
వేదికపై ప్రసంగిస్తున్న శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: గతంలోని టీడీపీ ప్రభుత్వం నిమ్న వర్గాలను పట్టించుకోలేదని, అందుకే వారంతా తిరగబడి వైఎస్ జగన్‌ను తమ నాయకుడిగా ఎన్నుకున్నారని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. అధికారంలోకి వచ్చాక బడుగు, బలహీన వర్గాలను సీఎం వైఎస్ జగన్ అక్కున చేర్చుకున్నారని.. అందుకే ఇది బడుగుల ప్రభుత్వమని ఆయన తెలిపారు.
సామాన్యుల సంక్షేమమే ఈ ప్రభుత్వ ధ్యేయమని తమ్మినేని సీతారాంతో పాటు మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకరరావు తదితరులు పునరుద్ఘాటించారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో మంగళవారం సామాజిక సాధికార యాత్ర జరిగింది.
ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2.40 లక్షల కోట్ల నగదును సంక్షేమ పథకాల రూపంలో ముఖ్యమంత్రి జగన్ పేద ప్రజల ఖాతాల్లో జమచేశారని, ఈ లబ్ధిదారుల్లో టీడీపీ బూత్ ఏజెంట్లు కూడా ఉన్నారన్నారు. అందుకే తనవల్ల మంచి జరిగితేనే ఓటు వేయాలని సీఎం ధైర్యంగా అడుగుతున్నారని ఆయన తెలిపారు.
పెత్తందారీ వ్యవస్థలో బడుగులకు విముక్తి కలిగించేందుకే ఆయన శ్రమిస్తున్నారని స్పష్టంచేశారు. ఒక్కసారి ఫ్యాన్ గుర్తుకు ఓటువేస్తేనే జగన్ ఇంతలా సంక్షేమ పథకాలు అమలుచేస్తుంటే మరోసారి ఎన్నుకుంటే ఇంకెంత మంచి చేస్తారో జనం ఆలోచించాలన్నారు.
విపక్షాలు విమర్శించడానికి వీల్లేకుండా సంక్షేమం..
మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. దేశంలో 75 ఏళ్ల తర్వాత కూడా సామాజిక అంతరాలు, ప్రజల జీవన స్థితిగతులు నిర్లిప్తంగా పడిఉంటే జగన్ మాత్రమే వాటిని రూపమాపడానికి కృషిచేశారన్నారు. ప్రతిపక్షాలు సైతం విమర్శలు చేయడానికి ఆస్కారం లేకుండా రాష్ట్రంలో సంక్షేమ పాలన అందించగలుగుతున్నామన్నారు.
ఉద్యోగాల కోసం మాట్లాడుతున్న విపక్షాలు రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ 2 లక్షల సచివాలయ ఉద్యోగాలు ఇచ్చిన సంగతిని గుర్తుతెచ్చుకోవాలన్నారు. విశాఖను రాజధాని చేస్తానంటే టీడీపీ నేతలు ఎందుకు వద్దంటున్నారో చెప్పాలని ధర్మాన అన్నారు.
సామాన్యుల స్థితిగతుల్లో సమూల మార్పులు..
ఇక జగన్ సీఎం కాక మునుపు రాష్ట్రంలో సామాన్యుల జీవన పరిస్థితులు అధ్వానంగా ఉండేవని, ఇప్పుడు ఆయన వాటిని సమూలంగా మార్చివేశారని మంత్రి సీదిరి అప్పలరాజు కొనియాడారు. వెనుకబడిన కులాలకు జగన్‌మోహన్‌రెడ్డి ఒక అంబేడ్కర్ అని అభివర్ణించారు. బీసీల ఆత్మగౌరవాన్ని అవమానించిన చంద్రబాబు ఎక్కడ, రాజ్యాధికారం ఇచ్చి అన్ని అవకాశాలు కల్పించి, ఆత్మగౌరవాన్ని నిలిపిన సీఎం జగన్ ఎక్కడో ప్రజలు ఆలోచించాలన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలే అధికంగా చదువుతున్నారని, నాడు–నేడుతో ఆ బడులను సీఎం బాగుచేశారని మంత్రి అప్పలరాజు గుర్తుచేశారు. బడులు, ఆస్పత్రులను చంద్రబాబు నిర్లక్ష్యంచేస్తే జగన్ వాటిని ఆధునీకరించారన్నారు. ఆమదాలవలస గడ్డ వైఎస్సార్‌సీపీ అడ్డా అంటూ అప్పలరాజు ప్రజలతో కలిసి నినదించారు.
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో జరిగిన సామాజిక సాధికార యాత్ర సభకు భారీగా హాజరైన జనసందోహంలో ఓ భాగం
సామాజిక న్యాయం చేసింది ముఖ్యమంత్రి జగనే..
ప్రభుత్వ సలహాదారులు జూపూడి ప్రభాకరరావు ప్రసంగిస్తూ.. చంద్రబాబు దొంగ దీక్షలను ప్రజలు నమ్మబోరన్నారు. ఆయన తన 40ఏళ్ల రాజకీయ జీవితంలో రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను బాబు కనీసం పట్టించుకోలేదని, వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాతే సామాజిక న్యాయం జరిగిందన్నారు.
సామాజిక న్యాయం వైఎస్ జగన్‌తోనే సాధ్యం
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు, నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ.. ప్రజలకు సామాజిక న్యాయం జరగాలంటే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని స్పష్టంచేశారు. మంత్రివర్గ కూర్పు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్లు, ట్రస్టు ఛైర్మన్లు, మార్కెట్ యార్డులు.. ఇలా అన్నింటా సామాజిక న్యాయం పాటిస్తూ సీఎం జగన్ పదవులు అందించారని గుర్తుచేశారు. ఎన్ని పార్టీలు ఏకమైనా జగనన్న ఒక్కరే పోటీకి వస్తారని, మంచిచేసే పార్టీకి ప్రజలు న్యాయం చేస్తారని కృష్ణదాస్ ధీమా వ్యక్తంచేశారు.
ఈ యాత్రలో వైఎస్సార్‌సీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, గొర్లె కిరణ్‌కుమార్, విశ్వసరాయి కళావతి, కంబాల జోగులు, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, పాలవలస విక్రాంత్, జెడ్పీ చైర్‌పర్సన్ పిరియా విజయ, కేంద్ర మాజీమంత్రి కిల్లి కృపారాణి, సామాజిక వర్గాల కార్పొరేషన్ చైర్మన్లు అంధవరపు సూరిబాబు, పేరాడ తిలక్, మామిడి శ్రీకాంత్ పాల్గొన్నారు.
అడుగడుగునా జననీరాజనం..
ఇక ఈ సామాజిక సాధికార యాత్రకు ప్రజలు తండోపతండాలుగా జనం తరలివచ్చారు. బస్సు యాత్రకు అడుగడుగునా నీరాజనాలు పలికారు. ఆమదాలవలస కోర్టు జంక్షన్ సమీపంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభకైతే కనీవినీ ఎరుగని రీతిలో బడుగు బలహీన వర్గాల వారు హాజరయ్యారు. అంతకుముందు.. వాకలవలసలో ప్రెస్‌మీట్‌తో ప్రారంభమైన యాత్ర మోటార్ బైక్‌ల ర్యాలీతో ముందుకు సాగింది. దారిపొడవునా జనం బారులు తీరి నిల్చున్నారు.
Comments
Please login to add a commentAdd a comment