదలు నివసించకూడదని చంద్రబాబు అండ్ కో ఎన్ని కుట్రలు పన్నినా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందు అవి నిలవలేదని చెప్పారు. ఇది సీఎం జగన్, పేదల విజయమని వ్యాఖ్యానించారు.
ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్, విద్య శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద్, మాజీ మంత్రి కొడాలి నాని బుధవారం వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. కుట్ర రాజకీయాలకు ఈ తీర్పు చెక్ పెట్టిందని చెప్పారు. అమరావతి భూముల్లో పేదలకు పట్టాలిస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందన్న చంద్రబాబు ఆలోచన విధానమేంటో స్పష్టమవుతోందన్నారు.
బాబు కుట్ర బట్టబయలు
పేద, బడుగు, బలహీన వర్గాలు, దళితుల సొంతింటి కల నెరవేర్చడానికి సీఎం వైఎస్ జగన్ సుప్రీంకోర్టు వరకు వెళ్లి.. చేసిన పోరాటం దళితులు, పేదలకు స్ఫూర్తిదాయకం. ఏపీసీఆర్‌డీఏ చట్టం సెక్షన్ 53(1)(డి) ప్రకారం 5 శాతం భూమిని పేదల నివాసాలకు కేటాయిస్తామని పేర్కొన్నారు. కానీ ఆ చట్టంలో ఉన్న అంశాన్ని ప్రభుత్వం అమలు చేసేందుకు ఆర్–5 జోన్‌ను ఏర్పాటు చేస్తే దానిని అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ అమరావతి రైతుల ముసుగులో పోరాటం చేసింది. ఇవ్వకూడదని భావించినప్పుడు చట్టంలో ఎందుకు పొందుపరిచారో చంద్రబాబు సమాధానం చెప్పాలి.
కేవలం వారి బినామీల భూములను కాపాడుకునేందుకు, భవిష్యత్‌లో రియల్ వ్యాపారం చేయాలనే దుర్మార్గమైన కుట్రతోనే అమరావతి భూ కుంభకోణం జరిగింది. ఈ స్కాం నిగ్గు తేల్చేందుకు న్యాయ స్థానం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం కూడా శుభదాయకం. 51 వేల మంది పేదలకు 900 ఎకరాల్లో పట్టాలు ఇచ్చే ప్రక్రియ మరో వారం పది రోజుల్లో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం అవుతుంది. తాము చేసిన మంచిని చూసి, ఓటు వేయండని మా నాయకుడు అడుగుతున్నారు. తాను చేసిన మంచి పని ఒక్కటీ చెప్పలేక చంద్రబాబు పొత్తులు, కుట్రలపై ఆధారపడ్డాడు.
– ఆదిమూలపు సురేష్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి
న్యాయం ఎప్పుడూ పేదల పక్షానే
పేదల పక్షాన న్యాయం ఉంటుందనడానికి ఈ తీర్పే నిదర్శనం. అమరావతిలో పేదలు ఉండకూడదని మూడేళ్లుగా అడ్డుకుంటున్న ధనిక వర్గాల కుట్రల నుంచి వేలాది మంది పేదలకు న్యాయం చేసిన కోర్టులకు ధన్యవాదాలు. ధనిక వర్గాలకే పరిమితమయ్యేలా స్వర్ణనగరంగా ఉండాలన్న పిడి వాదన నుంచి అమరావతి బయటపడటం సంతోషంగా ఉంది.
మంగళగిరిలో లోకేశ్‌ను ఓడించడానికే సీఎం వైఎస్ జగన్ పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నారని టీడీపీ నాయకులు ఎలా అనగలుగుతున్నారు? అంటే పేదలు ఉన్న చోట లోకేశ్ ఓడిపోతాడని టీడీపీ నేతలు కూడా నమ్ముతున్నారా? నిజ జీవితంలో హీరో అయిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని పెట్టి తీసే సినిమాలో టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడును విలన్‌గా, 420 బ్యాచ్‌ను ఆయనకు అసిస్టెంట్లుగా పెట్టాలి.
