టీడీపీకి సమాధి కట్టేది బీసీలే | YSRCP Leaders Fires On TDP And Chandrababu | Sakshi
Sakshi News home page

టీడీపీకి సమాధి కట్టేది బీసీలే

Published Wed, Dec 7 2022 4:49 AM | Last Updated on Wed, Dec 7 2022 4:50 AM

YSRCP Leaders Fires On TDP And Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి/పటమట (విజయవాడ తూర్పు): వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో డిసెంబర్‌ 7న బుధవారం నిర్వహించనున్న జయహో బీసీ సభతో టీడీపీ అధినేత చంద్రబాబుకి వణుకు మొదలైందని వైఎస్సార్‌సీపీ నేతలు ఎద్దేవా చేశారు. అందుకే అయ్యన్న, అచ్చెన్నలాంటి టీడీపీ జాగిలాలను తమపైకి వదులుతున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీకి సమాధి కట్టేది బీసీలేనని స్పష్టం చేశారు. టీడీపీలో బీసీలను జెండా మోసేవారిగానే చూశారన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ పాలనలోనే బీసీలు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా మూడున్నరేళ్ల పాలనలోనే సీఎం జగన్‌ బడుగు, బలహీనవర్గాలకు రూ.90,415 కోట్లు డీబీటీ, నాన్‌ డీబీటీ విధానంలో అందించారని కొనియాడారు. ఈ సందర్భంగా ఎవరేమన్నారంటే.. 

పెద్ద బీసీ.. సీఎం జగన్‌
శతాబ్దాల నుంచి బీసీలు వివక్ష అనుభవిస్తున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ బీసీలకు ఆత్మగౌరవంతోపాటు పాలనలో భాగస్వామ్యం కూడా కల్పించారు. పెద్ద బీసీ.. సీఎం జగన్‌ మాత్రమే. శతాబ్దాలుగా ఇనుప గజ్జెలతో మోతుబరి వ్యవస్థ మాపై నాట్యం చేస్తున్న తరుణంలో బీసీలంటే బ్యాక్‌వర్డ్‌ కాస్ట్‌ కాదు.. దేశానికే బ్యాక్‌ బోన్‌ అని సీఎం జగన్‌ నిరూపించారు. పార్టీ, ప్రభుత్వ పదవుల్లో బీసీలకు పెద్దపీట వేశారు. గత ప్రభుత్వంలో బీసీలకు చంద్రబాబు కేవలం రూ.965 కోట్లు బడ్జెట్‌ మాత్రమే కేటాయించారు.

వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా మూడేళ్లలోనే రూ.90,415 కోట్లు ఖర్చు చేశారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జడ్పీపీలు, సహకార సంఘాల డైరెక్టర్లు, చైర్మన్లు, కౌన్సిలర్లు, మున్సిపల్‌ చైర్మన్లు, కార్పొరేటర్లు, మేయర్‌లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, లోక్‌సభ, రాజ్యసభల్లో ఎంపీలుగా బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. గతంలో ఇంత పెద్ద మొత్తంలో పదవులు ఇచ్చిన దాఖలాలు లేవు. బీసీలు అధికంగా ఉండే విశాఖలో రాజధానిని ఏర్పాటు చేయడం బీసీల అభ్యున్నతికి చిహ్నం.
    – తమ్మినేని సీతారాం, శాసనసభ స్పీకర్‌

టీడీపీలో వణుకు మొదలైంది..
ఈ మూడున్నరేళ్లలోనే బీసీల్లో ఎంతో పేరు సంపాదించిన సీఎం వైఎస్‌ జగన్‌ను చూసి టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారు. వైఎస్సార్‌సీపీ జయహో బీసీ సభ అనగానే టీడీపీలో వణుకు మొదలైంది. బీసీలే టీడీపీకి సమాధి కడతారు. బీసీలకు ఏం చేశామో.. ధైర్యంగా మేం చెప్పుకోగలం. చంద్రబాబుకు ఆ ధైర్యం ఉందా? బీసీలకు బాబు వెన్నుపోటు పొడిచారు. బీసీల గురించి మాట్లాడే అర్హత టీడీపీ నేతలకు లేదు.

