సాక్షి, అమరావతి: ‘సీఎం వైఎస్ జగన్ సారథ్యంలోని వైఎస్సార్‌సీపీ సర్కారు అమలుచేస్తున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలపై పక్కా ప్రణాళికతో కులనాగులు విషం కక్కుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఏం చెప్పదలచుకుందో ‘ఈనాడు’తో చెప్పిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలన్నీ రద్దుచేయాలనే కుట్రకు చంద్రబాబు అండ్ కో బరితెగించారు. తమకు పొరపాటున ఎవరైనా ఓటువేస్తే రాష్ట్రంలో పేదలకు అమలవుతున్న సంక్షేమ పథకాలకు సర్వ మంగళం పాడాలన్న చంద్రబాబు కర్కశ మనస్తత్వాని ఈనాడు పత్రిక అద్దంపట్టింది.
పేదలంటే వీరికి ఎంత కడుపుమంటో అర్థంమవుతోంది’.. అని ఉప ముఖ్యమంత్రి కె. నారాయణస్వామి, మంత్రులు మేరుగ నాగార్జున, గుడివాడ అమర్నాథ్‌లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘ప్రభుత్వం డబ్బు పంచే తమాషాలు ఆపాలి’.. అంటూ ఈనాడులో వచ్చిన కథనంపై వీరు ముగ్గురూ మంగళవారం వేర్వేరుగా నిర్వహించిన మీడియా సమావేశాల్లో స్పందించారు. ‘ప్రభుత్వం ఏవో రెండు మూడు కార్యక్రమాలు అమలుచేస్తూ మిగిలిన వాటిని నిలిపివేస్తేనే మనకు మనుగడ ఉంటుంది’ అని మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంతో చెప్పించి ఈనాడులో ప్రచురించడం దుర్మార్గమన్నారు. వారు ఇంకా ఏమన్నారంటే..
ఆ ఐఏఎస్‌లు అప్పుడేం చేశారు?
పేదలకు ఆగర్భ శత్రువుల్లా మాట్లాడటం దారుణం. తాను అధికారంలోకి వస్తే ప్రస్తుతం అమలులో ఉన్న సంక్షేమ పథకాలను రద్దుచేస్తాననే సంకేతాన్ని ‘ఈనాడు’ ద్వారా చంద్రబాబు ఇచ్చారు. సంక్షేమ పథకాల అమలుతో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నదంటూ మాజీ ఐఏఎస్‌లు మాట్లాడం దారుణం. ఈనాడులో రాసిన వార్తకు వంతపాడిన ఐఏఎస్ అధికారులిద్దరూ గత ప్రభుత్వ హయాంలో కీలక పదవుల్లో పనిచేశారు.
అప్పుడు చంద్రబాబు పెద్దఎత్తున అప్పులు తెచ్చిన సొమ్మును దుర్వినియోగం చేస్తుంటే.. అలాగే, పోలవరం చూడటానికి, సింగపూర్ ఏజెన్సీకి, అమరావతి డిజైన్లకు చంద్రబాబు వందలాది కోట్లు దుబారా చేస్తుంటే వీరిరువురూ ఏంచేశారు? రాష్ట్రంలో పేదలందరూ బాగుండాలన్నది సీఎం వైఎస్ జగన్ ఆలోచనైతే.. టీడీపీ నేతలు మాత్రమే బాగుండాలన్నది చంద్రబాబు నైజం. జగన్ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం జరగలేదు. కానీ, చంద్రబాబు అధికారంలో ఉండి ఉంటే.. సంక్షేమ పథకాలకు ఖర్చుచేసే సొమ్ములో సగం టీడీపీ నేతలకు, జన్మభూమి కమిటీల్లోని ఆ పార్టీ కార్యకర్తలు, ఆయన జేబుల్లోకి చేరేవి.
మంత్రివర్గంలో 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్ అవకాశమిస్తే దానిని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నాడు. ఎలాగైనా చంద్రబాబును మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ5 నాయుడు తపనపడుతున్నారు. కానీ.. అది జరగని పని. మీ కుట్రలను ప్రజలు డేగకళ్లతో గమనిస్తున్నారు. వారు మళ్లీ కొట్టే దెబ్బకు చంద్రబాబు అండ్ కోకు కూసాలు కదలడం ఖాయం.
పథకాలపై ఎల్లో బ్యాచ్ ఉద్దేశం ఇదా?
► అమ్మఒడి, చేయూత, వైఎస్సార్ ఆసరాను ఆపేయాలా?
► 52.4 లక్షల రైతు కుటుంబాలకు అందించిన వైఎస్సార్ ‘రైతుభరోసా’ను నిలిపేయాలా?
► 31 లక్షల కుటుంబాలకు లబ్ధిచేకూర్చే ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం చెయ్యొద్దా?
► విద్యా దీవెన, వసతి దీవెన, పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యా కానుకను అడ్డుకోవాలనేది వారి ఉద్దేశమా?
► జగనన్న గోరుముద్ద పథకానికి మంగళం పాడాలా?
► ఆసుపత్రులను చక్కగా తీర్చిదిద్దుతున్న నాడు–నేడు పథకాన్ని అటకెక్కించాలా?
► చంద్రబాబు మాదిరిగా రైతులకు సున్నావడ్డీ, పంటల బీమాను ఆపేయాలా?
► అలాగే, డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ రుణాలు ఆపేయాలన్నది రామోజీరావు, చంద్రబాబు ఉద్దేశమా?
► వైఎస్సార్ పెన్షన్ కానుక కూడా ఇవ్వొద్దా?
► వైఎస్సార్ నేతన్న నేస్తం, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం వంటి పథకాలను నిలిపివేయాలా?
► జగనన్న చేదోడు, జగనన్న తోడు, వైఎస్సార్ వాహన మిత్ర వంటి పథకాలను ఏం చేయాలన్నది మీ ఉద్దేశ్యం?
► వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, ఆసరా వంటి గొప్ప పథకాలను అటకెక్కించాలా?
► వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాన్ని ఆపేయాలా?
Comments
Please login to add a commentAdd a comment