అవసరమైతే దర్శకుడు రాంగోపాల్ వర్మతో నేను స్వయంగా మాట్లాడుతాను. 2024 ఎన్నికల తర్వాత పవన్‌కు మిగిలేది ప్యాకేజీ డబ్బు, సినిమాలే. సునీల్ పకోడి (ఏపీ బీజేపీ ఇన్‌చార్జ్ సునీల్ ధియోధర్) లాంటి వాళ్ల వల్లే కర్ణాటకలో బీజేపీ పరిస్థితి దిగజారింది. చేసిన మంచి గురించి చెప్పకుండా, ఇక్కడకొచ్చి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ఇలాంటి వారిపై ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా దృష్టి పెట్టాలి.
– కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని), గుడివాడ ఎమ్మెల్యే
పేదలు ఉండొద్దనడానికి వారెవరు?
సీఆర్డీఏ పరిధిలో 50 వేల మందికి పైగా నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తే ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతుండటం దారుణం. అక్కడ పేద వారు ఉండకుండా చేయడానికి కుయుక్తులు పన్నుతున్నారు. రాజ్యాంగం తెలిసిన వారెవరూ ఇలాంటి చర్యలకు పూనుకోరు. సుప్రీంకోర్టు తీర్పుతోనైనా వారు కళ్లు తెరవాలి.
టీడీపీ అధికారంలోకి వస్తే అమరావతిలో పేదలకు కేటాయించిన ఇళ్ల నుంచి తరిమి కొడతామని ఇటీవల అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించడం దుర్మార్గం. ఆ ప్రాంతంలో అసలు పేదలు ఉండొద్దనడానికి వారెవరు? మా ప్రభుత్వం పేదల పక్షానే నిలబడుతుంది. సీఆర్డీఏ పరిధిలో ఇళ్ల స్థలాలు పొందిన వారందరికీ అవసరమైన వసతులు కల్పిస్తాం.
– బొత్స సత్యనారాయణ, విద్యా శాఖ మంత్రి
బాబు అండ్ కో కు చెంపపెట్టు
అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపులకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం శుభపరిణామం. రాష్ట్ర ప్రభుత్వానికి ఆ హక్కు ఉందని తీర్పు వెలువరించడం చంద్రబాబు అండ్ కోకు చెంపపెట్టు. పవన్.. పేదల పక్షమా? బాబు పక్షమా? అన్నది చెప్పాలి. సీఎం జగన్ గట్టిగా పేదల పక్షాన నిలచారు కాబట్టే పేదలకే ఇళ్ల స్థలాలు దక్కాయి.
పేదల మట్టి, చెమట వాసన అమరావతిలో ఉండకూడదా చంద్రబాబూ? అమరావతి.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్‌ల సొత్తు కాదు. తాటి చెట్టంత వయసొచ్చినా బాబులో మాత్రం మార్పు రాలేదు. రాష్ట్రంలో తిరగడానికి చంద్రబాబు, లోకేశ్‌లు అనర్హులు. ఈ రాష్ట్రానికి దిక్సూచి ఒక్క సీఎం వైఎస్ జగనే. దుర్మార్గపు ఆలోచనలకు టీడీపీ మూల్యం చెల్లించుకుంటుంది.
– నందిగం సురేష్, ఎంపీ
ఈ పెత్తందార్లకు పేదలంటే ద్వేషం
సుప్రీం తీర్పు చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది. పేదలకు సెంటు స్థలం ఇస్తుంటే ఓర్వలేని నాయకులు రాజకీయాలకు అనర్హులు. పేదలకు నివాసం కల్పించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయినా చంద్రబాబు అండ్ కో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పెత్తందార్లకు పేదలంటే ఎందుకంత ద్వేషం? సీఎం జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదవాలని కాంక్షిస్తే వీరు వ్యతిరేకించారు. పేదలకు ఇళ్ల స్థలాలిస్తుంటే ఈ మేధావులు, వామపక్షాల నేతలు ఎందుకు స్వాగతించరు?
– డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎమ్మెల్సీ
Comments
Please login to add a commentAdd a comment