అయ్యన్నపాత్రుడు ఒక రోగ్‌. బీసీలను చంద్రబాబు ఓటింగ్‌ యంత్రాలుగానే చూశారు. ఒక్క బీసీకి కూడా రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇవ్వలేదు. సీఎం జగన్‌ ఏకంగా నలుగురు బీసీలను రాజ్యసభకు పంపించారు. బీసీల గుండెల్లో జగన్‌ ఉన్నారు. బాబు పునాదులు కదులుతున్నాయి. ఇదేం ఖర్మరా బాబూ అంటూ ప్రజలు విసుక్కుంటున్నారు. 
    –కారుమూరి వెంకట నాగేశ్వరరావు, పౌర సరఫరాల శాఖ మంత్రి 

బీసీల సంక్షేమంపై టీడీపీ నేతలవి పచ్చి అబద్ధాలు..
బీసీల సంక్షేమంపై టీడీపీ నేతల పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. 1995లో చంద్రబాబు టీడీపీని ఆక్రమించుకున్నాక ప్రతి సాధారణ ఎన్నికల్లో బీసీలకు 100 టికెట్లు ఇస్తామని చెప్పి ఆ మాట ఎందుకు నిలబెట్టుకోలేదు? దీన్ని ఎందుకు టీడీపీలోని బీసీ నాయకులు ప్రశ్నించలేకపోతున్నారు? బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు కాకుండా అడ్డుకున్నది టీడీపీకి చెందిన వ్యక్తి. ఇది వాస్తవం కాదా? కోర్టు ఆదేశాలు ఎలా ఉన్నా బీసీలకు మేలు చేయడానికి సీఎం జగన్‌ పార్టీ తరఫున రిజర్వేషన్లు అమలు చేశారు.

బీసీలకు ఏటా రూ.10 వేల కోట్ల చొప్పున రూ. 50 వేల కోట్లు ఇస్తామని చెప్పి, కేవలం రూ.14,246 కోట్లు మాత్రమే బాబు ఖర్చు చేశారు. సీఎం జగన్‌ తొలి ఏడాదిలోనే రూ.15 వేల కోట్లు ఖర్చు చేశారు. 5 చట్టాలు, 56 కార్పొరేషన్లు, 9 నవరత్నాలు, 18 ప్రత్యేక పథకాలు, 14 శాఖల పథకాలు ప్రవేశపెట్టారు. అలాగే బీసీ జనగణన చేయాలని శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి లేఖ సైతం పంపారు.
    – యనమల నాగార్జున యాదవ్, అధికార ప్రతినిధి, వైఎస్సార్‌సీపీ

బీసీలే ఎజెండా రూపకర్తలు
జయహో బీసీ సభకు వచ్చే బీసీ సోదరుల సునామీలో చంద్రబాబు కొట్టుకుపోతారు. దీంతో టీడీపీకి చెందిన బీసీ జాగిలాలను మా మీద దాడికి వదిలారు. అయ్యన్నపాత్రుడు ఒక గంజాయి డాన్, స్మగ్లర్‌. ఈఎస్‌ఐలో మందులు మెక్కిన అచ్చెన్నాయుడు, కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ల ద్వారా మహిళా జాతిని సర్వనాశనం చేసిన బుద్ధా వెంకన్న ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు.

బీసీలను చంద్రబాబు బానిసలుగా చూస్తే, అదే బీసీలకు రక్షగా సీఎం జగనన్న ఉన్నారు. టీడీపీలో బీసీలను జెండా మోసేవారిగానే చూశారు. అదే వైఎస్సార్‌సీపీలో బీసీలే ఎజెండా రూపకర్తలు. బీసీలు జడ్జీలుగా పనికిరారని చంద్రబాబు లేఖ రాసింది నిజమా? కాదా? కాదని లోకేష్‌ మీద ప్రమాణం చేయగలరా?
    – కొండా రాజీవ్‌గాంధీ, అధికార ప్రతినిధి వైఎస్సార్‌సీపీ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement